
దేశంలో అగ్ర ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరిన ఫ్రెషర్లతో కూడా బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ తన బెంచ్ పాలసీని సవరించిన కొన్ని వారాల తరువాత ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఓవైపు లేఆఫ్ ఆందోళనలున్నా జీతాల పెంపు ప్రకటించి ఉద్యోగులకు కాస్త ఊరట కల్పించింది టీసీఎస్. అయితే ఈ ప్రకటనకు ఒక రోజు ముందు, ఒక రెడ్డిట్ యూజర్ తాను బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందంటూ పేర్కొన్నారు. 'టీసీఎస్ ఫైరింగ్ ఫ్రెషర్స్?' అనే శీర్షికతో ఓ పోస్టు పెట్టారు. అహ్మదాబాద్, పుణెకు చెందిన పలువురు ట్రైనీలను కేవలం నాలుగైదు వారాల పాటు బెంచ్‌పై ఉంచి ఆ తర్వాత ఉద్వాసన పలికారని పేర్కొన్నారు.
బెంచ్ పాలసీలో మార్పు, క్రియాశీల క్లయింట్ ప్రాజెక్ట్ లేకుండా అనుమతించదగిన వ్యవధిని 35 రోజులకు తగ్గించడం వంటివాటితో ఒత్తిడి తెచ్చి చప్పుడు లేకుండా ఉద్యోగులను టీసీఎస్ వదిలించుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగాలు తగ్గించుకునేందుకు ఫ్రెషర్లను కూడా వదిలిపెట్టడం లేదన్నారు.
బలవంతంగా రాజీనామా చేయించారు
'నేను కొన్ని రోజుల క్రితం బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది' అని పేర్కొన్న రెడ్డిట్ యూజర్ ఫ్రెషర్స్ కూడా జాబ్ కట్ రాడార్ లో ఉన్నారని ఆరోపించారు. హెచ్‌ఆర్ తనను ఒక సమావేశానికి పిలిచి, తనతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయించి ఆపై తనకు రెండు ఆప్షన్లు ఇచ్చాడని పేర్కొన్నాడు. అవి వెంటనే రాజీనామా చేయడం లేదా తొలగింపును ఎదుర్కోవడం.
రాజీనామా చేయకపోతే ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నెగటివ్ రిలీజ్ లెటర్ జారీ చేస్తామని బెదిరించారని రాసుకొచ్చారు. అదే చెప్పినట్లు రాజీనామా చేస్తే మూడు నెలల వేతనం ఇచ్చి ఎటువంటి నెగటివ్ లేకుండా మంచిగా రిలీజ్ లెటర్ ఇస్తామన్నారని వివరించాడు. తన లాగే మరో నలుగురు ఫ్రెషర్లను కూడా ఏడిపించి బలవంతంగా రాజీనామా చేయించారని రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
తనను క్రియాశీల ప్రాజెక్టుకు కేటాయించినప్పటికీ బలవంతంగా రాజీనామా చేయించి ఆ ఆకస్మిక రాజీనామాకు వ్యక్తిగత కారణాలను పేర్కొనాలని హెచ్ఆర్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజీనామా, తొలగింపు రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని, తన కుటుంబంతో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని ఫ్రెషర్ ఆరోపించారు.