ఇరాన్‌పై అమెరికా దాడుల ఎఫెక్ట్..
క్రూడాయిల్ ధర కదలికలు కీలకం...
ఐఐపీ, తయారీ–సేవల రంగం గణాంకాలపైనా దృష్టి
తీవ్ర ఆటుపోట్లు ఉండొచ్చు...
ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం
పశ్చిమాసియాలో మళ్లీ అగ్గి రాజుకుంది. సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించారంటూ... ఇరాన్–అమెరికా దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతం మళ్లీ అట్టుడికింది. తాజా భౌగోళిక రాజకీయ పరిణామాల సెగ ముడిచమురు ధరలపై చూపే ప్రభావం ఈ వారం మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనుందనేది విశ్లేషకులు అభిప్రాయం. సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే, దేశీయంగా వెలువడే పలు స్థూల ఆర్థిక గణాంకాలు, రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, రుతుపవనాల కదలికలపై కూడా ఇన్వెస్టర్లు ఫోకస్ చేయనున్నారు.
హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. ఇరాన్‌లోని మిసైల్, డ్రోన్ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా ఎటాక్ చేసింది. మరోమారు సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అగ్రరాజ్యం హెచ్చరించింది. మరోపక్క ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వెరసి ఈ వారం క్రూడ్ ధరలపై ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. శాంతి ఒప్పందంపై ఆశలతో ముడిచమురు ధరలు చల్లారిన సంగతి తెలిసిందే. బ్రెంట్ క్రూడ్ 75 డాలర్ల దిగువకు, అంటే యుద్ధం పూర్వపు స్థాయికి చేరింది.
తాజా పరిణామాలతో క్రూడ్ ధరలు మళ్లీ పుంజుకోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మార్కెట్లలో తీవ్ర ఒడిదుడులకులు ఉండొచ్చనేది నిపుణుల విశ్లేషణ. ‘పశ్చిమాసియాలో తాజా టెన్షన్లను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. ఒకపక్క శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ... అమెరికా, ఇరాన్ మధ్య చోటు చేసుకున్న దాడులతో భౌగోళిక రాజకీయ రిసు్కలు ఇంకా తొలగిపోలేదని మార్కెట్లకు సంకేతాలిస్తున్నాయి. చర్చల్లో సానుకూల ఫలితాలు, ఉద్రిక్తతలు సద్దుమణిగితే రిస్క్ సెంటిమెంట్ మెరుగవుతుంది ఒకవేళ దాడులు తీవ్రమైతే ప్రపంచ వృద్ధి, ఇంధన మార్కెట్లపై అంచనాలు తారుమారవుతాయి’ అని ఆన్‌లైన్ ట్రేడింగ్, వెల్త్‌టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ పేర్కొన్నారు.
గణాంకాలపై ఫోకస్...
ఈ వారం దేశీయంగా విడుదల కానున్న కొన్ని కీలక గణాంకాలు మన మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)తో పాటు హెచ్‌ఎస్‌బీసీ తయారీ సేవల పీఎంఐ డేటా వెలువడనుంది. మరోపక్క, జూన్ నెల ఆటోమొబైల్ అమ్మకాలను కూడా కంపెనీలు జూలై 1న వెల్లడించనున్నాయి. ఇవన్నీ మన ఆర్థిక వ్యవస్థ తాజా పరిస్థితిని తెలియజేయనున్న నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. మరోపక్క, అమెరికా తయారీ రంగ పనితీరును సూచించే డేటా కూడా మార్కెట్లకు కీలకమేనని మోతీలాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ (వెల్త్ మేనేజ్‌మెంట్) సిద్ధార్థ్ ఖేమ్కా చెప్పారు.
రూపాయి.. రుతుపవనాలు
ముడిచమురు ధరలు దిగిరావడం, డాలర్ల ప్రవాహాన్ని పెంచేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇటీవల రూపాయి కాస్త పుంజుకుంది. డాలర్ మారకంలో ఆల్‌టైమ్ కనిష్టం 96.96 స్థాయి నుంచి 94.20 వరకు బలపడింది. ప్రస్తుతం 94.50 వద్ద కదలాడుతోంది అయితే, పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతలతో క్రూడ్ ఎగబాకితే.. రూపాయికి దాని సెగ తగులుతుందని.. మళ్లీ బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క, జూన్ నెల ముగుస్తున్నా.. ఇంకా రుతుపవనాలు పూర్తిగా విస్తరించలేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు గనుక ఇలాగే ముఖం చాటేస్తే.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని.. రానున్న రోజుల్లో నైరుతి రుతుపవనాల కదలికలపై ఇన్వెస్టర్లు గట్టిగా ఫోకస్ చేస్తారని పోన్ముడి పేర్కొన్నారు.
గతవారమిలా...
శుక్రవారం మన మార్కెట్లకు మొహర్రం సెలవు కారణంగా ఆసియా మార్కెట్లలో టెక్, చిప్ స్టాక్స్‌లో వెల్లువెత్తిన అమ్మకాలు ప్రతిబింబించలేదు. గతవారం ట్రేడింగ్ నాలుగు రోజుల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 298 పాయింట్లు (0.38%) పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 43 పాయింట్లు (0.17%) లాభపడి 24,056 వద్ద ముగిసింది.
సాంకేతికంగా చూస్తే...
పశ్చిమాసియా ప్రభావంతో మార్కెట్లు గనుక వెనకంజ వేస్తే... నిఫ్టీకి ఈ వారం 23,800 వద్ద తొలి మద్దతు లభించవచ్చు. మరింత దిగజారితే 23,640 రెండో మద్దతు స్థాయిగా నిలుస్తుంది. ఇక నిఫ్టీ పెరిగితే.. 24,200–24,300 స్థాయిలో తొలి నిరోధం ఎదుర్కొంటుంది. 24,300 స్థాయిని గనుక అధిగమించగలిగితే.. 24,500 దిశగా పయనిస్తుందనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా.
– సాక్షి, బిజినెస్ డెస్క్


