కార్వేటినగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అరాచక పాలనకు చెక్ పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పిలుపునిచ్చారు. వారు బుధవారం పుత్తూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందజేసిన సంక్షేమాల కన్నా రెండింతలు ఇస్తానని మహిళలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు నేడు గాలిమాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి ఇస్తానని రెండున్నరేళ్లు వస్తున్నా పట్టించుకోలేదన్నారు. అధికారం కోసం ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమని తెలిపారు. ప్రతి పక్షంలో ఉన్నంత కాలం నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పుడు రాష్ట్రాన్ని గంజాయికి నిలయంగా మార్చారని ఆరోపించారు. కూటమి నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్నారని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి గట్టిగా గుణపాఠం చెప్పాలన్నారు. స్థానిక ఎన్నికలతోనే వైఎస్సార్ సీపీ విజయానికి నాంది పలకాలని, గతంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కృపాలక్ష్మిని పరామర్శించిన భూమన
డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆదేశాల మేరకు జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సమన్వయకర్త కృపాలక్ష్మి నిరసన తెలిపారు. భారీ ర్యాలీని భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఆ సమయంలో ఒక పోలీసు అధికారి బారికేడ్‌ను కృపాలక్ష్మి కాలుపై తోసేయడంతో కాలికి గాయాలయ్యాయి. విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు వల్లివేడు పృథ్విరెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం తీసుకుని త్వరగా ప్రజా క్షేత్రంలోకి రావాలని సూచించారు. ఈ క్రమంలో భాగంగా భూమన కరుణాకరరెడ్డిని శాలువతో ఘనంగా సన్మానించారు.


