డిజిటల్‌ చెల్లింపుల జోరు | UPI transactions touches record high of Rs 24. 77 lakh crore in March | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ చెల్లింపుల జోరు

Jun 11 2025 1:05 AM | Updated on Jun 11 2025 8:03 AM

UPI transactions touches record high of Rs 24. 77 lakh crore in March

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న పేమెంట్స్‌ వ్యవస్థ 

మార్చిలో రూ. 24.77 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు

న్యూఢిల్లీ: యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించే విధంగా దేశీయంగా డిజిటల్‌ చెల్లింపుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా రూ. 24.77 లక్షల కోట్లు విలువ చేసే 1,830.151 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ప్రస్తుతం యూపీఐ సిస్టంను 46 కోట్ల మంది పైగా వ్యక్తులు, 6.5 కోట్లకు పైగా వ్యాపారులు ఉపయోగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన బుక్‌లెట్‌లో కేంద్రం ఈ విషయాలు తెలిపింది.

అత్యంత తక్కువ మొత్తంతో కూడుకున్న లావాదేవీలకు కూడా ప్రస్తుతం ప్రజలు డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు, మొత్తం పేమెంట్లలో దాదాపు 50 శాతం వాటా వీటిదే ఉంటున్నట్లు వివరించింది.  ఇక నగదు బదిలీ (డీబీటీ) వంటి స్కీములను ప్రస్తావిస్తూ పారదర్శకతను పెంచేందుకు, గవర్నెన్స్‌ లోపాలను అరికట్టేందుకు ప్రభుత్వం టెక్నాలజీ, డిజిటల్‌ సాధనాలను సమర్ధవంతంగా ఉపయోగిస్తోందని బుక్‌లెట్‌ పేర్కొంది. 

వివిధ సంక్షేమ పథకాల్లో డీబీటీ, ఆధార్‌ ధ్రువీకరణను ప్రవేశపెట్టడంతో లక్షల కొద్దీ బోగస్‌ లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయిందని, ప్రభుత్వానికి భారీగా ఆదా కావడంతో పాటు ప్రజలకు సకాలంలో ప్రయోజనాలు అందుతున్నాయని వివరించింది. 2015 నుంచి 2023 మార్చి మధ్య కాలంలో డీబీటీ కారణంగా రూ. 3.48 లక్షల కోట్లు ఆదా అయినట్లు పేర్కొంది. గత 11 ఏళ్లలో కోట్లాది మంది ప్రజలకు బ్యాంక్‌ ఖాతాలు, బీమా వంటి ప్రాథమిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చినట్లు వివరించింది. 55.22 కోట్ల జన్‌ ధన్‌ ఖాతాలు తెరవగా, పీఎం సురక్షా బీమా యోజన కింద 51 కోట్ల మందికి కవరేజీ దక్కినట్లు బుక్‌లెట్‌ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement