త్వరలో వాహనదారులకు ఊరట కలిగించే పాలసీ | New Toll Policy Proposals to bring relief under finance ministers consideration | Sakshi
Sakshi News home page

త్వరలో వాహనదారులకు ఊరట కలిగించే పాలసీ

Apr 14 2025 2:29 PM | Updated on Apr 14 2025 3:03 PM

New Toll Policy Proposals to bring relief under finance ministers consideration

జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై అధిక టోల్ ఛార్జీల నుంచి లక్షలాది మంది వాహనదారులకు ఉపశమనం కలిగించే కొత్త టోల్‌ పాలసీ త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు వేగంగా కదులుతున్నాయి. రెండున్నర లేన్లుగా ఉన్న ఇరుకైన జాతీయ రహదారులపై యూజర్ ఫీజు రద్దు, కార్ల అపరిమిత ప్రయాణానికి రూ .3,000 వార్షిక పాస్.. కేంద్ర రోడ్డు రవాణా శాఖ చేసిన ఈ రెండు ప్రతిపాదనలు ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి.

ఈ ప్రతిపాదనలకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే వీటి వల్ల ఖజానా కొంతమేర నష్టం కలుగనున్న నేపథ్యంలో వీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగ పరిశీలనకు పంపినట్లు తెలుస్తోంది. వార్షిక పాసులవల్ల టోల్ ఆదాయానికి కొంతమేర గండి పడనున్నప్పటికీ, ఇరుకైన రహదారులపై యూజర్ ఫీజు వసూలును నిలిపివేయడం వల్ల మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని భావిస్తున్నారు.

ప్రైవేటు వాహనాలకు వార్షిక, జీవితకాల పాస్ ఆప్షన్‌ను అందించే ప్రణాళిక గురించి రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గతంలో చెప్పారు. దీనిపట్ల వాహన యజమానులలో విశేష స్పందన ఉన్న నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ దీనిపై ఎక్కువ దృష్టి పెట్టింది. 2024-25లో మొత్తం టోల్ ఆదాయం రూ.61,000 కోట్లలో ప్రైవేటు కార్ల వాటా 20-21 శాతంగా ఉంది. 79-80% రుసుములో ఎక్కువ భాగం వాణిజ్య , భారీ వాహనాల నుండి వస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement