బైరెడ్డిపల్లె : రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నామంటూ ప్రజలను మభ్యపెడుతూ ప్రజల ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పనిచేస్తున్నారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం మాజీ జెడ్పీ చైర్మన్ మొగసాల రెడ్డెమ్మ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సంపద సృష్టించి దాన్ని ప్రజలకు పంచిపెట్టి నిరుపేదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబునాయడు ఎన్నికల్లో ప్రగల్భాలు పలికారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను ప్రయివేట్ వ్యక్తులకు అప్పనంగా అప్పగిస్తున్నారని ఆరోపించారు. పేదలకు సంక్షేమ పథకాల ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు బస్తా ఎరువు, వేరుశనగ విత్తనాల కోసం అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. టమాటా, మామిడి పంటలకు గిట్టుబాటు ధరలు లేక కాయలను రోడ్డు పక్కనే పారబోస్తున్నారని తెలిపారు. ఒక వైపు రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడే సూచనలు లేవన్నారు. 70 శాతం మంది పల్లెల్లో రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, అన్నదాతలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే దారి లేదన్నారు. అప్పులుచేసి రాజధాని పేరుతో నిధులు దుర్వినియోగం చేసే బదులు వ్యవసాయనికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు. జిల్లాలో ఇసుక మాఫియా రాజ్యమేలుతున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యారని తెలిపారు. బైరెడ్డిపల్లె ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి పాల్గొన్నారు.


