తిరుపతి మంగళం : రాయలసీమలో సాగునీరు, తాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలు కనిపించవా చంద్రబాబు అని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కో–ఆర్డినేటర్ వెలకచర్ల గోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన బుధవారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీమ రైతులు, ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచింది మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ పనులను 80 శాతం పూర్తి చేసిన ఘనత జగనన్నదే అని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సర్కారుతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన చేపడితే అడ్డుకోవడం చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. రైతు ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.


