తిరుపతి మంగళం/చిత్తూరు కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి నియోజకవర్గానికి చెందిన ఎన్వీ రమణారెడ్డిని పార్టీ ప్రచార కమిటీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా నియమించారు. అలాగే చిత్తూరు జిల్లా క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా చిత్తూరు నియోజకవర్గానికి చెందిన జాషువా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
నేడు ఉద్యోగ మేళా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్‌లో గురువారం తిరుపతికి చెందిన డ్రీమ్ ఫౌండేషన్, జైషెర్ డిజేబిలిటీ ట్రస్ట్ సంయుక్తంగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని విభిన్న ప్రతిభావంతులు గురువారం ఉదయం 10 గంటలకు ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం వద్దకు హాజరుకావాలన్నారు. 19 నుంచి 32 ఏళ్లలోపు ఉండి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. రూ.20 వేల జీతంతో తిరుపతి, బెంగళూరు, చైన్నె నగరాల్లోని కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కల్పించనున్నట్టు తెలిపారు. వేరేవారి సహాయం లేకుండా తమ పనులు తాము చేసుకోగలిగిన శారీరక సామర్థ్యం కలిగి ఉండాలన్నారు. ఇతర వివరాలకు 9985580557 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
టీటీడీకి 12 టన్నుల
కూరగాయల వితరణ
పలమనేరు: పట్టణంలోని కూరగాయల మార్కెట్ నుంచి 12 టన్నుల కూరగాయలను తిరుమల శ్రీవారి అన్నదాన సత్రానికి వితరణ చేశారు. వాటిని బుధవారం శ్రీవారి సేవకులు టీటీడీ వాహనంలో పంపారు. అంతకుముందు వాహనానికి పూజలు చేశారు. గోవింద నామస్మరణల మధ్య వాహనాన్ని తిరుమలకు తరలించారు. కార్యక్రమంలో దాతలు పూసల రవి, ఇంటి సంపత్, దొరస్వామినాయుడు, పలువురు రైతులు పాల్గొన్నారు.
అక్టోబర్ 3న
తుది ఓటరు జాబితా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో తుది ఓటరు జాబితాను అక్టోబర్ 3వ తేదీన ప్రచురించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పారదర్శకంగా, తప్పుల్లేకుండా ఓటరు జాబితాను రూపొందించేందుకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఓటరు దరఖాస్తులు, అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలను నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
30న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నీట్ పీజీ ప్రవేశ పరీక్షను ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో గుర్తించిన కేంద్రాల్లో ఉదయం 7 నుంచి అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఉదయం 8.30 గంటలలోపు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని, పరీక్ష ఉదయం 9 ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుందని అధికారులు తెలిపారు.
గిరిజన యువతకు
ఉచిత వృత్తి విద్యాశిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : గిరిజన యువతకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో రెండు ప్రత్యేక వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్టీ కార్పొరేషన్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఐటీడీఏ నెల్లూరు ఆధ్వర్యంలో వెంకటాచలంలోని వైటీసీ కేంద్రంలో శిక్షణ ఉంటుందని, అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. రిటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, డొమెస్టిక్ బయోమెట్రిక్ ఆపరేటర్ కోర్సులు ఉన్నాయని తెలిపారు. వివరాలకు 8187899877 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


