
ఒకరికి ఎంత ఆరోగ్య బీమా కావాలి?
రూ.5–10 లక్షల బీమా చాలకపోవచ్చు
ఏటేటా ఎగబాకుతున్న వైద్య వ్యయాలు
జీవనశైలి వ్యాధుల ముప్పు
అవయవ మార్పిడులకు భారీ ఖర్చు
జీవితాంతం ఆదుకునే స్థాయిలో ఉండాలి
ఒకరికి ఎంత ఆరోగ్య బీమా రక్షణ అవసరం..? మెజారిటీ పాలసీదారులకు ఈ విషయంలో స్పష్టత లేదన్నది నిజం. పాలసీబజార్ సంస్థ నిర్వహించిన ‘హౌ ఇండియా బైస్ ఇన్సూరెన్స్ 2.0’ నివేదిక ప్రకారం.. 75 శాతం మంది ఎంపిక చేసుకుంటున్న ఆరోగ్య బీమా కవరేజీ రూ.10 లక్షలకు మించడం లేదు. మరీ ముఖ్యంగా 48 శాతం మంది రూ.5 లక్షలకే పరిమితం అవుతున్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో కుటుంబానికి ఈ కొద్ది పాటి రక్షణ చాలుతుందా? ఈ విషయంలో నిపుణుల సూచనలు తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి.
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 60 శాతం మంది ఎంపిక చేసుకుంటున్న బీమా రక్షణ రూ.5 లక్షలు అంతకులోపే ఉంటున్నట్టు పాలసీ జజార్ అధ్యయనం గుర్తించింది. వీరిలో చాలా మంది మెరుగైన చికిత్సల కోసం మెట్రోలకు వెళుతున్నారు. దీంతో రవాణా వ్యయాలకు తోడు మెట్రోల్లో చికిత్స తీసుకున్నందుకు కో–పేమెంట్ చెల్లించాల్సి రావడంతో వారిపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. అందుకే ఎంపిక చేసుకునే కవరేజీ అవసరాల్లో పూర్తిగా ఆదుకునే స్థాయిలో ఉండాలి. కరోనా విపత్తు సమయంలో రూ.10 లక్షలు, అంతకుమించి భారీ బిల్లుల చెల్లింపుల కోసం ఎంతో మంది అప్పులు చేయాల్సి రావడాన్ని మర్చిపోకూడదు.
ఏటేటా పెరుగుతున్న చార్జీలు
వైద్య రంగంలో ద్రవ్యోల్బణం సాధారణం కంటే రెట్టింపునకు పైగా ఉంటోంది. 12–15 శాతం మధ్య ఉంటుందన్నది నిపుణుల అంచనా. అంటే వేతన జీవులకు ఏటా ఆదాయ వృద్ధికి మించి వైద్య చార్జీలు పెరుగుతున్నట్టు అర్థమవుతోంది. ఒకవైపు మారిన జీవనశైలి కారణంగా వ్యాధుల ముప్పు పెరుగుతోంది. మరోవైపు అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి.
దీంతో అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ సగటు జీవనకాలం పెరుగుతోంది. ఇంకోవైపు గత దశాబ్ద కాలంలో చికిత్సలు, డయాగ్నోస్టిక్స్ చార్జీలు గణనీయంగా పెరిగాయి. గుండె సర్జరీలు, కేన్సర్ చికిత్సలు, అవయవ మార్పిడుల వంటి వాటికి రూ.30–50 లక్షల వరకు ఖర్చవుతోంది. ముఖ్యంగా అవయవ మార్పిడి అనంతరం ఏవైనా సమస్యలు ఎదురైతే.. అప్పుడు చికిత్సల కోసం మరింత అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాంటప్పుడు బిల్లు రూ.కోటి దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఉదాహరణకు లక్ష్మణ్ కుమార్ (45)కు హెపటైటిస్–సి వైరస్ సోకింది. సకాలంలో గుర్తించి వైద్యం తీసుకోకపోవడంతో చివరికి కాలేయ మార్పిడికి వెళ్లాల్సి వచి్చంది. రక్త సంబం«దీకులు వైద్య పరంగా ఫిట్‌గా లేకపోవడంతో దాత నుంచి కాలేయం స్వీకరించి మార్పిడి చేశారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన తర్వాత కుమార్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడు. దీంతో ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతం కాలేదు. తిరిగి ఆస్పత్రిలో చేరగా.. రెండు వారాల తర్వాత మృతి చెందాడు. కార్పొరేట్ ఆస్పత్రిలో వీటన్నింటికీ అయిన బిల్లు రూ.కోటి దాటింది.
2013లో కిడ్నీ మార్పిడికి రూ.5 లక్షలు ఖర్చు కాగా, ఇప్పుడు రూ.18 లక్షలకు చేరింది. గుండె మార్పిడి చికిత్సకు సగటున రూ.30 లక్షలకుపైనే వ్యయమవుతోంది. అదే ఊపిరితిత్తుల మార్పిడికి రూ.కోటి వరకు ఖర్చు అవుతోంది. కనుక రూ.5–10 లక్షల హెల్త్ కవరేజీ అర్థవంతమైనది కాదన్న సూచన వినిపిస్తోంది. ఒకవేళ రూ.25 లక్షల కవరేజీ ఉన్నా కానీ.. అవయవ మార్పిడి అవసరమైన పరిస్థితుల్లో అది కూడా చాలకపోవచ్చు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో? అన్న దానికి కుమార్ కేసు ఒక ఉదాహరణ. అందుకే సంపూర్ణ రక్షణపై ప్రతి కుటుంబం దృష్టి పెట్టాలి. పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో బీమా కంపెనీలు ఇప్పుడు రూ.కోటి, అన్‌లిమిటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తక్కువ ప్రీమియానికే అందిస్తున్నాయి.
‘‘వ్యక్తులు బీమా ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. దీంతో రూ.10–20 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటున్నారు. కానీ, వయసు పెరుగుతున్న క్రమంలో తీవ్ర వ్యాధుల బారిన పడిన తర్వాత బీమా కవరేజీ మొత్తాన్ని పెంచుకోవడం అంత సులభం కాదు. వైద్య ద్రవ్యోల్బణం దృష్ట్యా బీమా కవరేజీని ఎప్పటికప్పుడు పెంచుకోవడం కష్టమే’’ అని నివా బూపా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బబతోష్ మిశ్రా తెలిపారు. భవిష్యత్తు అవసరాలు, పెరిగిపోతున్న వైద్య చికిత్సల వ్యయాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన బీమా కవరేజీని చిన్న వయసులోనే తీసుకోవడం మంచి నిర్ణయమవుతుందని మిశ్రా మాటలను బట్టి తెలుస్తోంది.
బిల్లు ఎంతయినా సరే..
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, నివా బూపా ‘అన్‌లిమిటెడ్’ (పరిమితుల్లేని కవరేజీ) హెల్త్ ప్లాన్లను ఇటీవలి కాలంలో తీసుకొచ్చాయి. ఉదాహరణకు నివా బూపా ‘రీఅష్యూర్ 3.0’ ప్లాన్ అన్ని క్లెయిమ్‌లు, అనారోగ్యాలకు అపరిమిత బీమాను ఆఫర్ చేస్తోంది. ‘‘చికిత్సా నాణ్యత పరంగా పాలసీదారులు రాజీపడాల్సిన అవసరం ఉండకూడదు. అభివృద్ధి చెందిన దేశాల్లో అసలు సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) అనేది ఉండదు.
ఒక వ్యక్తికి లేదా ఫలానా వ్యాధికి జీవితకాల పరిమితులు మాత్రమే ఉంటాయి’’ అని నివా బూపా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బబతోష్ మిశ్రా తెలిపారు. బజాజ్ అలియాంజ్ ఇని్ఫనిటీ ప్లాన్‌లో.. రోజువారీ రూమ్ రెంట్ రూ.3,000–50,000 ఆధారంగా కవరేజీని ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉంది. రోజువారీ రూమ్ రెంట్‌కు 100 రెట్ల వరకు సమ్ ఇన్సూర్డ్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆస్పత్రి బిల్లు అంతకుమించితే అప్పుడు 15–25–25 శాతం కోపేమెంట్ (పాలసీదారు తనవంతు చెల్లించాల్సిన వాటా) అమలు చేస్తోంది.
అవసరమా? లేక అదనమా?
వైద్య ద్రవ్యోల్బణం అధికంగా ఉంటున్న పరిస్థితుల్లో అన్‌లిమిటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్నిస్తుందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక్కడి నుంచి మరో 10, 20, 30 ఏళ్ల వైద్య అవసరాలను తీర్చగలిగేలా ఉండాలన్నది వారి సూచన. నేడు రూ.10 లక్షల కవరేజీ.. వచ్చే పదేళ్ల కాలంలో రెట్టింపునకు పైగా పెరిగే వైద్య వ్యయాలను ఏ మాత్రం తీర్చగలదు? మరీ ముఖ్యంగా 20–30 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో ఖరీదైన చికిత్సలకు ఇప్పుడు తీసుకునే కవరేజీ భరోసానిస్తుందా? అని ప్రశ్నించుకోవాలి. 2024–25లో హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం క్లెయిమ్‌ల్లో 20 శాతం గుండె సంబంధితమైనవే ఉన్నాయి. పదేళ్ల క్రితం ఉన్న 10 శాతంతో పోల్చి చూస్తే రెట్టింపయ్యాయి. అంతేకాదు సగటు క్లెయిమ్ రూ.4–5 లక్షల నుంచి రూ.14–17 లక్షలకు పెరిగిపోయింది.
ఏదో ఒకటి లేదా రెండు సందర్భాల్లో పెద్ద మొత్తంలో క్లెయిమ్‌కు సన్నద్ధమైతే చాలు కానీ, తరచూ ఇలా పెద్ద క్లెయిమ్‌లు అవసరపడవని నిపుణులు చెబుతున్నారు. ‘‘అపరిమిత కవరేజీ అన్నది మార్కెటింగ్ ఎత్తుగడ. ఉదాహరణకు ఒక వ్యక్తికి రూ.కోటి సమ్ ఇన్సూర్డ్ కింద ఒకటికి మించిన పర్యాయాలు రీస్టోరేషన్ (తిరిగి అంతే మొత్తాన్ని పునరుద్ధరించడం) అవసరం ఏర్పడదు. పెద్ద మొత్తంలో క్లెయిమ్‌లను ఒకటికి మించిన పర్యాయాలు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కంపెనీలు చెల్లిస్తాయా? అన్నది చూడాలి.
ఒకవేళ క్లెయిమ్‌లు పెద్ద సంఖ్యలో ఎదురైతే బీమా కంపెనీలు ఆయా ప్లాన్లను ఉపసంహరించుకోవచ్చు’’ అని ఆల్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల జాతీయ అధ్యక్షుడు ప్రశాంత్ మాత్రే అభిప్రాయపడ్డారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఏటా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రీమియం సవరణకు గురవుతుంటుంది. కొనుగోలు సమయంలో ప్రీమియం భరించే స్థాయిలోనే ఉండొచ్చు. వయసు, వైద్య ద్రవ్యోల్బణం, క్లెయిమ్‌ల ఆధారంగా ప్రీమియం కాలక్రమంలో పెరిగిపోతుంది.
‘‘కొంత కాలం తర్వాత అంత ప్రీమియం చెల్లించడం కష్టం కావొచ్చు. వైద్య చికిత్సల ధరలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న తరుణంలో ఈ తరహా ప్లాన్‌లు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయా? అన్నది ప్రశ్నార్థకమే. బీమా కంపెనీలు నష్టాలను ఇస్తున్న ప్లాన్లను తర్వాతి కాలంలో ఉపసంహరించుకుని, మరొక ప్లాన్‌లోకి మారిపోవాలని పాలసీదారులను కోరతాయి’’ అని ఫస్ట్‌పాలసీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ రీజినల్ డైరెక్టర్ హరి రాధాకృష్ణన్ తెలిపారు. కనుక అన్‌లిమిటెడ్ పేరుతో ఉన్న ప్లాన్లను తీసుకోవాలనేమీ లేదు. మెరుగైన కవరేజీ ఉండేలా చూసుకోవడం అవసరం.
కవరేజీ ఎంత అవసరం?
కనీసం రూ.10–25 లక్షలకు బేసిక్ సమ్ ఇన్సూర్డ్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుని.. ఈ మేరకు డిడక్టబుల్‌తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ తీసుకోవడాన్ని సైతం పరిశీలించొచ్చు. దీనివల్ల బేసిక్ ప్లాన్ ప్రీమియం భరించలేని స్థాయిలో పెరగకుండా చూసుకోవచ్చు. బిల్లు రూ.10–25 లక్షలు మించిన సందర్భాల్లో, అదనపు చెల్లింపులు చేసే సూపర్ టాపప్ ప్లాన్ల ప్రీమియం తక్కువే ఉంటుంది. నలుగురు లేదా ఐదుగురు సభ్యుల కుటుంబం రూ.కోటి సమ్ ఇన్సూర్డ్ కవరేజీ కలిగి ఉండడం నేటి పరిస్థితుల్లో అవసరమే.
జీవనశైలి వ్యాధుల తీవ్రత భవిష్యత్తులోనూ మరింత పెరిగేదే. దీనికితోడు ఎప్పటికప్పుడు మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వస్తుంటాయి. కనుక వీటి వ్యయాలు కూడా అధికంగా ఉంటాయి. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే తరుణంలో బీమా కవరేజీ పెంచుకోవడం కష్టమవుతుంది. కనుక అప్పటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన కవరేజీని ముందుగానే ఎంపిక చేసుకోవాలి. రూ.10 లక్షల సమ్ ఇన్సూర్డ్‌కు, రూ.కోటి సమ్ ఇన్సూర్డ్‌కు మధ్య ప్రీమియం వ్యత్యాసం 10–15 శాతమే ఉంటుంది. కనుక ప్రీమియం చెల్లించే సామర్థ్యం కలిగిన వారు మెరుగైన కవరేజీకి వెళ్లడమే సూచనీయం.
వీటిని చూడాలి..
→ ఒకే రకమైన బీమా కవరేజీ అన్నది అందరికీ అనుకూలమని చెప్పలేం. ఏ వయసులో ఉన్నారు? ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా? అన్నది చూడాలి.
→ మెట్రోల్లో నివసించే వారికి అధిక కవరేజీ అవసరం పడుతుంది. ఎందుకంటే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ తరహా మెట్రోలు, ఇతర పట్టణాలకు మధ్య చికిత్సల ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన, నాణ్యమైన చికిత్సలకు కవరేజీ ఉండేలా చూసుకోవాలి.
→ బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్‌తోపాటు క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ కూడా అవసరమే. గుండె, మూత్ర పిండాలు, కాలేయం, మెదడు, ఊపిరితిత్తులకు సంబంధించి తీవ్ర అనారోగ్యాల్లో ఏక మొత్తంలో చెల్లింపులు చేసే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి.
→ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో ఒకరు ఆస్పత్రి పాలై, బీమా కవరేజీ మొత్తం ఖర్చయిపోతే.. మిగిలిన వారికి అదే ఏడాది రక్షణ కోసం రీస్టోరేషన్ సదుపాయం ఉండేలా చూసుకోవాలి.
→ 60 ఏళ్లు దాటిన తల్లిదండ్రులను అంతకు తక్కువ వయసున్న కుటుంబ సభ్యుల ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో భాగం చేయొద్దు. ఎందుకంటే వృద్ధాప్యంలో క్లెయిమ్‌లు ఎక్కువగా వస్తుంటాయి. దాంతో బీమా కవరేజీ తల్లిదండ్రులకే ఖర్చయిపోతుంది. పైగా పాలసీలో పెద్ద వయసున్న వారి ఆధారంగా ప్రీమియం నిర్ణయం అవుతుంది.
→ 60 ఏళ్లు దాటిన తల్లిదండ్రులకు విడిగా హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఉద్యోగుల తల్లిదండ్రులకు కంపెనీలు ఆఫర్ చేసే గ్రూప్ హెల్త్ కవరేజీని తీసుకోవచ్చు.
→ వయసు పెరుగుతున్న క్రమంలో హెల్త్‌ప్లాన్ సమ్ ఇన్సూర్డ్‌ను కనీసం ఐదేళ్లకోసారి సమీక్షించుకోవాలి. కవరేజీ సరిపడదనుకుంటే, దాన్ని పెంచుకోవాలి. కంపెనీ సేవలు, క్లెయిమ్ చెల్లింపుల తీరు సంతృప్తికరంగా లేకపోతే, మెరుగైన సేవలు, చెల్లింపుల చరిత్ర ఉన్న కంపెనీకి పోరి్టంగ్ ద్వారా మారిపోవచ్చు.
– సాక్షి బిజినెస్ డెస్క్