కుప్పం: సంచలనం రేపిన మల్లప్పకొండపై హత్య కేసును పోలీసులు చేధించారు. శనివారం కుప్పం డీఎస్పీ పార్థసారథి ఈ మేరకు కేసు వివరాలను వెల్లడించారు. వివాహేతర సంబంధం కోసమే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆయన కథ నం మేరకు.. శాంతిపురం మండలం బోయినపల్లెకు చెందిన హాసినికి తమిళనాడు సూలగిరికి చెందిన రమేష్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. హాసి ని గతంలోనే అదే గ్రామానికి చెందిన గంగాధర్ తో ప్రేమ వ్యవహారం నడుపుతుండేది. పెళ్లి అయి న తర్వాత కూడా ప్రియుడితో సంబంధం కొనసాగిస్తుండగా, భర్త రమేష్ పలుమార్లు మందలించాడు. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు గా ఉన్నాడని భావించిన హాసిని తన ప్రియుడు గంగాధర్‌తో కలిసి రమేష్‌ను అడ్డు తొలగించుకునేందుకు పన్నాగం పన్నింది. ఈ క్రమంలో పుట్టింటికి వచ్చింది. అనంతరం గత మంగళవారం మల్లప్పకొండపై మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లాలని భర్తతో హాసిని పట్టుపట్టింది. కాదనలేక రమేష్ ఆలయానికి తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. ఈ విషయాన్ని ప్రియుడు గంగాధర్‌కు హాసిని చేరవేసింది. ఈ క్రమంవలోనే ముందుగా మల్లప్పకొండప్రాంతానికి గంగాధర్ తన స్నేహితులు పవన్, సంతోష్, శేఖర్, సురేంద్ర , శ్యామన్, శివతో కలిసి చేరుకుని మాటువేశారు. మధ్యాహ్నం ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న రమేష్‌ను కొండ మూడో మలుపు వద్ద అడ్డుకుని కత్తులతో దాడి చేసి హతమార్చారు. తర్వాత నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంగాధర్‌తో పాటు ఆరుగురు నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. శ్యామన్, శివ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.


