అపార్ట్‌మెంట్ల ధరలు పెరిగే అవకాశం! | apartment-prices-may-increase | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్ల ధరలు పెరిగే అవకాశం!

Apr 25 2026 6:05 PM | Updated on Apr 25 2026 6:38 PM

apartment-prices-may-increase

పశ్చిమ ఆసియా యుద్ధంతో నిర్మాణ రంగం కుదేలు

సామగ్రి తయారీ సంస్థలపై పెట్రో ఉత్పత్తుల కొరత ప్రభావం

పెరిగిన సిమెంట్, స్టీల్, శానిటరీ, రంగులు తదితర ధరలు

ఏకంగా 40 శాతంపైనే పెరిగిన అల్యూమినియం, పీవీసీ రేట్లు

అపార్ట్‌మెంట్లలో ధరలు చ.అ.కు రూ.250–రూ.300 వరకు పెరిగే అవకాశం

పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో  (Impact of West Asia War) నిర్మాణ రంగం కష్టాల్లో కూరుకుపోయింది. అసలే మార్కెట్‌ లేక అయోమయంలో ఉన్న బిల్డర్లకు యుద్ధం రూపంలో మరో బాంబ్‌ పేలింది. దాంతో సామాన్య మధ్యతరగతి ప్రజల సొంతింటి కల చెదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిర్మాణ రంగంలో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడంతో రానున్న రోజుల్లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌ వంటి ముడి చమురు, సహజ వాయువు కొరత, సరుకు రవాణాకు అంతరాయం, తగ్గిన ముడి పదార్థాల దిగుమతులు నిర్మాణ రంగాన్ని షేక్‌ చేస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో

ఇంధన వనరులపై ఆధారపడిన నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో సిమెంట్, స్టీల్, (Cement and Steel rates) అల్యూమినియం, శానిటరీ, రంగులు, ప్లంబింగ్‌ పైపులు, యూపీవీసీ వంటి గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో ఆయా ఉత్పత్తుల ధరలు 20–50 శాతం మేర పెరిగిపోయాయి. దీంతో నిర్మాణ వ్యయం అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయి గృహ నిర్మాణదారులు, డెవలపర్లు హడలెత్తిపోతుండగా, వారు ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ఉత్పత్తుల తయారీలో చమురు కీలకం..

నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్‌ తయారీ దేశీయంగానే ముడి పదార్థాలపై ఆధారపడి ఉండటంతో ఆయా ఉత్పత్తులపై పెద్దగా ప్రభావం లేదు. కానీ రవాణా అంతరాయం కారణంగా వీటి ధరలు 10–15 శాతం వరకు పెరిగాయి. కాగా టైల్స్, శానిటరీ, అల్యూమినియం, రంగులు, యూపీవీసీ, పీవీసీ పైపులు, ఎలక్ట్రిక్‌ వైర్లు వంటి ఉత్పత్తుల తయారీలో గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ అత్యంత కీలకం∙ప్రస్తుతం గల్ఫ్‌ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో ఆయా ఉత్పత్తుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది.

దీంతో పీవీసీ కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు, గ్లాస్‌లు, శానిటరీ వేర్‌ వంటి వాటి ధరలు 40 శాతం పైనే పెరిగాయి. మొత్తం మీద నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయం, కొరత కారణంగా భవన నిర్మాణ వ్యయం 15–20 శాతం మేర పెరిగింది. ఈ భారాన్ని డెవలపర్లు చివరిగా గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయడం తప్పనిసరి. ఫలితంగా అపార్ట్‌మెంట్ల ధరలు  (Apartment Prices) చదరపు అడుగు (చ.అ.)కు రూ.250–300 వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఎన్నికల ప్రభావం

నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయంతో పాటు నిర్మాణ రంగంపై ఎన్నికల ప్రభావం కూడా పడింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో నిర్మాణ కార్యకలాపాలు నెమ్మదించాయి. నిర్మాణ వ్యయం, వినియోగ ఖర్చులు, వడ్డీల భారం డెవలపర్లపై పడుతోంది. దీంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెవలపర్లకు అధిక పెట్టుబడులు అవసరం అవుతాయి. దీంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరో ఆరు నెలల పాటు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలు కుదేలవడంతో పాటు వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?

Advertisement
 
Advertisement
Advertisement