తమ కంపెనీలో తామే వాటాలు కొంటున్నారు! | Zee Entertainment promoters set to infuse capital into company | Sakshi
Sakshi News home page

తమ కంపెనీలో తామే వాటాలు కొంటున్నారు!

Jun 18 2025 8:44 AM | Updated on Jun 18 2025 10:03 AM

Zee Entertainment promoters set to infuse capital into company

‘జీల్‌’కు ప్రమోటర్ల దన్ను

బ్రాడ్‌క్యాస్టింగ్‌ రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌(జీల్‌)కు ప్రమోటర్లు పెట్టుబడులు సమకూర్చనున్నారు. తద్వారా తమ వాటాను పెంచుకోనున్నారు. ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థల నుంచి రూ. 2,237 కోట్లకుపైగా నిధులు సమీకరించనున్నట్లు జీల్‌ తాజాగా పేర్కొంది. దీంతో కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.4 శాతానికి బలపడనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో పూర్తిగా మారి్పడికి వీలయ్యే 16.95 కోట్లకుపైగా వారంట్లను జారీ చేసేందుకు బోర్డు అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ఆల్టిలిస్‌ టెక్నాలజీస్, సన్‌బ్రైట్‌ మారిషస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలకు వారంట్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ప్రమోటర్ల నుంచి అందుకోనున్న పెట్టుబడుల ద్వారా కంపెనీ ప్రధాన బిజినెస్‌ విభాగాలలో మరింత పటిష్టంకానున్నట్లు పేర్కొంది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలలో వృద్ధి అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేసింది.

ఒక్కో వారంట్‌కు రూ.132 ధరలో..

ఒక్కో వారంట్‌కు రూ. 132 ధర చొప్పున ప్రమోటర్లకు 16,95,03,400 వారంట్లను జీల్‌ జారీ చేయనుంది. తద్వారా నగదు రూపేణా రూ. 2,237.44 కోట్లు లభించనుండగా.. కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.39 శాతానికి చేరనున్నట్లు జీల్‌ వివరించింది. కాగా.. సెబీ మార్గదర్శకాల ప్రకారం వారంట్‌ను రూ. 128.58 ధరలో కేటాయించవలసి ఉన్నప్పటికీ బోర్డు రూ. 3.42 ధర అధికంగా నిర్ణయించింది. ఇందుకు ప్రమోటర్లు సైతం అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇష్యూ ధరలో ప్రమోటర్లు ముందస్తుంగా 25 శాతం(రూ. 33) ధర చెల్లించనున్నారు. వారంట్లను అలాట్‌మెంట్‌ నుంచి గరిష్టంగా 18 నెలల్లోగా ప్రమోటర్లు షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు వీలుంటుంది. 

ఇదీ చదవండి: హోండా ‘ఎక్స్‌ఎల్‌...’ ధర రూ.10,99,990

ఒక్కో వారంట్‌కు రూ. 99(75 శాతం) చొప్పున చెల్లించడం ద్వారా ఈక్విటీ షేర్లుగా మార్చుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 3.99 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. దేశీ మీడియా బిజినెస్‌(సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా)ను జీల్‌తో విలీనం చేసే ప్రతిపాదనను గతేడాది సోనీ గ్రూప్‌ విరమించుకున్న నేపథ్యంలో ప్రమోటర్ల పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement