
జీవిత బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కుటుంబ ఆర్థిక రక్షణకు ప్రాధాన్యత అధికమవుతోంది. ఈ విషయంలో దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది ప్రాంతం ఎంతో ముందుంది. జీవిత బీమా యాజమాన్యం, ఆర్థిక రక్షణలో దక్షిణ భారతదేశం జాతీయ స్థాయిలో ముందంజలో ఉందని ఇటీవలి ఇండియా ప్రొటెక్షన్ కోషియెంట్ (ఐపీక్యూ) 7.0 నివేదిక వెల్లడించింది. పట్టణ కేంద్రాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో దక్షిణ భారత ప్రాంతాలలో జీవిత బీమా 84 శాతం చొచ్చుకుపోయినట్లు వెల్లడైంది. ఇది దేశంలోనే అత్యధికం.
ఫైనాన్షియల్ ప్రొటెక్షన్‌లో రీజనల్ లీడర్ షిప్
చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు కీలక సూచీల్లో జాతీయ బెంచ్ మార్క్ లను అధిగమించాయి. యాజమాన్యంలో చెన్నై అగ్రస్థానంలో, ఆర్థిక భద్రతలో హైదరాబాద్ అగ్రస్థానంలో, అవగాహనలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచాయి. నేను లేకపోతే నా కుటుంబం ఏమౌతుందో.. అన్న ఆందోళనతో ఆర్థిక ప్రణాళికకు చాలామంది సిద్ధమవుతున్నారు.
ఈ నివేదిక టర్మ్ ఇన్సూరెన్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తోంది. ఇందులో పాల్గొన్నవారిలో 77% మంది కుటుంబ రక్షణ కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రదాయ పొదుపు-ఆధారిత పాలసీల నుండి స్వచ్ఛమైన రిస్క్ కవరేజీకి మారడాన్ని ఇది సూచిస్తుంది.
మహిళలకు మరీ ఎక్కువ
జీవిత బీమా, ఆర్థిక రక్షణపై జాగ్రత్త మహిళల్లోనే మరీ ఎక్కువ కనిపిస్తోంది. గుర్తించదగిన ధోరణిలో 86% మంది దక్షిణ భారత మహిళలు జీవిత బీమాను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది. ఇది పురుషల సగటు (83%), జాతీయ మహిళా సగటు (75%) రెండింటినీ అధిగమించింది. ఆర్థిక పరిజ్ఞానం, భద్రతలో కూడా మహిళలు ఎక్కువ మార్కులు సాధించారు, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో లింగ అంతరాన్ని తగ్గించారు.
యువతలోనూ..
టర్మ్ ప్లాన్లు, యులిప్‌లు, పొదుపు ఆధారిత పాలసీలతో సహా వివిధ బీమా ఉత్పత్తులను అవలంబించడంలో యువత ముందంజలో ఉంది. దీంతోపాటు పిల్లల విద్య, వివాహం, సొంతిల్లు వంటి మైలురాళ్ల కోసం చాలా మంది పెట్టుబడులు పెడుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది.
సవాళ్లూ ఉన్నాయ్..
అధిక మొత్తంలో బీమా యాజమాన్యం ఉన్నప్పటికీ సవాళ్లూ ఉన్నాయి. ప్రతి ముగ్గురు పట్టణ ప్రాంత దక్షిణ భారతీయులలో ఒకరు టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఎప్పుడూ పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఇందుకు ఆర్థిక స్థోమత, అత్యవసరత లేకపోవడం వంటివి అవరోధాలుగా ఉన్నాయి. ముఖ్యంగా యువత, తక్కువ-ఆదాయ సమూహాలలో ఇది ఎక్కువగా ఉంది.