ముగియనున్న ప్రస్థానం | - | Sakshi
Sakshi News home page

ముగియనున్న ప్రస్థానం

Aug 27 2026 1:42 AM | Updated on Aug 27 2026 1:42 AM

సెప్టెంబర్‌ 24న ముగియనున్న జెడ్పీ పాలకవర్గ పదవీకాలం మూడు ముక్కలు కానున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్‌ 1962 నుంచి మనుగడలో జెడ్పీ ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు

చిత్తూరు కార్పొరేషన్‌: కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌ను విభజించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి, అన్నమయ్య జిల్లాలు విడిపోయాయి. మిగిలిన చిత్తూరు జిల్లాకు ప్రస్తుతమున్న జెడ్పీ పరిమితం కానుంది. ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం సెప్టెంబర్‌ 24న ముగియనుంది. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో వాటిని అందిపుచ్చుకునేందుకు పాలకవర్గాలు కచ్చితంగా ఉండాల్సిన అవసరముంది. లేకుంటే నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రజా పరిషత్‌లకు పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మండలాల వారిగా ఓటరు జాబితాల రూపకల్పన, రిజర్వేషన్‌ ప్రకారం వార్డులు, గ్రామాలు, మండలాలను కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌తో సంబంధం లేకుండా 2026 జనవరి 1న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితా ఆధారంగా క్షేత్రస్థాయిలో వార్డు, గ్రామ మండల స్థాయిలో ఓటర్లను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల రిజర్వేషన్‌ కేటాయింపునకు ఇదే కీలకం కానుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 65 జెడ్పీటీసీలు, 877 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. విభజన తర్వాత చిత్తూరు జిల్లాలో 27 జెడ్పీటీసీలు, 370 ఎంపీటీసీ స్థానాలు, తిరుపతి జిల్లాలో 19 జెడ్పీటీసీలు, 253 ఎంపీటీసీలు, అన్నమయ్య జిల్లాలో 19 జెడ్పీటీసీలు 254 ఎంపీటీసీ స్థానాలు ఉంటాయి.

109 ఏళ్ల భవనం

జెడ్పీ కార్యాలయాన్ని 1917 జనవరి 18న బ్రెయిడ్‌ఉడ్‌ ఐసీఎస్‌ ప్రారంభించారు. 109 సంవత్సరాలుగా ఉన్న ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తోంది. అప్పటి కాలం ఇంజినీర్లు, పని విధానానికి ప్రతీకగా ఉంది. ఇప్పటికీ మరమ్మతులు చే స్తున్నా పెద్ద స్థాయిలో ఏమీ చేయలేదు. అప్పటి కాలం తలుపులు, కిటీకీలు మార్చకుండా వాడుతున్నారు.

1962 నుంచి మనుగడలో

1959లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ పంచాయత్‌ సమితి, జిల్లా ప్రజా పరిషత్‌ చట్టం ప్రకారం జిల్లా ప్రజా పరిషత్‌ ఏర్పడింది. అంతకు ముందు బ్రిటీష్‌ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా బోర్డు వ్యవస్థలో 1921 – 59 వరకు పలువురు ప్రముఖులు అధ్యక్షులుగా కొనసాగారు. జెడ్పీల పాలకవర్గం ఎన్నికయ్యాక 1962లో అద్దూరి బలరామరెడ్డి మొదటి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. గత 64 సంవత్సరాల్లో 31 మంది చైర్మన్లుగా వ్యవహరించారు. అందులో 12 మంది స్పెషల్‌ ఆఫీసర్లుగా కలెక్టర్లు, జేసీ పాలన సాగించారు. వరుసగా చూస్తే రెడ్డివారి నాదమునిరెడ్డి, నాగిరెడ్ది, రామలింగారెడ్డి, విశ్వనాథరెడ్డి, రామస్వామి, కుతూహలమ్మ, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్‌, రామేగౌడు, శ్రీనాథరెడ్డి, శ్రీనివాస్‌, సిద్దరామరెడ్డి, గోవిందస్వామి, రెడ్డెమ్మ, సుబ్రమణ్యంరెడ్డి, కుమార్‌రాజా, గీర్వాణి పనిచేశారు. ఉమ్మడి చివరి జెడ్పీ చైర్మన్‌గా గోవిందప్ప శ్రీనివాసులు పనిచేశారు. అలాగే ప్రత్యేకాధికారులుగా కలెక్టర్లు రాజాజీ, రామకృష్ణయ్య, సంపత్‌, సుబ్బారావు, జనార్దన్‌నాయుడు, ఆనంద్‌, వెంకటేశ్వర్లు, సాల్మన్‌ ఆరోగ్యరాజ్‌, రాంగోపాల్‌, నారాయణభరత్‌గుప్తా, మార్కండేయులు, హరినారాయణన్‌ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటి వరకు 65 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొత్త జిల్లాల ప్రాతిపదికన తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఆయా జిల్లాల పరిధిలోని పరిస్థితుల ఆధారంగా కొత్తగా జెడ్పీటీసీలను, చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికలకు సిద్ధమవుతూ ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement