ఖజానాలో నిధులున్నా ఫైళ్లను కదపని పాలకులు
పరికరం పేరు యూనిట్లు
హార్వెస్టింగ్ 8
స్ప్రేయర్లు 410
హాస్ట్ హార్వెస్టింగ్ 9
పవర్ టిల్లర్ 29
చాప్‌కటర్స్ 23
ట్రాక్టర్లు 20
కల్టివేటర్లు 59
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం, ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో ప్రభు త్వం విఫలమైంది. అలాగే వేరుశనగ విత్తనాల పంపిణీలో తీవ్ర ఆలస్యం, నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నీరుగార్చేసింది. సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద సబ్సిడీ యంత్రాల పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ అమలు చేయడంలో మీనమేసాలు లెక్కిస్తోంది.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేస్తామని ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. వాటిని పొందడానికి నిబంధనలను విధించింది. లబ్ధిదారులకు సొంత భూమి ఉండడంతో పాటు, కనీసం మూడు సార్లు ఈ–పంట రికార్డులలో నమోదు చేయించి ఉండాలని, గతంలో ఎప్పుడూ ప్రభుత్వం నుంచి ఇలాంటి సబ్సిడీలు పొంది ఉండకూడదని మెలికలు పెట్టింది. ఈ నిబంధనల ప్రకారం భూమి రికార్డులను సమర్పించిన రైతుల ఆన్‌లైన్ దరఖాస్తులను జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హుల జాబితాపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సంతకం చేస్తే మరో పదిహేను రోజులకు సబ్సిడీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని స్పష్టం చేసింది. మే నెలలోనే 1950 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా ఇంతవరకు రాయితీ ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను పంపిణీ చేయలేదు.
అరకొర కేటాయింపులే
వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గించడం, కూలీల కొరతను అధిగమించడం కోసం ప్రభుత్వం యంత్ర పరికరాలపై సబ్సిడీలు ప్రకటించిన పథకం అమలు తీరుపై రైతుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఈ సారి యంత్ర పరికరాల అందజేతకు ప్రభుత్వం జిల్లాకు రూ.2.02 కోట్ల మేర నిధులు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పవర్‌టిల్లర్లు, స్ప్రేయర్లు తదితర యంత్ర పరికరాలు ఇస్తామని తెలిపింది. రైతుల అవసరాలకు సరిపడా పరికరాలు లేకపోవడంతో జిల్లాలో అసంతృప్తి పెరుగుతోంది. ట్రాక్టర్ల కోసం 1,950 దరఖాస్తులు రాగా ప్రభుత్వం కేటాయించింది 20 మాత్రమే. కల్టివేటర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక్కో మండలంలో డజన్ల కొద్దీ రైతులు దరఖాస్తు చేసుకుంటే అక్కడికి ఒకటి లేదా రెండు యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి.
ఖరీఫ్ ముగుస్తున్నా అందని పథకం
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 25 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ పనులు చేసుకునేందుకు వీలుగా సబ్సిడీ యంత్రాలను అందజేసి ఉంటే ఎంతో లబ్ధి చేకూరేదని రైతులు వాపోతున్నారు. దుక్కులు దున్నే సమయం, నాట్లు వేసే సమయం దాటిపోయిన తర్వాత యంత్రాలు ఇస్తే ఏమి ఉపయోగమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఈ కూటమి ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని వీడి, వెంటనే లాటరీ ప్రక్రియను పూర్తి చేసి సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాలను అందించాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.


