
రాఖీ (రక్షాబంధన్) పండుగ వస్తుందంటే.. మార్కెట్లు కోలాహలంగా మారిపోతాయి. తోబుట్టువులు రాఖీలు కొనుగోలు చేస్తే.. వారి కోసం అన్నదమ్ములు గిఫ్ట్స్ కోనేస్తుంటారు. ఈ సంవత్సరం రాఖీ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ. 17,000 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది.
''ఈ సంవత్సరం మార్కెట్లలో చైనీస్ రాఖీలు, వస్తువులు కనిపించడం లేదు" అని CAIT సెక్రటరీ జనరల్ & చాందినీ చౌక్ ఎంపీ 'ప్రవీణ్ ఖండేల్వాల్' పేర్కొన్నారు. వినియోగదారులు కూడా చాలావరకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎంచుకుంటున్నారని అన్నారు.
రక్షా బంధన్ కేవలం సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు మాత్రమే కాదు, జాతీయవాదానికి కూడా ప్రతీకగా నిలిచింది. ఈ కారణంగానే ఈ సీజన్‌లో మోదీ రాఖీ, ఆపరేషన్ సిందూర్ రాఖీ, ఆత్మనిర్భర్ భారత్ రాఖీలు, డిజిటల్ రాఖీలు కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఖాదీ, వెదురు, పత్తితో తయారు చేసిన పర్యావరణ అనుకూల రాఖీలకు అధిక డిమాండ్ ఉంది. వీటిలో చాలా వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వ్యవస్థాపకులు, చేతివృత్తులవారు, స్వయం సహాయక బృందాలు చేతితో తయారు చేసినవే ఉన్నాయి.
ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..
రాఖీలు మాత్రమే కాకుండా.. స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ హ్యాంపర్లు, అలంకరణ వస్తువులు వంటి వస్తువుల ద్వారా ఏకంగా రూ.4,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని కైట్ అంచనా వేసింది. ఢిల్లీ, జైపూర్, ముంబై, లక్నో అంతటా ఎక్కువగా దేశభక్తి ఇతివృత్తాలతో కూడిన రాఖీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. రక్షాబంధన్ భారతదేశంలో అత్యంత బలమైన పండుగ సీజన్లలో ఒకటిగా ఉంటుందని వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు.