రియల్‌ ఎస్టేట్‌లోకి పెట్టుబడుల వెల్లువ | Real estate leads AIF investments in India | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌లోకి పెట్టుబడుల వెల్లువ

May 3 2025 9:21 AM | Updated on May 3 2025 10:29 AM

Real estate leads AIF investments in India

సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ప్రత్యామ్నాయ పెట్టుబడులు(ఏఐఎఫ్‌) వెల్లువెత్తుతున్నాయి. 2024 డిసెంబర్‌ చివరి నాటికి రూ.73,903 కోట్లకు చేరాయి. గతేడాది డిసెంబర్‌ నాటికి అన్ని రంగాల్లో ఏఐఎఫ్‌లు కలిపి రూ.5,06,196 కోట్లు రాగా.. ఇందులో 15 శాతం వాటా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వచ్చాయని అనరాక్‌ నివేదిక వెల్లడించింది.

నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రాజెక్ట్‌లకు ఏఐఎఫ్‌ పెట్టుబడులు జీవాన్నిస్తున్నాయని, డెవలపర్లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. రియల్‌ ఎస్టేట్‌ తర్వాత అత్యధికంగా ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలోకి రూ.30,279 కోట్ల ఏఐఎఫ్‌ పెట్టుబడులు వెళ్లాయి.

ఆ తర్వాత ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ.26,807 కోట్లు, ఎన్‌బీఎఫ్‌సీ రూ.21,929 కోట్లు, బ్యాంకులు రూ.21,273 కోట్లు, ఫార్మా రూ.18,309 కోట్లు, ఎఫ్‌ఎంసీజీ రూ.12,743 కోట్లు, రిటైల్‌ రూ.11,550 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగం రూ.11,433 కోట్ల చొప్పున ఏఐఎఫ్‌ పెట్టుబడులు ఆకర్షించగా.. ఇతర రంగాల్లోకి రూ.2,77,970 కోట్ల పెట్టుబడులు వెళ్లాయి. రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్న నిధుల సమస్యకు ఏఐఎఫ్‌ రూపంలో పరిష్కారం లభించినట్టయింది.

ఏమిటీ ఏఐఎఫ్‌ పెట్టుబడులు?
దేశంలో సంపన్నులైన పెట్టుబడిదారులు ముఖ్యంగా కనీసం రూ.కోటి పెట్టుబడి పెట్టగల హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యూవల్స్‌ (HNI), సంస్థల కోసం ఉద్దేశించిన ప్రైవేట్ పెట్టుబడి సమీకరణ సాధనాలే ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌). 2012 ఏఐఎఫ్ నిబంధనల ప్రకారం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వీటిని నియంత్రిస్తుంది.

స్టాక్స్, బాండ్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి సంప్రదాయ పెట్టుబడులకు భిన్నంగా ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, కమోడిటీస్‌, డెరివేటివ్స్ వంటి సంప్రదాయేతర ఆస్తుల తరగతులలో ఏఐఎఫ్‌ పెట్టుబడులు పెడతారు.

Advertisement
 
Advertisement
Advertisement