నగరి : జీవితాంతం కష్టపడి పనిచేసిన చేతులకు చివరికి ఆసరా దొరకలేదు. అనారోగ్యం శరీరాన్ని కుంగదీస్తే, ఆప్యాయత కోసం ఎదురుచూసిన మనసుకు సొంతవాళ్ల ఆదరణ లభించలేదు. ఆవేదనతో నిండిన ఆ వృద్ధుడు చివరకు తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. సుమారు పదేళ్లపాటు అన్నం పెట్టి, ఆత్మగౌరవంతో బతికే అవకాశమిచ్చిన దుకా ణం ముందే చివరి శ్వాస విడిచాడు. ఈ ఘటన మంగళవారం నగరిలో జరిగింది. వివరాలు.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, పళ్లిపట్టు తాలూకా నల్లవన్నంపేటకు చెందిన మనోహరన్ (73) గత పదేళ్లుగా నగరి ప్రకాశం రోడ్డులోని స్టీలు పాత్రల దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగించాడు. కాలం ఒక్కొక్కటిగా ఆయన జీవితంలో వెలుగులను ఆర్పే సింది. కొన్నేళ్ల క్రితం భార్యను, పెద్ద కుమారుడిని కోల్పోయాడు. మిగిలిన ఇద్దరు కుమారుల్లో ఒకరు చైన్నెలో ఉండగా, మరొక కుమారుడి వద్ద ఉంటూ నగరిలో పని చేసేవాడు. ఇటీవల హెర్నియా శస్త్రచికిత్స చేయించుకోవడంతో పనికి వెళ్లలేక ఇంటికే పరిమితమయ్యాడు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన రోజుల్లో ఆయన ఆశించింది మందులు మాత్రమే కాదు.. నాలుగు ఓదార్పు మాటలు కూడా. కానీ, అవి కూడా కరువైంది. తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధ ఆయనను లోలోపల తీవ్రంగా కుంగదీసింది. అలాంటి పరిస్థితుల్లో పదేళ్లుగా తనకు అన్నం పెట్టిన దుకాణమే చివరి గమ్యస్థానంగా ఎంచుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో పీసీఏ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఆ స్టీలు పాత్రల దుకాణం ముందున్న ఇనుప చువ్వకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం వేకువజామున అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఐ మల్లికార్జునరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి ఒక చేదు ప్రశ్నను మన ముందుంచింది. వృద్ధులకు ఆర్థిక భద్రత ఎంత అవసరమో, అంతకంటే ఎక్కువగా కుటుంబ సభ్యుల ప్రేమ, ఆదరణ, ఆప్యాయత అవసరం. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడిన పెద్దలకు చివరి దశలో కావాల్సింది ఖరీదైన కానుకలు కాదు.. కాస్త పలకరింపు, కొద్దిపాటి ఆదరణ, మనస్ఫూర్తిగా తోడుగా నిలిచే మనుషులే. మనోహరన్ విషాదాంతం అలాంటి మానవీయ విలువలను మరోసారి గుర్తు చేసింది.


