
అమెరికాలో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్ -1బీ వీసాలకు సంబంధించి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025లో రెండవ అతిపెద్ద గ్రహీతగా అవతరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,500కి పైగా ఆమోదాలతో అమెజాన్ (10,044) తర్వాత స్థానంలో నిలిచింది.
2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ తర్వాత అత్యధిక హెచ్ 1బీ వీసా అప్రూవల్స్ పొందిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), ఆపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951) ఉన్నాయి.
అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులను గణనీయంగా ప్రభావితం చేసే చర్యను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్నారు. వార్షిక హెచ్ -1 బి వీసా ఫీజు 100,000 డాలర్లకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
2025 సెప్టెంబర్ 21 తర్వాత దాఖలు చేసిన పిటిషన్లకు ఈ పరిమితి వర్తిస్తుంది. పొడిగించకపోతే 12 నెలల తర్వాత ముగుస్తుంది. "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు హెచ్-1బీ వ్యవస్థను దుర్వినియోగం చేశాయి. కంప్యూటర్ సంబంధిత రంగాలలో అమెరికన్ ఉద్యోగులకు గణనీయంగా హాని కలిగిస్తున్నాయి" అని పేర్కొంటూ ఐటీ అవుట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్-1బీ ఆమోదాలపై ఎంతలా ఆధిపత్యం చెలాయించాయో ప్రభుత్వ ప్రకటన హైలైట్ చేసింది.