కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపు | Tata Consumer Products Laid Out Bold Roadmap At AGM, Check More Details Inside | Sakshi
Sakshi News home page

కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపు

Jun 20 2025 10:27 AM | Updated on Jun 20 2025 11:17 AM

Tata Consumer Products laid out bold roadmap at AGM

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ ఇతర కంపెనీలను కొనుగోలు చేసే అవకాశాలను అన్వేషిస్తోంది. ఓవైపు సొంతంగా కార్యకలాపాలు విస్తరిస్తూనే టాటా గ్రూప్‌ కంపెనీ కొంతకాలంగా పలు సంస్థలను సొంతం చేసుకుంటోంది. ఏడాది క్రితం క్యాపిటల్‌ ఫుడ్స్‌తోపాటు, ఆర్గానిక్‌ ఇండియాను రూ.7,000 కోట్ల సంయుక్త విలువలో కొనుగోలు చేసింది. మార్కెట్లో కంపెనీ ఎల్లవేళలా ఇతర సంస్థల కొనుగోలుకి సిద్ధంగా ఉంటుందని టాటా కన్జూమర్‌ డైరెక్టర్‌ పీబీ బాలాజీ పేర్కొన్నారు.

కంపెనీ పోర్ట్‌ ఫోలియోకు సరిపోయే సంస్థ తగిన ధరలో దొరికితే వదిలిపెట్టబోమని బాలాజీ తెలియజేశారు. అయితే సొంతంగా కార్యకలాపాలు విస్తరించడానికే తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఐదేళ్ల క్రితం ఆవిర్భవించిన కంపెనీ ప్రధానంగా ఫుడ్‌ విభాగంలో కొనుగోళ్లకు తెరతీసింది. ఈ బాటలో బెంగళూరు సంస్థ కొట్టారం ఆగ్రో ఫుడ్స్‌ను సైతం చేజిక్కించుకుంది. 

ఇదీ చదవండి: మూడేళ్లలో లక్ష ఎంఎస్‌ఎంఈలు

అత్యంత గరిష్టాలకు చేరిన టీ ధరలు ఇటీవల నిలకడను సంతరించుకుంటున్నట్లు వాటాదారుల వార్షిక సమావేశంలో బాలాజీ పేర్కొన్నారు. వెరసి ఇకపై కంపెనీ మార్జిన్లు, లాభదాయకత మెరుగుపడనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది తేయాకు దిగుబడి గతేడాదిని మించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కాఫీ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ ఈ ఏడాది సాధారణ స్థితికి చేరవచ్చని అంచనా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement