వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం | Microsoft Preparing Third Major Round Of Layoffs In 2025 | Sakshi
Sakshi News home page

వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం

Jun 20 2025 10:54 AM | Updated on Jun 20 2025 12:09 PM

Microsoft Preparing Third Major Round Of Layoffs In 2025

ప్రముఖ ఐటీ సర్వీస్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రధానంగా తన సేల్స్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వేలాది ఉద్యోగాలను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో కంపెనీ పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. జులై ప్రారంభంలో ఉద్యోగాల్లో కోతలను ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు.

ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ మే నెలలో 6,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. తర్వాత కొన్ని వారాలకు 300కి పైగా తొలగించింది. ఈ ఏడాది మూడో అతిపెద్ద ఉద్యోగుల తగ్గింపునకు సంస్థ సిద్ధమవుతోంది. గతంలో ప్రకటించిన లేఆఫ్స్‌ ద్వారా ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డెవలపర్లు ప్రభావితం అయ్యారు. ఈసారి భిన్నంగా మైక్రోసాఫ్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగ కోతలను విధించే అవకాశం ఉంది. జూన్ 2024 నాటికి కంపెనీ మొత్తం 2,28,000 మంది ఉద్యోగుల్లో 45,000 మంది ఈ విభాగంలో పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపు

ప్రత్యేకంగా సేల్స్‌ విభాగంతో సంబంధం లేకుండా చిన్న, మధ్య తరహా కస్టమర్లకు ఎక్కువ సాఫ్ట్‌వేర్‌ సర్వీసులను అమ్మేందుకు థర్డ్ పార్టీ సంస్థలను వాడుకునేలా కంపెనీ ఏప్రిల్‌లో ప్రణాళికలు ప్రకటించింది. దాంతో ఈ విభాగంలో కోతలకు పూనుకుంటున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. కృత్రిమ మేధ పెట్టుబడుల నిర్వహణ టెక్ కంపెనీలకు సవాలుగా మరుతుంది. దాంతో ఇలా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డేటా సెంటర్ వ్యయం కోసం మైక్రోసాఫ్ట్‌ సుమారు 80 బిలియన్ డాలర్లు కేటాయించింది.

Advertisement
 
Advertisement
Advertisement