బంగారుపాళెం : మండలంలోని మొగిలి వద్ద మంగళవారం రాత్రి సిమెంట్ మిక్చర్ వాహనం ఢీకొని ఎక్స్‌ప్రెస్ హైవే పనులు చేస్తున్న కార్మికుడు మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. బీహార్ రాష్ట్రం రాంపూర్ గ్రామానికి చెందిన ఇంద్రజిత్ మాంగీ కుమారుడు ముకేష్‌మాంగీ రెండేళ్ల నుంచి మొగిలి వద్ద జరుగుతున్న ఎక్స్‌ప్రెస్ హైవే పనులు చేస్తున్నాడు. మంగళవారం రాత్రి మొగిలి ప్లాంట్ సమీపంలో బ్యాచింగ్ ప్లాంట్ వద్ద సిమెంట్ మిక్చర్ వాహనం లోడ్ చేసుకుని డ్రైవర్ వాహనం రివర్స్ చేస్తుండగా వెనుకవైపు ఉన్న ముకేష్‌మాంగీ(29)ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముకేష్‌మాంగీ తలపై వెనుక చక్రం ఎక్కిదిగడంతో నుజ్జునుజ్జై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


