ఇష్టారాజ్యంగా నియామకాలు నామమాత్రమైన ఆలయ పాలక మండళ్లు? ఆగమేఘాలపై ప్రమాణాలు.. ఆపై అభివృద్ధి శూన్యం రూ.లక్షల్లో ముడుపులు.. పక్కనబెట్టిన సంప్రదాయాలు కష్టపడిన సీనియర్లను ముంచేసి.. కొత్త ముఖాలకు పీఠాలు చిత్తూరు నుంచి కుప్పం వరకు మండిపడుతున్న నేతలు, భక్తుల
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయాల పాలక మండళ్ల నియామకాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పవిత్రమైన క్షేత్రాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా, వ్యాపార వేదికలుగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో 6ఏ కింద 4, 6బీ కింద 4, 6సీ కింద 22 కలిపి మొత్తం 30 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. వీటికి పాలక మండలి సభ్యుల నియామకం పూర్తయి నెలలు గడుస్తోంది. ఆగమేఘాల మీద ప్రమాణ స్వీకారం చేశారు. అభివృద్ధి పనుల్లో మాత్రం శూన్యం కనిపిస్తోంది.
సంప్రదాయాలకు మంగళ హారతి
తరతరాలుగా వస్తున్న ఆచారాలు, స్థానికత, ఆలయ అభివృద్ధికి తోడ్పడే సామాజిక వర్గాలను పక్కనబెట్టిన కూటమి పెద్దలు తమ వారికి పదవులు కట్టబెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు నగరం గిరింపేటలోని దుర్గాంబ ఆలయ చైర్మన్ పదవిని సంప్రదాయంగా స్థానికంగా ఉన్న రెడ్డి, బలిజ సామాజికవర్గాలకే ఇచ్చేవారు. ఈసారి బజారు వీధిలోని ఓ వ్యక్తికి కట్టబెట్టారని సొంత పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఈ పదవి కోసం ఏకంగా రూ.20 లక్షల వరకు ఓ కీలక నేతకు ముడుపులు ఇచ్చినట్టు ఆరోపిస్తున్నారు. అలాగే రాములుగుడివీధిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో స్థానిక ఆర్యవైశ్యులకు ప్రాధాన్యం ఇవ్వడం ఆనవాయితీ. కూటమి నేతలు ఇక్కడ కూడా నిబంధనలను తలకిందులు చేసి కొంగారెడ్డిపల్లికి చెందిన వ్యక్తికి పదవి ఇచ్చారని స్థానికుల వాదన. పొన్నియమ్మ గుడివీధిలోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయంలో కూడా కొత్త ముఖాలకు పదవి ఇచ్చారని పలువురు పార్టీ సీనియర్లు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక్కడ నియమించిన కమిటీ సభ్యులలో మెజారిటీ ముఖాలు ఇన్నాళ్లూ పార్టీలో కనీసం కనిపించనివే. పార్టీ కోసం జెండాలు మోసిన సీనియర్లను విస్మరించి, నిన్నగాక మొన్న వచ్చిన కొత్త ముఖాలకు పదవులు ఇవ్వడంపై వారు భగ్గుమంటున్నారు.
పట్టించుకోరా సామీ
పదవులు దక్కించుకున్న చైర్మన్లు, పాలక మండలి సభ్యులు ఆలయాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఒకటి రెండు ఆలయాలు మినహా మిగిలిన చోట్ల అభివృద్ధి పనులు జరగడం లేదు. ఆలయాల జీర్ణోద్ధరణ, పాలకమండలి సమావేశాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు, నిత్య పూజాకైంకర్యాల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. పాలక మండలి సభ్యులు కనీసం మీటింగ్‌లకు కూడా రావడం లేదని, అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని విసిగిపోయిన ఆలయ అధికారులు, అర్చకులు ఏకంగా స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు
ఇలాంటి నియామకాలు చిత్తూరు నగరానికే పరిమితం కాలేదు. జిల్లాలోని బంగారుపాళ్యం, తవణంపల్లి, కుప్పం, నగరి, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లోని ప్రధాన ఆలయాల్లోనూ జరిగాయి. ఆలయ అభివృద్ధికి పాటుపడే వారిని కాదని, సొంత సామాజిక వర్గానికి, ముడుపులు ఇచ్చిన వారికి పదవులు కట్టబెట్టారంటూ కూటమిలోని సీనియర్ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. భక్తుల విశ్వాసాలతో చెలగాటమాడుతూ, ఆలయ పరిపాలనను భ్రష్టు పట్టించిన కూటమి నేతలకు రాబోయే రోజుల్లో భక్తులే బుద్ధి చెబుతారని స్థానికులు, సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు.
నిబంధనలకు నీళ్లు


