జూలై ముగుస్తున్నా అందని
వేరుశనగ విత్తనాలు
ఖరీఫ్ సాగుపై పాలకుల నిర్లక్ష్యం
వర్షాలు లేకున్నా బోరు బావుల కింద సాగుకు ఆసక్తి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో ఖరీఫ్ సాగు ముఖచిత్రం దారుణంగా మారింది. రైతాంగానికి ఎంతో నమ్మకమైన వేరుశనగ సాగు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ లోపం కారణంగా సంక్షోభంలో పడింది. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలోనే రైతులకు చేరాల్సిన వేరుశనగ విత్తనాలు, జూలై ముగుస్తున్నా నేటికీ జిల్లా రైతులకు అందలేదు. ఫలితంగా ఈసారి జిల్లాలో వేరుశనగ సాగు విస్తీర్ణం ఘోరంగా పడిపోయింది. విత్తనాల కోసం ఎదురుచూసి అలసిపోయిన రైతన్నలు, విత్తనం దొరకక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ ఏడాది జిల్లాకు 27 వేల క్వింటాళ్ల వేరుశనగ కాయలను కేటాయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పంపిణీ మాత్రం శూన్యంగా మారింది.
సప్లయర్ల ససేమిరా
జిల్లాలో ఖరీఫ్ సీజన్ కింద వర్షధార పంటగా వేరుశనగ పండిస్తారు. ఈ పంట సాధారణ విస్తీర్ణం 21,903 హెక్టార్లు కాగా ఇప్పటివరకు 93 హెక్టార్లకు మాత్రమే పరి మితమైంది. ప్రధానంగా ప్రభుత్వం ఈ సారి జిల్లాకు కాయలు అందజేయడంలో ముఖం చాటేసింది. జిల్లాకు రావాల్సిన విత్త న కాయలను కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల్లో పండిన పంటను అక్కడి అవసరాలకే సరిపెట్టుకోవడంతో మన జిల్లాకు కాయలు రాలేని పరిస్థితి ఏర్పడిందని వ్యవసాయ శాఖ అధికారులు స్వ యంగా ఒప్పుకుంటున్నారు. దీనికి తోడు గతంలో విత్తనాలు సరఫరా చేసిన మిల్లర్లు, సప్లయర్లకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ.200 కోట్ల వరకు పాత బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో కొత్త సరఫరాకు వారు పూర్తిగా వెనకడుగు వేశారు. మన జిల్లాకు కదిరి, ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచి మిల్లర్లు కాయలు సరఫరా చేయాల్సి ఉన్నా, ప్రభుత్వం ప్రకటించిన రేటుకు, వారి రవాణా ఖర్చులతో కూడిన సరఫరా రేటుకు వ్యత్యాసం ఉండడంతో గిట్టుబాటు కాక మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. జిల్లాకు ఈ ఏడాది వేరుశనగ విత్తనాలు 27 వేల క్వింటాళ్ల కేటాయిస్తే.. కేవలం పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని మండలాలకు 6000 క్వింటాళ్ల కాయలు కేటాయించి ప్ర భుత్వం చేతులు దులుపుకుంది. మిగిలిన ని యోజకవర్గాలకు మొండి చేయి చూపింది.
బోరు బావుల కింద సాగుకు అవసరం
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవలేదు. దీంతో వర్షాధార పంటగా సాగుచేసే అవకాశం ఇక దాదాపు లేదని భావిస్తున్నారు. అయితే చాలామంది రైతులు బోరు బావుల కింద వేరుశనగ సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సబ్సిడీ విత్తనాలు అందక అవస్థలు పడుతున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో కొనుగోళ్లు
ప్రభుత్వం ఇచ్చే విత్తనాలపై 33 శాతం సబ్సిడీ పోను రైతు వాటా కింద కిలోకు సుమారు రూ. 62 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ విత్తనాలు రాకపోవడంతో రైతులు పక్కనే ఉన్న తమిళనాడులోని పళ్లిపట్టు, పరదరామి, గుడియాత్తం, పొన్నై వంటి ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. బహిరంగ నాణ్య త తక్కువగా ఉన్న కాయలు మార్కెట్‌లో కిలో రూ.80 నుండి రూ.85 పలుకుతుండగా, తమిళనాడులో నాణ్యత గల కాయలు 40 కిలోల బస్తా రూ. 4,000 చొప్పున, అంటే కిలో రూ.100 చొప్పున ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తూ తీవ్ర ఆర్థిక భారానికి గురవుతున్నారు. అక్కడి కాయలు నాణ్యంగా, పుచ్చులు లేకుండా ఉండడంతో రైతులు అప్పులు చేసైనా కొ నుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
నాటి భరోసా ఎటుపాయే?
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి ఎలాంటి ఢోకా లేకుండా రైతులకు అప్పటి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించింది. సీజన్ల వారీగా సకాలంలో విత్తనాలు అందించడమే కాకుండా, గతంలో రికార్డు స్థాయిలో ప్రత్యేకంగా 99 టన్నుల వరకు వేరుశనగ విత్తనాన్ని అందజేసి, సుమారుగా 80,000 మందికి పైగా రైతులకు అండగా నిలిచింది. కానీ నేటి పరిస్థితి భిన్నంగా మారింది. విత్తనాలు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్న రైతులకు, వ్యవసాయ శాఖ అధికారులు ఎల్ నినో ప్రభావం అంటూ వింత సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన విత్తనాలు పంపిణీ చేయాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.


