హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ సీఈవో చంద్రశేఖర్ ముద్రగణం వెల్లడించారు. ఇతర సంస్థల కొనుగోళ్లు, వ్యాపార విస్తరణ ఇందుకు దోహదపడనున్నట్లు ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 26 శాతం వృద్ధి చెంది రూ. 1,002 కోట్లుగా నమోదైంది.
ఒరిస్సాలో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనిపై మూడు దశల్లో 350 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఏఐ ఆధారిత యాక్సెస్‌జినీ ప్లాట్‌ఫాం, బ్లూహెల్త్, బ్లూబయో మొదలైన వాటిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. క్యాన్సర్ సంబంధ పరిశోధనలకు తోడ్పడేలా దాదాపు రూ. 400 కోట్లతో గుంటూరులో బయోబ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఆఫ్రికాలోని వర్ధమాన దేశాల్లో విస్తరణపై ఫోకస్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వివిధ ఉత్పత్తుల కోసం నాలుగు దేశాలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 450 మంది ఉద్యోగులు ఉండగా, 2030 నాటికి ఈ సంఖ్యను 2,000కు పెంచుకోనున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. అప్పటికల్లా బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు.


