ఎన్నిసార్లు తిరగాలి సారూ! | - | Sakshi
Sakshi News home page

ఎన్నిసార్లు తిరగాలి సారూ!

Jul 21 2026 1:18 AM | Updated on Jul 21 2026 1:18 AM

సర్టిఫికెట్లు లేవు.. ఉద్యోగాలు ఎలా ఇస్తారు? రెండేళ్లుగా చుక్కనీరు లేక నరకం చూస్తున్నాం పారిశ్రామిక రంగంలో సముచిత స్థానమేది కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో అర్జీదారుల కన్నీళ్లు పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

కాళ్లరిగేలా

చిత్తూరు కలెక్టరేట్‌ : సమస్యలు వస్తే సచివాలయాని కి వెళ్లాం.. ప్రజాప్రతినిధులను కలిశాం.. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం.. అయినా తమ బాధతలు ఎవరికీ పట్టడం లేదు సారూ.. ఇక మీరే మాకు న్యాయం చేయాలి అంటూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు కలెక్టర్‌ ఎదుట తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బాధితుల ఆక్రందనలతో పోటెత్తింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వందలాది మంది అర్జీదారుల నుంచి కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ, జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ స్వయంగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకునారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించి 264 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్‌ అధి కారులు వెల్లడించారు.

విద్యాశాఖమంత్రి తీరు సరికాదు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల సమస్యల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి. ప్రవీణ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ధ్వజమెత్తారు. ఫీజులు చెల్లించకపోవడంతో కోర్సులు పూర్తయినా సర్టి ఫికెట్లు అందక, వచ్చిన ఉద్యోగాలకు వెళ్లలేక పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హాస్టళ్లలో నరకం, హామీల ఉల్లంఘన

ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత కరువయ్యాయని ఆరోపించారు. పెరిగిన ధరల ప్రకారం మెస్‌ చార్జీలను రూ. 3,000లకు, కాస్మోటిక్‌ చార్జీలను రూ. 300లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ‘యువగళం పాదయాత్రలో వంద రోజుల్లో జీవో నెం.77 రద్దు చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్‌.. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా దానిపై నోరు మెదపకపోవడం బాధ్యతారాహిత్యం’ అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నా, జిల్లా ఉపాధ్యక్షుడు సంజయ్‌, యామిని, నగర నాయకులు మనోజ్‌, జీవిత, ప్రణవి పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు సమస్యలను విన్నవించుకుంటున్న అర్జీదారులు

విద్యాశాఖమంత్రి హామీలు వెంటనే నెరవేర్చాలంటూ ధర్నా చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

ప్రైవేట్‌ ఇండస్ట్రియల్‌ పార్కుల్లో సామాజిక న్యాయం ఎక్కడ?

రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో అడుగులు వేయడం అభినందనీయమే అయినప్పటికీ, ప్రభుత్వ భూములతో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్‌ ఇండస్ట్రియల్‌ పార్కుల్లో సామాజిక న్యాయం ప్రతిబింబించడం లేదని సామాజిక సంక్షేమ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పార్కుల్లో జనాభాలో అధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పారిశ్రామిక యాజమాన్యం, పరిశ్రమల స్థాపనలో సముచిత భాగస్వామ్యం కల్పించేలా ప్రత్యేక విధానాలను రూపొందించాలని కోరుతూ జనతా వారిధి జిల్లా ఇన్‌చార్జ్‌, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం స్టాండ్‌–అప్‌ ఇండియా, పీఎంఈజీపీ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాయితీలు ఉన్నప్పటికీ, మూలధన కొరత, బ్యాంకు రుణాల లభ్యతలో సమస్యలు, మార్కెట్‌ అవకాశాల కొరత వల్ల వెనుకబడిన వర్గాల వారు భారీ పరిశ్రమల స్థాపనలో వెనుకబడిపోతున్నారని వివరించారు. ప్రభుత్వ భూములను కేటాయించి నిర్మించే ప్రైవేట్‌ ఇండస్ట్రియల్‌ పార్కుల్లో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జనతా వారిధి సహ ఇన్‌చార్జ్‌ కట్టమంచి రవికుమార్‌, ఓబీసీ మోర్చా నాయకులు సుధాకర్‌, మైనార్టీ మోర్చా షేక్‌ రెడ్డి మస్తాన్‌, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

రెండేళ్లుగా నీటి కోసం నరకయాతన

జిల్లా కేంద్రంలోని న్యూ ప్రశాంత్‌ నగర్‌ కాలనీలో గత రెండేళ్లుగా తీవ్రమైన తాగునీటి సమస్య, మురుగునీటి కాలువలు, పారిశుద్ధ్య లోపంతో నరకయాతన అనుభవిస్తున్నట్లు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా, వార్డు సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కనీసం పట్టించుకున్న నాథుడే లేడని కాలనీ వాసులు కలెక్టర్‌ ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రెండేళ్లుగా నరకం చూస్తున్నా ఏ ఒక్క అధికారీ మా వైపు చూడటం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement