బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్‌ రేసు | NSE to shift weekly derivatives expiry to Tuesday and BSE to Thursday | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్‌ రేసు

Jun 18 2025 1:15 AM | Updated on Jun 18 2025 7:52 AM

NSE to shift weekly derivatives expiry to Tuesday and BSE to Thursday

కాంట్రాక్టుల ముగింపు రోజుల్లో మార్పు 

మంగళవారానికి ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్‌ 

బీఎస్‌ఈ కాంట్రాక్టుల గడువు గురువారానికి 

సెప్టెంబర్‌ 1 నుంచి అమలుకు సెబీ అనుమతి

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లో అత్యధిక శాతం ట్రేడింగ్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లోనే జరుగుతుంటుంది. ఇటీవల నగదు విభాగంలోనూ టర్నోవర్‌ భారీగా పెరిగినప్పటికీ ఎఫ్‌పీఐలు, డీఐఐలు అధికంగా పొజిషన్స్‌ తీసుకునే డెరివేటివ్స్‌దే ఆధిపత్యం. అయితే కొన్నేళ్లుగా ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ప్రతి నెలా చివరి గురువారం ముగుస్తుంటే.. బీఎస్‌ఈలో వీటికి చివరి మంగళవారం తెరపడుతోంది.

ఈ నేపథ్యంలో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఒకే రోజు ఈక్విటీ డెరివేటివ్స్‌ ముగింపు ప్రయోజనకరంగా ఉంటుందంటూ గత నెల(మే)లో స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సూచించింది. కానీ.. బీఎస్‌ఈ గడువుకు ఎన్‌ఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ గడువుకు బీఎస్‌ఈ తాజాగా సెబీ నుంచి అనుమతులు 
పొందడం విశేషం! 

అటూఇటూ మార్పు(స్వాప్‌) ఇలా.. 
ఈక్విటీ డెరివేటివ్‌ కాంట్రాక్టులను ప్రతి నెలా చివరి మంగళవారం ముగించేందుకు సెబీ అనుమతించినట్లు ఒక ప్రకటనలో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) వెల్లడించింది. ప్రస్తుతం ప్రతి నెలా చివరి గురువారం ఎఫ్‌అండ్‌వో ముగింపును చేపడుతోంది. మరోపక్క బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) సైతం డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువును ప్రతి నెలా చివరి మంగళవారం నుంచి గురువారానికి మార్చుకునేందుకు సెబీ అనుమతించినట్లు తెలియజేసింది.

వెరసి ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్‌ ప్రతీ నెలా చివరి మంగళవారం, బీఎస్‌ఈ కాంట్రాక్టులు ప్రతి నెలా చివరి గురువారం ముగియనున్నాయి. ఎఫ్‌అండ్‌వో గడువు మార్పును రెండు ఎక్స్ఛేంజీలు  సర్క్యులర్‌లో  పేర్కొన్నాయి. వెరసి 2025 సెపె్టంబర్‌ 1 నుంచి డెరివేటివ్‌ కాంట్రాక్టులకు కొత్త షెడ్యూల్‌ అమలుకానుంది.

Advertisement
 
Advertisement
Advertisement