శాంతిపురం: మండల కేంద్రమైన రామకుప్పంలో వృద్ధ దంపతులను హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు కుప్పం డీఎస్సీ పార్థసారథి సోమవారం వెల్లడించారు. ఈనెల 17న రాత్రి రామకుప్పం బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో బందార్లపల్లికి చెందిన వెంకటేశు(70), ఆయన భార్య పార్వతమ్మ(65)లను నడిరోడ్డుపై నరికి చంపారు. ఆస్తుల వివాదంతో జరిగిన ఈ దారుణ సంఘటనపై విచారణ జరిపిన పోలీసులు మృతుల మనుమడు నేరుగా ఈ హత్యలు చేసినట్టు గుర్తించారు. హత్యలకు సహకరించిన మృతుల పెద్ద కుమారుడు అమరనాథ్, అతని భార్య సరస్వతి, వారి మైనర్ కుమారుడు హత్యా కాండలో పాల్గొన్నారని తేల్చారు. దీంతో ఈ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచినట్టు డీఎస్పీ తెలిపారు. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్‌తో కలిసి కుప్పంలోని తన కార్యాలయంలో నిందితులను మీడియాకు ప్రదర్శించారు.


