ఓపెన్‌ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు! | Open Plots Boom Turns Into Buyer Trouble Real estate Hyderabad | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!

Nov 22 2025 7:51 AM | Updated on Nov 22 2025 9:10 AM

Open Plots Boom Turns Into Buyer Trouble Real estate Hyderabad

తక్కువ ధరకే విల్లా, ఫామ్‌ ప్లాట్లంటూ అంటగట్టిన బిల్డర్లు

ఏళ్లు గడుస్తున్నా.. ఎలాంటి అభివృద్ధి లేక పెరగని ప్లాట్ల ధరలు

సిటీ నుంచి వంద కి.మీ. వరకూ కుప్పలుతెప్పలుగా వెంచర్లు

ఉంచుకోలేక, అమ్ముకోలేక వేతన జీవుల కష్టాలు

ఓపెన్‌ ప్లాట్ల కొనుగోలులో అప్రమత్తత అవసరం

‘మూడేళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి దాదాపు 100 కి.మీ. దూరంలో ఉన్న జహీరాబాద్‌లో ఓ నిర్మాణ సంస్థ భారీ వెంచర్‌ చేసింది. నిమ్జ్‌కు సమీపంలో ఉండటంతో రెట్టింపు ధర పక్కాగా వస్తుందని ఆశ పెట్టడంతో ఓ ప్రైవేట్‌ ఉద్యోగి గజం రూ.8 వేలు చొప్పున 150 గజాల స్థలాన్ని కొన్నాడు. కొడుకు పైచదువుల కోసమని ఏడాది క్రితం నుంచి ప్లాట్‌ అమ్మకానికి పెడితే పోవడం లేదు. రెట్టింపు ధర కాకపోయిన కనీసం బ్యాంకు వడ్డీ చొప్పున ధర కలిసొచ్చినా విక్రయిద్దామని చూసినా లాభం లేకుండా పోయింది. దీంతో ప్లాట్‌ కొన్న కంపెనీ ఆఫీసుకు వెళ్లి తన ప్లాట్‌ విక్రయించి పెట్టమని చెబితే.. ఇప్పుడక్కడ మార్కెట్‌ బాగాలేదని, మరో ఏడాది పాటు ఆగాలని సర్దిచెప్పి పంపించేశారు... ఇదీ రీసేల్‌ ప్లాట్ల పరిస్థితి.  – సాక్షి, సిటీబ్యూరో

ఎవరైనా సరే భూమి ఎందుకు కొంటారు? పిల్లల చదువుకోసమో, అమ్మాయి పెళ్లి కోసమో, ఇతర భవిష్యత్తు అవసరాల కోసం అక్కరకొస్తుందనే కదా! కానీ, ప్రస్తుతం రీసేల్‌ ప్లాట్లకు గిరాకీ ఉండటం లేదు. కుప్పలు తెప్పలుగా వెంచర్లు రావడం, స్థానిక సంస్థల నుంచి అనుమతులు లేకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవటంతో పాటు ప్రభుత్వ ప్రతికూల విధానాలతో స్థిరాస్తి మార్కెట్‌ మందగించింది. దీంతో రీసేల్‌ ప్లాట్లకు గిరాకీ పూర్తిగా తగ్గింది.

నగరం చుట్టూ ఇదే పరిస్థితి.. 
రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌), యాదాద్రి, నిమ్జ్, ఫార్మా సిటీ, టెక్స్‌టైల్స్‌ పార్క్, ఇండ్రస్టియల్‌ పార్క్, ఐటీ హబ్‌లు, మెట్రో రైలు విస్తరణ.. ఇలా అనేక ప్రాజెక్ట్‌లు వచ్చేస్తున్నాయంటూ హైదరాబాద్‌ నుంచి వంద కిలో మీటర్ల వరకూ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు భారీ వెంచర్లు చేస్తున్నారు. యాదాద్రి, జనగాం, సదాశివపేట, షాద్‌నగర్, సంగారెడ్డి, చౌటుప్పల్, చేవెళ్ల వంటి ప్రాంతాలలో ఫామ్‌ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, వీకెండ్‌ హోమ్స్‌ అని రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. ప్లాట్‌ కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఉంటాయని అందమైన బ్రోచర్లతో ఊదరగొడుతున్నారు. వీటిని నమ్మి కొన్నవారికి నిరాశే ఎదురవుతుంది. స్థానిక సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా, ఎలాంటి మౌలిక వసతులను కల్పించకుండానే వెంచర్లను విక్రయిస్తున్నారు. తెల్ల కాగితాల మీద గీతలు గీసేసి, ప్లాట్లను విక్రయించే బిల్డర్లు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

రెరాలో నమోదు లేకుండానే.. 
నిబంధనల ప్రకారం రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు కూడా టీఎస్‌–రెరాలో నమోదు చేసుకోవాలి. కానీ, నిర్మాణ సంస్థలు ఇవేవీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మార్కెటింగ్‌ ప్రతినిధులను నియమించుకుంటున్నాయి. ఏజెంట్లకు ఒక్క ప్లాట్‌ విక్రయిస్తే రూ.2 లక్షలకు పైగానే కమీషన్‌ అందిస్తున్నాయి. ఎక్కువ ప్లాట్లను విక్రయిస్తే ఏజెంట్లకు బంగారం, కార్లు గిఫ్ట్‌లుగా ఇవ్వడంతో పాటు గోవా, మలేíÙయా, దుబాయ్, బ్యాంకాక్‌ హాలీడే ట్రిప్పులకు తీసుకెళుతున్నారు. మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లతో గొలుసుకట్టు వ్యాపారం చేస్తున్నాయి. ప్రతి ఆదివారం నుంచి బస్సులు, కార్లలో కొనుగోలుదారులను వెంచర్ల వద్దకు తీసుకెళుతున్నాయి. వీకెండ్‌ వస్తే చాలు వెంచర్ల వద్ద టెంట్లు, ఏసీ గదులను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్‌ల గురించి వివరిస్తున్నాయి. కొనుగోలుదారులకు మందు, విందు అందిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఇక్కడ అద్దె కన్నా సొంతిల్లు చవక!

అమ్ముకోలేక అగచాట్లు.. 
కొన్ని ప్రాంతాల్లో బిల్డర్లు నిర్మానుశ్య ప్రాంతాలు, జంగిల్‌లలో కూడా వెంచర్లు వేశారు. కనీసం అక్కడ ఊరు ఆనవాళ్లు కూడా కనిపించవు. ఆయా ప్రాంతాలలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు అత్యవసరం అయితే అమ్ముకోలేక అగచాట్లు పడుతున్నారు. వెంచర్లు చేసిన సంస్థ విక్రయించిన ధరకు ప్లాట్‌ను తీసుకోవడానికి వెనకంజ వేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్లాట్‌పై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా ధర పెరుగుతుందనే ధీమాతో చాలా మంది కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. అలాంటి వారంతా రెండు, మూడేళ్లుగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే అమ్ముడుపోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement