రెపో రేటు 5.25 శాతంవద్దే కొనసాగింపు
ద్రవ్యోల్బణ అంచనాలు 5 శాతానికి తగ్గింపు
వృద్ధి రేటు 6.7 శాతానికి పెంపు
రుతుపవనాలు, గ్లోబల్ పరిణామాల రిస్క్ లతో అనిశ్చితి ఉన్నట్లు ఆర్‌బీఐ వెల్లడి
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ వరుసగా నాలుగోసారీ పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. కీలకమైన రెపో రేటును 5.5 శాతంగానే ఉంచాలని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. తదుపరి ఎంపీసీ సమావేశం అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరగనుంది.
ఆహార, ఇంధన ధరల పెరుగుదల కారణంగా సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మరింత పెరిగి 2026–27 మూడో త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకుని, క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేస్తున్నట్లు ద్వైమాసిక పాలసీ సమీక్ష సమావేశం అనంతరం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
కొన్ని విభాగాల్లో మినహా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు విస్తృతంగా లేనందున ద్రవ్య పరపతి విధానాన్ని అత్యవసరంగా కఠినతరం చేయాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. ద్రవ్యోల్బణం అంచనాలపై మరింత స్పష్టత వచ్చే వరకు వేచి చూస్తూనే, ధరలను టార్గెట్ దిగువకు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు. తటస్థ పాలసీ విధానం, వడ్డీ రేట్లపై తదుపరి నిర్ణయాలనేవి ఎప్పటికప్పుడు వచ్చే డేటాపై ఆధారపడి ఉంటాయని మల్హోత్రా చెప్పారు.
‘‘వేగంగా మారిపోతున్న పశ్చిమాసియా పరిణామాలపై అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు, సెంటిమెంట్లు ఆధారపడి ఉంటున్నాయి. ఇవి దేశీయంగా వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటమనేది, భారత ఎకానమీ ఈ గ్లోబల్ షాక్‌లను తట్టుకునేందుకు తోడ్పడుతోంది’’ అని మల్హోత్రా చెప్పారు.
‘‘వృద్ధికి ఊతమివ్వడం, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, ధరలు .. కరెన్సీ స్థిరంగా ఉండేలా చూడటం .. ఇలా ఏ అంశమైనా సరే ఎకానమీని మరింత బలోపేతం చేసే విధానాలను అమలు చేయడాన్ని కొనసాగిస్తాం’’ అని ఆయన తెలిపారు. గ్లోబల్‌గా అనిశ్చితి నెలకొన్నప్పటికీ సర్వీసుల ఎగుమతులు, రెమిటెన్సుల రాకతో దేశ కరెంటు అకౌంటు పటిష్టంగా ఉన్నట్లు వివరించారు. జూలై 31 నాటికి ఫారెక్స్ నిల్వలు 692.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వివరించారు.
త్వరలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు లైసెన్సు మార్గదర్శకాలు
యూనివర్సల్ బ్యాంకుల తరహాలోనే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు ఆన్–ట్యాప్ లైసెన్సులు ఇవ్వడానికి సంబంధించి త్వరలోనే ముసాయిదా మార్గదర్శకాలను వెల్లడించనున్నట్లు మల్హోత్రా తెలిపారు. దీనిపై జనవరిలోనే చర్చాపత్రాన్ని రూపొందించినట్లు వివరించారు. మరోవైపు, బ్యాంకింగ్ రంగంలో గణనీయంగా మార్పులు వచ్చిన నేపథ్యంలో గ్రామీణ సహకార బ్యాంకుల్లో రిస్క్ ల నిర్వహణ మార్గదర్శకాలను సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు.
రుణాలపై వడ్డీ రేట్ల క్రమబద్దీకరణ..
నియంత్రిత సంస్థలవ్యాప్తంగా రుణాలపై వడ్డీ రేట్లను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మల్హోత్రా వివరించారు. వడ్డీ రేట్లలో పారదర్శకతను పెంచేందుకు, పరపతి విధాన నిర్ణయాల బదలాయింపు అమలయ్యేందుకు, విని యోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
మరోవైపు, రూపాయిని బలోపేతం చేసే ఉద్దేశంతో పరిమిత కాలం కోసం ప్రకటించిన ఫారిన్ కరెన్సీ నాన్–రెసిడెంట్ (బ్యాంక్) స్కీము కింద గణనీయంగా నిధులు వస్తున్నాయని గవర్నర్ చెప్పారు. దీన్ని ముందస్తుగా ముగించేసే యోచనేదీ లేదని తెలిపారు.
విదేశీ నిధులు వస్తున్నప్పటికీ దేశీ కరెన్సీ బలపడకపోవడంపై స్పందిస్తూ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే రూపా యి మరింత బలోపేతం కావచ్చని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాలిమర్ కరెన్సీ అంతా సజావుగా జరిగితే, పాలిమర్ కరెన్సీ నోట్లను 2028 ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు మల్హోత్రా వివరించారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నోట్లు 30 ఏళ్లకు పైగా మన్నాయని ఆయన పేర్కొన్నారు.
ద్వితీయార్థంలో అర శాతం పెంపునకు చాన్స్
రిస్కులను కూడా ప్రస్తావిస్తూ సమతూకంగా ఆర్‌బీఐ పాలసీ విధానం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఉపాసనా భరద్వాజ్ చెప్పారు. 2027 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో 50 బేసిస్ పాయింట్ల మేర రేట్ల పెంపు ఉండొచ్చని చెప్పారు. మరోవైపు, కఠినతరం చేసే సంకేతాలు ఇవ్వకుండా, తటస్థ ధోరణిని పాటించడం ద్వారా ఆర్‌బీఐ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉండేలా చూసుకుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఎండీ రాహుల్ గోస్వామి చెప్పారు.
ఇతర కీలకాంశాలు ..
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని జూన్‌లో అంచనా వేయగా, తాజాగా 5 శాతానికి తగ్గించారు. ఆహారం, ఇంధనం భాగంగా ఉండని కోర్ ద్రవ్యోల్బణ అంచనాలను 4.7 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గించారు.
→ వృద్ధి రేటు అంచనాలను 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంచారు. వాస్తవ జీడీపీ వృద్ధి క్యూ1లో 7 శాతంగా, క్యూ2లో 6.4 శాతంగా, క్యూ3లో 6.5 శాతంగా, క్యూ4లో 6.8 శాతంగా ఉంటుందని అంచనా. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నా దేశీయంగా డిమాండ్, తయారీ, సర్వీసుల కార్యకలాపాలు, ఎగుమతులు మెరుగ్గా ఉండటం ఇందుకు దోహదపడనున్నాయి. అయితే, రుతు పవనాలు, ఎల్‌నినో పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, గ్లోబల్ ట్రేడ్ పాలసీలపరమైన రిస్కులు పొంచి ఉన్నాయి.
→ ఏప్రిల్–మే వ్యవధిలో కరెంటు అకౌంటు మి గులు 2.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
→ తొలి త్రైమాసికంలో స్థూలంగా 30.7 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి.


