కూటమి నేతల ఇసుక జాతర | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతల ఇసుక జాతర

Jul 21 2026 1:18 AM | Updated on Jul 21 2026 1:18 AM

● సరిహద్దులు దాటుతున్న తెల్లబంగారం ● చిత్తూరు చుట్టూ రెండేళ్లుగా అడ్డులేకుండా అక్రమ దందా ● తమిళనాడు, బెంగళూరుకు తరలుతున్న లారీలు ● అధికార పార్టీ పెద్దల అండ ● నెలకు రూ.25 కోట్ల దోపిడీ ● శెట్టిన్‌ తంగాల్‌లో ఖాళీ అయిన ఇసుక

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ పెద్ద తలకాయల అండదండలతో కూటమి నేత లు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను భారీగా డంప్‌ చేసి కొల్లగొడుతున్నారు. నిత్యం 20 నుంచి 25 లారీల ఇసుక సరిహద్దులు దాటి తమిళనాడుకు జంప్‌ అవుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. చిత్తూరు నగర శివారు పూనేపల్లి ప్రాంతం నుంచి నడుస్తున్న దందాలో గారంపల్లి, మురకంబట్టుకు చెందిన కూట మి నేతలే కీలక సూత్రధారులుగా మారి చక్రం తిప్పుతున్నారు. మురకంబట్టుకు చెందిన సదరు నేతపై గతంలో పలుమార్లు కేసులు నమోదైనా, ఇసుకతో పట్టుబడ్డా.. అధికార పార్టీ కొండంత అండ చూపిస్తుండడంతో ఆయనపై చర్యలు శూన్యంగా మారాయి. ఇక గారంపల్లి నేతలకు తిరుపతిలోని ఓ ప్రముఖ దేవస్థానం చైర్మన్‌ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతోనే, వారి ఇసుక అక్రమ రవాణా లారీలు తమిళనాడు, బెంగళూరు మార్గాల్లో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రూపుల తగాదా

చిత్తూరు మండలంలోని బీఎన్‌ఆర్‌ పేట, శెట్టిన్‌ తంగాల్‌ తవ్వకాలు చేసి గుడిపాల సరిహద్దు ప్రాంతంలోని మంచినీళ్లకుంట, సీఎం కండ్రిగ పరిసర ప్రాంతాల్లో భారీగా ఇసుక డంప్‌లు వెలిశాయి. ఒక్కో డంప్‌ నుంచి రోజువారీగా కనీసం 10 నుంచి15 లారీల ఇసుక తమిళనాడుకు తరలిపోతోంది. అయితే, ఈ దందాలో ఓ వర్గం నేతలు మాత్రమే పైచేయి సాధించి సొమ్ము చేసుకుంటుండడంతో, మరో వర్గం నేతలు ఇటీవల తవ్వకాలను అడ్డుకున్నారు. ఇది కాస్తా ముది రి గ్రూపు తగాదాలకు దారితీసింది. దీంతో అసంతృప్తి నేతలు ఇసుక దందాను ముందుండి నడిపిస్తున్న సదరు కీలక మండల నేతపై ఏకంగా రాష్ట్ర అధికారులు, పార్టీ అధిష్టానానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన వల్లే మండలంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోందని, ఆయన అనుచరులు మాత్రమే ఇసుక త వ్వుకోవాలనే వింత నిబంధన పెట్టార ని అందులో పేర్కొన్నారు. నెలకు రూ.25 కోట్ల వరకు సాగుతున్న ఈ అక్రమ దందాలో సదరు నేత వాటానే అక్షరాలా నెలకు రూ.20 లక్షల వరకు ఉంటుందని ఫిర్యాదులో బట్టబయలు చేయడం మండలంలోని కలకలం రేపుతోంది. విచ్చలవిడి తవ్వకాలతో శెట్టిన్‌ తంగాల్‌లో ఇసుక పూర్తిగా ఖాళీ అయిపోవడంతో, భూగర్భ జలాలుఅడుగంటిపోతాయని వ్యవసాయ రైతులు మండిపడుతున్నారు.

ఫిర్యాదు చేస్తే బెదిరింపులు

సాధారణ ప్రజల ఇళ్ల అవసరాలకు మాత్రమే ఉచిత ఇసుక అని చెప్తున్న ప్రభుత్వం.. కళ్లెదుటే లారీలు సరిహద్దులు దాటుతున్నా పట్టించుకోవడం లేదు. అక్రమంగా డంప్‌లు వెలుస్తున్నా మైనింగ్‌, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. కూటమి నేతలకు సలామ్‌ కొడుతున్నారు. స్థానికులు సాహసించి అధికారులకు సమాచారమిస్తే, ఫిర్యాదు దారుల ఫోన్‌ నంబర్లను సైతం ఇసుక మాఫియాకు లీక్‌ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కూటమి నేతలు ఫోన్లలో బెదిరింపులకు గురిచేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాతపూర్వకంగా ఇస్తేనే చర్యలు తీసుకుంటామని అధికారులు తప్పించుకుంటున్నారు. చిత్తూరులో ఇప్పుడు ఈ ఇసుక దోపిడీ, అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వాధినేతలు మైనింగ్‌ మాఫియాను అడ్డుకుంటామని, అక్రమార్కులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కుప్పం, సత్యవేడు వేదికలుగా ప్రగల్భాలు పలికినా.. క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి నేతల ఇసుక దోపిడీ అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. ఆ మాటలన్నీ నీటి మూటలేనని చిత్తూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న దందా నిరూపిస్తోంది. చిత్తూరు శివార్లే కేంద్రంగా గత రెండేళ్లుగా అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది.

గుడిపాలలో ప్రజాప్రతినిధి బంధువుల దందా

గుడిపాల మండలంలోని మంచినీళ్లకుంట, సీఎం కండ్రిగలో ఓ ప్రజాప్రతినిధి బంధువులు భారీ డంప్‌ ఏర్పాటు చేసుకుని తమిళనాడుకు బహిరంగంగా తరలిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక ఎత్తికెళ్లిపోతున్న అధికారులు ఆ ప్రజాప్రతినిధిని చూసి గప్‌చుప్‌ అవుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాళ్ల బంధువులు మాత్రమే ఇసుక అక్రమరవాణాలో పై చేయిగా నిలిచి.. రూ. కోట్లు కొల్లగొడుతుంటే.. టీడీపీలోని సీనియర్‌ నేతలు, పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలకు ఏ ఆదాయం లేక మండిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement