చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికే మంగళవారం కరెంటోళ్ల జనబాట చేపట్టినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. ఈ మేరకు 11 కేవీ లైన్ పరంగా 14 సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ 50, ఎల్‌టీ లైన్ 20, సర్వీసు లైన్‌కు సంబంధించి 52 సమస్యలను గుర్తించినట్లు వెల్లడించారు. వీటిలో మొత్తం 90 సమస్యలను పరిష్కారించామని, మిగిలిన వాటిని దశలవారీగా పూర్తి చేయనున్నట్లు వివరించారు.
‘గ్రీవెన్స్’పై స్పందనకు
క్యూ ఆర్ కోడ్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) ద్వారా అందిన సేవలపై ప్రజ లు తమ అభిప్రాయాలను క్యూ ఆర్ కోడ్‌తో తెలియజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రజలు సులభతరంగా స్పందించేందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని వెల్లడించారు. పీజీఆర్‌ఎస్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు నిరంతర అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు వివరించారు.
చదువు మానేసిన వారికి సదావకాశం
చిత్తూరు కలెక్టరేట్ : అనివార్య కారణాలతో చదువు మానేసిన వారికి ఏపీ ఓపెన్ స్కూల్ విధానం సదావకాశం కల్పిస్తోందని డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరించారు. డీఈఓ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు దరఖాస్తు గడువును ఆగస్ట్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు వివరించారు. ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ఆగస్టు 31వ తేదీ నాటికి 14 ఏళ్లు పూర్తయిన వారు నేరుగా 10వ తరగతిలో చేరవచ్చన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు, 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్మీ డియట్‌లో చేరేందుకు అర్హులని తెలిపారు. ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి సాధారణ (రెగ్యులర్) విద్యా సర్టిఫికెట్లతో సమానంగా గుర్తింపు ఉంటుందన్నారు. వీరుపై చదువులకు, ప్రభు త్వ ఉద్యోగాలకు అర్హులని వివరించారు. ఏడీ సుకుమార్, ఓపెన్ స్కూల్ విభాగం సిబ్బంది లక్ష్మి పాల్గొన్నారు.
‘లేడీడాన్’పై
విచారణకు ఆదేశం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో టీడీపీ నేతల అండదండలతో గంజాయి విక్రయిస్తున్న ఓ లేడీ డాన్‌పై ఎస్పీ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. నగరంలోని కట్టమంచికి చెందిన ఈ మహిళ పలు కళాశాలల విద్యార్థులకు భారీగా గంజాయి సరఫరా చేస్తోందని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు అందింది. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి లేడీ డాన్‌ను బైండోవర్ చేయాలని వన్‌టౌన్ సీఐని ఎస్పీ ఆదేశించారు. లేడీ డాన్ కారణంగా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని టీడీపీ సీనియర్ నేత ఒకరు హెచ్చరించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆ మహిళా డాన్‌ను ఓ ద్వితీయ శ్రేణి నాయకుడు వెనకేసుకుని వస్తున్నట్లు తెలిసింది. అయితే గంజాయిని కూకటివేళ్లతో సహా నిర్మూలించాలని పట్టుదలగా ఉన్న ఎస్పీ, ఈ విషయంలో ఎవరి మాట వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. మాదకద్రవ్యాల కేసుల్లో రాజకీయ ప్రమేయం సహించమని, ఈ వ్యాపారం చేసేవాళ్లను కేవలం నిందితులుగానే చూస్తామని ఓ నేత వద్ద ఎస్పీ కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో లేడీడాన్‌పై ఫిర్యాదు చేసింది టీడీపీకి చెందిన ఓ మాజీ కార్పొరేటరేనని వార్తలు గుప్పుమంటున్నాయి. వ్యాపార విబేధాల కారణంగా తన మనుషులను పంపించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించినట్లు టీడీపీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.


