
ఎగుమతులు పెంచుకునేందుకు కొత్త వ్యూహం
చర్యలపై కేంద్ర సర్కారు దృష్టి
న్యూఢిల్లీ: భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లను గణనీయంగా పెంచేయడంతో ప్రత్యామ్నాయాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులను పెంచుకునే వ్యూహరచనకు తెరతీసింది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా తదితర ప్రాంతంలో 50 దేశాలకు ఎగుమతులను ఇతోధికం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
భారత మొత్తం ఎగుమతుల్లో 90 శాతం ఈ 50 దేశాలకే వెళుతుండడం గమనార్హం. ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం, దిగుమతులకు ప్రత్యామ్నాయాలు, ఎగుమతుల పోటీతత్వం పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ దిశగా లోతైన విశ్లేషణ కొనసాగుతోందని చెప్పాయి. వాణిజ్య శాఖ ఇప్పటికే 20 దేశాలపై ప్రత్యేక దృష్టి సారించగా, ఇప్పుడు మరో 30 దేశాలు ఈ జాబితాలోకి వచ్చి చేరినట్టు పేర్కొన్నాయి.
కొత్త మార్కెట్లను అన్వేషించండి..
అధిక యూఎస్ టారిఫ్‌లను ధైర్యంగా ఎదుర్కోవాలని.. రొయ్యలు, ఇతర చేపల ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని ఎగుమతిదారులకు కేంద్రం సూచించింది. ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, యూకే, రష్యా, ఆ్రస్టేలియా, పశి్చమాసియా, దక్షిణాసియా తదితర ఎన్నో ప్రాంతాలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. ఇతర దేశాలను ఎగుమతులను పెంచుకునే ముందు విలువను పెంచుకోవడం, ప్యాకేజింగ్‌పై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఇందుకు ఫిషరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
55 శాతం ఎగుమతులపై ప్రభావం
అమెరికాకు ఎగుమతి చేస్తున్న మొత్తం వస్తు ఎగుమతుల్లో 55 శాతం మేర 25 శాతం ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. రైతులు, వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు, ఎంఎస్‌ఎంఈల ప్రయోజనాల పరిరక్షణకు, ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఉత్పత్తుల వైవిధ్యం, డిమాండ్, నాణ్యత, కాంట్రాక్టు ఒప్పందాలు భారత ఎగుమతులపై పడే ప్రభావాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు.