
హైదరాబాద్‌లో 11 శాతం డౌన్!
ఏడు నగరాల్లో 9 శాతం తగ్గొచ్చు
అమ్మకాల విలువ పెరగొచ్చు
రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 9 శాతం మేర తక్కువగా ఉంటాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ అంచనా వేసింది. 97,080 యూనిట్ల విక్రయాలు నమోదు కావొచ్చంటూ క్యూ2పై ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ఆధారంగా ఒక నివేదికను విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,07,060 యూనిట్లుగా ఉన్నాయి.
కానీ, విలువ పరంగా 1.52 లక్షల కోట్ల విక్రయాలు ఉంటాయని, క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాల విలువ రూ.1.33 లక్షల కోట్లతో పోల్చి చూస్తే ఇది 14 శాతం అధికమని పేర్కొంది. ప్రీమియం, లగ్జరీ ఇళ్ల విభాగంలో లావాదేవీలు పెరగడం మొత్తం మీద సెప్టెంబర్ త్రైమాసికంలో విక్రయాల విలువ వృద్ధికి కారణమని అనరాక్ నివేదిక తెలిపింది. సరఫరా కంటే విక్రయాలే అధికంగా ఉన్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలి పారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో పరిస్థితి సానుకూలంగా ఉన్నట్టుగా ఇది తెలియజేస్తోందన్నారు.
హైదరాబాద్‌లో 11,305 యూనిట్లు
→ హైదరాబాద్ మార్కెట్లో సెపె్టంబర్ త్రైమాసికంలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 11 శాతం తగ్గి 11,305 యూనిట్లుగా ఉంటాయన్నది అనరాక్ అంచనా. క్రితం ఏడాది ఇదే కాలంలో 12,735 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
→ బెంగళూరులో ఒక శాతం తక్కువగా 14,835 యూనిట్ల విక్రయాలు జరగొచ్చు.
→ ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో 13,920 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 11 శాతం తక్కువ.
→ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 16 శాతం తగ్గి 30,260 యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో 36,915 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
→ పుణెలో 16 శాతం క్షీణతతో 16,620 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. కోల్‌కతాలో 4,130 యూనిట్ల విక్రయాలు జరగొచ్చన్నది అనరాక్ వేసిన అంచనా. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇక్కడ 3,980 యూనిట్ల అమ్మకాలతో పోల్చి చూస్తే 4 శాతం అధికం.
→ చెన్నైలోనూ 33 శాతం అధికంగా 6,010 యూనిట్ల అమ్మకాలు ఉంటాయని అనరాక్ నివేదిక పేర్కొంది.