
పండుగ సీజన్ మొదలైపోయింది. పట్టణాల్లో ఉండేవారంతా.. సొంతూళ్లకు వెళ్ళడానికి సన్నద్ధమైపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే 'రౌండ్ ట్రిప్ ప్యాకేజీ' అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వేస్ తన 'రౌండ్ ట్రిప్ ప్యాకేజీ' కింద రిటర్న్ ఛార్జీలపై 20 తగ్గింపును ప్రవేశపెట్టింది. పండుగల సమయంలో రద్దీని నివారించడమే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించినట్లు రైల్వే మంత్రి 'అశ్విని వైష్ణవ్' పేర్కొన్నారు. వెళ్ళడానికి, తిరిగి రావడానికి ఒకేసారి టికెట్స్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
రైల్వే రౌండ్ ట్రిప్ ప్యాకేజీ.. టికెట్ బుకింగ్స్ వివరాలు
భారతీయ రైల్వే రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పథకం కింద ఆగస్టు 14 నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే వెళ్లేందుకు టికెట్ 2025 అక్టోబర్ 13 నుంచి 26 మధ్య, తిరిగి రావడానికి టికెట్ 2025 నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య ఉండాలి. వెళ్లేందుకు, తిరిగి రావడానికి బుక్ చేసుకునే టికెట్లలో పేరు, ఇతర వివరాలు ఒకేలా ఉండాలి. అప్పుడే 20 శాతం తగ్గింపు లభిస్తుంది.
ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..
రౌండ్ ట్రిప్ ప్యాకేజీ కింద ఒకే మోడ్‌ను (ఆన్‌లైన్ లేదా కౌంటర్ బుకింగ్) ఉపయోగించి.. వెళ్ళడానికి, తిరిగి రావడానికి టికెట్స్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఛార్జీల వాపసు ఉండదు. అంతే కాకుండా డిస్కౌంట్ జర్నీ కూపన్స్, వోచర్ బుకింగ్స్ మొదలైన రాయితీలపైన టికెట్స్ బుక్ చేసుకోలేరు. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.