చివరి గంటలో కొనుగోళ్ల జోరు.. | Stock Market Rally Sensex Jumps 394 Points And Nifty Gains 119, RBI Boost Last Hour Buying, More Details Inside | Sakshi
Sakshi News home page

చివరి గంటలో కొనుగోళ్ల జోరు..

Jun 9 2026 4:36 PM | Updated on Jun 9 2026 5:53 PM

Stock Market Rally Sensex Jumps Nifty Gains RBI Boost Last Hour Buying

గడిచిన రెండు సెషన్లుగా ఇన్వెస్టర్లను కలవరపెట్టిన నష్టాల పరంపరకు మంగళవారం బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా బ్యాంకింగ్ రంగంలో వ్యూహాత్మక కొనుగోళ్లు మార్కెట్లకు ఊరటనిచ్చాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 394 పాయింట్లు పుంజుకొని 73,918.76 మార్కు వద్ద స్థిరపడింది. అలాగే, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty 50) కూడా 119 పాయింట్లు లాభపడి 23,242.10 వద్ద ముగిసింది. మధ్యాహ్నం సమయంలో కొంత లాభాల స్వీకరణ జరిగినప్పటికీ చివరి గంటలో కొనుగోలుదారులు ఆసక్తి చూపడంతో సూచీలు తిరిగి పుంజుకున్నాయి.

మార్కెట్ జోష్‌కు దారితీసిన కారణాలు

నేటి మార్కెట్ గమనాన్ని విశ్లేషిస్తే ఈ రికవరీకి ప్రధానంగా కొన్ని అంశాలు దోహదపడ్డాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో..

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల తగ్గింపు

పశ్చిమాసియాలో కొన్ని రోజులుగా తీవ్ర రూపం దాల్చిన ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పర దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లలో భయాలను తొలగించింది.

క్రూడాయిల్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 0.71% తగ్గి బ్యారెల్‌కు 92.75 డాలర్ల వద్దకు చేరింది. భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థకు చమురు ధరలు తగ్గడం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.

ఆర్‌బీఐ బూస్టర్ డోస్.. బ్యాంకింగ్ రంగం హవా

నేటి మార్కెట్ ర్యాలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం బూస్ట్‌గా మారింది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు గాను బ్యాంకులు సేకరించే తాజా ఎఫ్‌సీఎన్‌ఆర్-బీ డిపాజిట్ల కోసం యూఎస్ డాలర్-రూపాయి ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది. కనీసం 3 సంవత్సరాల నుంచి గరిష్టంగా 5 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది.

ఈ నిర్ణయంతో నిఫ్టీ బ్యాంక్ ఏకంగా 1,255 పాయింట్లు దూసుకెళ్లింది. ఏప్రిల్ 10 తర్వాత బ్యాంక్ నిఫ్టీ సాధించిన అత్యుత్తమ సింగిల్-డే లాభం ఇదే కావడం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి హెవీవెయిట్ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్ల మద్దతు

గత వారం అమెరికా వాల్ స్ట్రీట్‌లో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. ఆసియా మార్కెట్లలో సెమికండక్టర్, టెక్నాలజీ షేర్లు రాణించాయి.

ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

Advertisement
 
Advertisement
Advertisement