కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దర్శన టికెట్ల విక్రయంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగి కార్తీక్‌పై మంగళవారం ఆలయ అధికారులు విచారణ వేగవంతం చేశారు. సదరు సిబ్బందిపై త్వరలోనే సస్పెన్షన్ వేటు పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వివరాలు.. స్వామివారి దర్శన టికెట్ కొనుగోలు కోసం వచ్చిన ఒక మహిళ వద్ద ఉద్యోగి కార్తీక్ నగదు తీసుకున్నాడు. అయితే ఆమెకు టికెట్ ఇవ్వకుండానే నేరుగా లోపలికి పంపించేశాడు. అనంతరం ఆ టికెట్‌ను తన జేబులోనే దాచుకున్నాడు. కాంప్లెక్స్ లోపలికి వెళ్లిన మహిళ వద్ద టికెట్ లేకపోవడం గమనించిన చెకింగ్ సిబ్బంది విచారించగా.. మేము కార్తీక్‌కు డబ్బులు ఇచ్చాం, ఆయనే మమ్మల్ని లోపలికి పంపించారని భక్తురాలు స్పష్టం చేసింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వెంటనే కార్తీక్‌ను తనిఖీ చేయగా, అతడి జేబులో ఆ టికెట్ దొరికింది. ఆమెతో పాటు వేరే వ్యక్తులకు కూడా కలిపి టికెట్ తీసుకున్నట్లు కార్తీక్ బుకాయించాలని యత్నించాడు. విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోవడంతో కార్తీక్ సస్పెన్షన్‌కు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తు న్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఈఓ పెంచలకిషోర్ మాట్లాడుతూ స్వామివారి సన్నిధిలో అక్ర మాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


