హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డౌన్‌ | Hyderabad real estate sees housing sales dip as property prices rise | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డౌన్‌

Jun 27 2025 6:35 AM | Updated on Jun 27 2025 8:23 AM

Hyderabad real estate sees housing sales dip as property prices rise

జూన్‌ త్రైమాసికంలో 11,040 యూనిట్ల విక్రయం 

క్రితం ఏడాదితో పోల్చితే 27 శాతం తక్కువ 

11 శాతం పెరిగిన ధరలు 

అనరాక్‌ నివేదిక విడుదల 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్ల ధరలు పెరిగిపోవడంతో అమ్మకాలు చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌ (క్యూ1) మధ్య కాలంలో హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 27 శాతం క్షీణించి 11,040 యూనిట్లకు పరిమితమయ్యాయి. 

ఇదే కాలంలో ధరలు సగటున 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా టాప్‌–7 నగరాల్లో జూన్‌ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి. ఈ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూన్‌ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 20 శాతం తక్కువగా 96,285 యూనిట్లుగా ఉండొచ్చన్నది అంచనా. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ ఏడు నగరాల్లో 1,20,335 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), బెంగళూరు, పుణె, కోల్‌కతా పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు పడిపోగా, ఒక్క చెన్నైలో మాత్రం పెరిగాయి.  

నగరాల వారీ డేటా.. 
→ జూన్‌ త్రైమాసికంలో అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇళ్ల ధరలు 27 శాతం పెరిగాయి. ఇక్కడ ఇళ్ల విక్రయాలు 14 శాతం క్షీణించి 14,255 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 16,650 యూనిట్లుగా ఉండడం గమనార్హం.  
→ ఎంఎంఆర్‌లో ఇళ్ల అమ్మకాలు 25 శాతం పడిపోయి 31,275 యూనిట్లుగా ఉన్నాయి.  
→ బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 15,410 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలం విక్రయాలతో పోల్చితే 8 శాతం తక్కువ. ఇక్కడ ధరలు సగటున 12 శాతం పెరిగాయి.  
→ పుణెలో అమ్మకాలు 27 శాతం తగ్గి రూ.15,410 యూనిట్లుగా ఉన్నాయి.  
→ కోల్‌కతా నగరంలో 23 శాతం తక్కువగా 3,525 యూనిట్లు అమ్ముడయ్యాయి. 
→ చెన్నైలో 11 శాతం పెరిగి 5,660 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 5,100 యూనిట్లుగా ఉన్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement