హైదరాబాద్‌..ఖరీదైన జీసీసీ మార్కెట్‌!! | Hyderabad Emerges as India Priciest GCC Hub with Higher Rents | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌..ఖరీదైన జీసీసీ మార్కెట్‌!!

Jun 29 2026 7:57 AM | Updated on Jun 29 2026 7:57 AM

Hyderabad Emerges as India Priciest GCC Hub with Higher Rents

దేశీయంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) సంబంధించి అద్దెల విషయంలో హైదరాబాద్‌ అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్‌గా నిలుస్తోంది. ఐఐఎం బెంగళూరు, సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ విడుదల చేసిన 2026 తొలి త్రైమాసిక నివేదిక ప్రకారం జీసీసీ–సీపీఆర్‌ఈ సూచీలో 212.1 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఇతర సంస్థలతో పోలిస్తే జీసీసీ కంపెనీలు 15 శాతం అధికంగా అద్దెలు చెల్లిస్తున్నాయి. ఈ విషయంలో పుణె, బెంగళూరు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిల్చాయి. 210.7 స్కోరు దక్కించుకున్న పుణెలో జీసీసీ కంపెనీలు, ఇతర సంస్థలతో పోలిస్తే సుమారు 21 శాతం అధికంగా చెల్లిస్తున్నాయి. ఇక దేశంలోనే అతి పెద్ద జీసీసీ ఆఫీస్‌ మార్కెట్‌గా తన స్థానాన్ని నిలుపుకొన్న బెంగళూరు స్కోరు 190గా ఉంది. జాతీయ స్కోరు 165 వద్ద స్థిరంగా కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది.  

భారీ డీల్స్, సుదీర్ఘ కాలానికి లీజులు..

భారతీయ కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో జీసీసీల అద్దె పోకడలను అంచనా వేయడానికి ఇది ఉపయోగకరంగా ఉండగలదని సీఆర్‌ఈ మ్యాట్రిక్స్, ఇండెక్స్‌ట్యాప్‌ సీఈవో అభిషేక్‌ కిరణ్‌ గుప్తా తెలిపారు. గత కొన్నేళ్లుగా మిగతా కిరాయిదార్లతో పోలిస్తే జీసీసీల ధోరణి కాస్త భిన్నంగా ఉంటోందని వివరించారు. భారీ డీల్స్, సుదీర్ఘ కాలానికి లీజులతో మొత్తం మ్యాక్రో మార్కెట్లను శాసించేలా వాటి నిర్ణయాలు ఉంటున్నాయని తెలిపారు. రవాణా సౌకర్యాలుల బాగుండి, గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ క్లస్టర్లు ఉన్న ప్రాంతాలకి ప్రాధాన్యత పెరుగుతోందని పేర్కొన్నారు.

పశ్చిమ భారతదేశంలోని మైక్రోమార్కెట్లలో కూడా అద్దెలు గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదిక వివరించింది. నవీ ముంబైలో రెంటల్‌ వృద్ధి వార్షిక ప్రాతిపదికన గత మూడేళ్లలో 13.4 శాతంగా నమోదైంది. మెరుగైన రవాణా, గ్రేడ్‌–ఏ కార్యాలయాలు ఉన్న ముంబై సెంట్రల్‌ శివార్లలో, చెన్నై నగర ఉత్తర ప్రాంత శివార్లలో ఇది ఏకంగా 22 శాతంగా రికార్డయింది. దేశవ్యాప్తంగా 100 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్, 19,000 లీజు లావాదేవీల విశ్లేషణ ఆధారంగా ఈ సూచీని రూపొందించారు.

ఇదీ చదవండి: లాకర్‌.. సేఫేనా?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement