వచ్చే పదేళ్లలో విస్తరించనున్న ఏఐ సామ్రాజ్యం
అవకాశాలను అంచనా వేస్తూ దిగ్గజాల అడుగు
ఏఐ. ఓ అనూహ్యమైన ఎకానమీని సృష్టిస్తోంది. ఈ రెండక్షరాల చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థ... వచ్చే పదేళ్లలో ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల (రూ.450 లక్షల కోట్లు) వ్యాపార అవకాశాల్ని అందించబోతోంది. ఇక ఈ ఎకోసిస్టమ్‌లో ఎదిగే కంపెనీల విలువైతే దీనికి వందరెట్ల పైనే ఉంటుందన్నది ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల అంచనా. బహుశా! పారిశ్రామిక విప్లవం తరవాత ప్రపంచం చవిచూస్తున్న అతిపెద్ద మార్పు ఇదే కావచ్చు.
ఏఐ ఎంతవేగంగా మారుతోందంటే... ఇపుడిది చాట్‌బోట్లకో, సాఫ్ట్‌వేర్ ఆటోమేషన్‌కో పరిమితం కాదు. తయారీ, విద్య, వైద్యం, ఫైనాన్స్, వ్యవసాయం, లాజిస్టిక్స్, డిఫెన్స్, శాస్త్రీయ పరిశోధన.. ఇలా అన్నిటికీ వెన్నెముకే. ఇపుడు పోటీ మెరుగైన ఏఐ మోడల్‌ను సృష్టించడానికి కాదు. మొత్తం ఏఐ వ్యవస్థను చేతుల్లో ఉంచుకోవటానికి.
సెమీ కండక్టర్ల నుంచి డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్‌ఫ్రా, డిజిటల్ ట్విన్స్, అటానమస్ సిస్టమ్స్, పారిశ్రామిక ఏఐ, రోబోటిక్స్... ప్లస్ నైపుణ్యం ఎవరి చేతుల్లో ఎక్కువ ఉంటాయన్నదే నియంత్రణాధికారానికి నిదర్శనం.
ఈ అధికారం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కార్పొరేట్లు బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుత పరిశ్రమల్ని మార్చటంతో పాటు కొత్త పరిశ్రమల్ని సృష్టించే ఏఐ వల్ల 2030 నాటికి ప్రపంచ జీడీపీ 15 ట్రిలియన్ డాలర్లు జతపడుతుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ఎన్ని రకాలు? వీటి అవసరాలేంటి? ఆ అవసరాలను అల్లుకుని ఎదుగుతున్న కంపెనీలేంటి? వాటి వ్యాపారమెంత? విలువెంత? అంతర్జాతీయ దిగ్గజాలెవరు? లాభపడే కంపెనీలేంటి?
ఇదీ.. ఏఐ సామ్రాజ్య స్వరూపం
చిప్ అండ్ సిలికాన్ (సెమీ కండక్టర్లు, జీపీయూలు, నెట్‌వర్కింగ్ సిలికాన్)
ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సర్వర్లు, స్టోరేజీ, కూలింగ్, విద్యుత్తు)
క్లౌడ్ అండ్ ప్లాట్‌ఫామ్స్ (కంప్యూటింగ్, క్లౌడ్, మెషీన్ లెర్నింగ్ ఆపరేషన్స్, హోస్టింగ్
ఫౌండేషన్ మోడల్స్ (లార్జ్ మోడల్స్, ట్రెయినింగ్, మరింత మెరుగుపరచటం
ఏఐ అప్లికేషన్లు (ఎంటర్‌ప్రైజ్ ఏఐ, వినియోగదారుల ఏఐ, పారిశ్రామిక ఏఐ తదితరాలు)
ఏఐ ఏజెంట్లు అండ్ అటానమీ (స్వతంత్ర వ్యవస్థలు, ఏజెంట్లు, రోబోటిక్స్)

సాక్షి, బిజినెస్


