పసిడి, వెండిలో కరెక్షన్లు సహజమే
అనిశ్చితిలో పెరగటం... తరువాత తగ్గటం మామూలే
ఈక్విటీలు ఆకర్షణీయంగా మారాయి కనుకే మెటల్స్‌లో కరెక్షన్
స్వల్పకాలంలో కాస్త పడినా... దీర్ఘకాలంలో ముందుకే
చారిత్రక సంఘటనలు చెబుతున్నది ఇదే
ఆందోళనతో విక్రయించేసి బయటపడక్కర్లేదు
ఒక్కసారిగా పెట్టుబడి పెట్టడం కన్నా ఈటీఎఫ్‌ల్లో సిప్ బెటర్
పోర్టుఫోలియోలో 10–15% వరకు కేటాయింపులు చేయొచ్చు
సాక్షి, వెల్త్: ఈక్విటీలు, బంగారం, వెండి.. ఏ అసెట్ ర్యాలీ చేస్తున్నా ఇన్వెస్టర్లకు సందడే. స్టాక్స్ ర్యాలీలో బుల్స్ వెంట పరుగులు తీస్తారు. అనిశ్చితులు, సంక్షోభాలతో ఈక్విటీలు బేల చూపులు చూస్తుంటే.. బంగారం, వెండిని ఎత్తుకుంటారు. ఏ ర్యాలీ అయినా రివర్స్ గేర్ తీసుకుంటే మాత్రం కంగారు పడిపోతుంటారు. 2020లో కరోనా విపత్తు, 2022లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, 2025లో ట్రంప్ రెండో విడత అమెరికా అధ్యక్ష బాధ్యతల అనంతరం ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాల యుద్ధాన్ని ప్రకటించడం, 2026లో ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం.. ఈ అనిశ్చితి, అయోమయ పరిస్థితులతో రెండేళ్లుగా పసిడి, వెండి జిగేల్‌మన్నాయి.
ఏ దశలో పెట్టుబడి పెట్టినా ఇన్వెస్టర్లకు కాసులు కురిపించాయి. కానీ, ఈ ఏడాది జనవరి నుంచి బంగారం 25 శాతం, వెండి 45 శాతం వరకు పతనమయ్యాయి. ఎందుకని? ఎందుకంటే యుద్ధాలు, సంక్షోభాలు, ధరల మంటలు, ఆర్థిక మాంద్యాలు వంటి సందర్భాల్లో పెట్టుబడుల విలువను కాపాడుకునేందుకు (హెడ్జింగ్ కోసం) ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి కొంత పెట్టుబడులను పసిడి, వెండిలోకి మళ్లిస్తారు.
సంక్షోభం కుదుటపడుతోందని సంకేతాలొచ్చినా... లేదా అప్పటికే భారీగా పెరిగి ఉన్నా కొంత విక్రయించి లాభాలు స్వీకరిద్దామన్న ధోరణి నెలకొన్నా.. పసిడి, వెండి రివర్స్ గేర్ తీసుకుంటాయి. 2026 జనవరిలో జీవితకాల గరిష్ట స్థాయికి చేరాక పసిడి, వెండిలో కనిపించిన దిద్దుబాటు ఒక రకంగా ఇలాంటిదే. ఒక్క ఈ నెలలోనే 12 శాతం మేర వీటి ధరలు పతనమయ్యాయి. మరి ఈ కరెక్షన్ బుల్ మార్కెట్ ముగింపు కార్డా? ఇన్వెస్టర్ల ముందున్న మార్గం ఏంటి? ఏం చేయాలిపుడు?
ఎందుకు ఈ పతనం?
⇒ ఏ ప్రయాణం మధ్యలో అయినా ఎక్కడో ఒక చోట బ్రేక్ తీసుకుంటాం. పసిడి, వెండిలోనూ ఇప్పుడదే చూస్తున్నాం.
⇒ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలతో అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితులు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆటుపోట్లు గత రెండేళ్ల కాలంలో ఇన్వెస్టర్లను గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లకు చేరువ చేశాయి. ఇప్పుడు అనిశ్చితి పరిస్థితులు కొంత తెరిపిన పడుతున్నాయి.
⇒ ఇంతకాలం దేశీ ఈక్విటీలు బలహీనంగా కదలాడాయి. ఆకర్షణీయ వేల్యుయేషన్ల వద్ద ఉండడంతో సమీప కాలంలో ఈక్విటీలు ర్యాలీ చేయొచ్చన్న విశ్వాసం పెరుగుతోంది.
⇒ బంగారాన్ని కేవలం విలువను కాపాడే వస్తువుగానే చూస్తుంటారు. అంతేకానీ దీనిపై పెట్టుబడి పెడితే స్థిరమైన ఆదాయమేదీ రాదు. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణంతో గరిష్టాల్లో వడ్డీ రేట్లు ఉండడం, మన దగ్గరా సమీప కాలంలో వడ్డీ రేట్లు పెరిగే పరిస్థితులతో వడ్డీ రాబడినిచ్చే బాండ్లు, డిపాజిట్లు ఇప్పుడు ఆకర్షణీయంగా మారుతున్నాయి. కనుక ఎలాంటి రాబడి లేని పసిడి, వెండి నుంచి పెట్టుబడులు బాండ్లు, ఈక్విటీల వైపు యూటర్న్ తీసుకుంటాయి.
⇒ అంతర్జాతీయంగా పసిడి ధరలు డాలర్లోనే ట్రేడవుతుంటాయి. డాలర్ బలపడడం బంగారం, వెండి ధరలపై ఒత్తిడికి దారితీస్తోంది.
⇒ బంగారం, వెండి గత 18– 24 నెలల్లో అసాధారణ రాబడులనిచ్చాయి. ఏదో ఒక దశలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం సహజమే. ఒక విధంగా ఇది పోర్ట్‌ఫోలియోకి మంచిది కూడా. అప్పుడే తాజా పెట్టుబడిదారులకు ధరలు అందుబాటులోకి వస్తాయి.
ఏంటి మార్గం..?
⇒ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పె ట్టిన వారు ప్రస్తుత దిద్దుబాటును చూసి ఎ లాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
⇒ బంగారం, వెండిలో 10–12 శాతం దిద్దుబాటు అసాధారణమేమీ కాదు. చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో ర్యాలీ తర్వాత బంగారం, వెండి ర్యాలీ దిద్దుబాటుకు చవిచూశాయి.
⇒ ధరలను చూసి నిర్ణయం తీసుకోవద్దు. అస లు మీ పెట్టుబడి లక్ష్యం ఏంటో తెలుసుకుని, అందుకు అనుగుణంగా వ్యవహరించండి.
⇒ కేవలం ధరలు పెరుగుతున్నాయి కదా అని, ఇన్వెస్ట్ చేసి కొన్ని రోజుల్లో విక్రయించడం ద్వారా లాభాలు సంపాదించొచ్చని అ డుగు పెట్టినట్టయితే.. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్వల్పకాలంలో ధరల తీరును ఎవరూ అంచనా వేయలేరు.
⇒ ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారు ఒకే విడత కాకుండా, క్రమానుగతంగా, నెలవారీ కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే మంచిది. గోల్డ్ ఈటీఎఫ్‌లు, లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
⇒ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి ప్రస్తుత దిద్దుబాటు అనుకూలం.
వెండికి అదనపు అనుకూలత
⇒ ఆభరణాలతోపాటు పెట్టుబడికి హెడ్జింగ్ సాధనంగా పసిడికి గుర్తింపు ఎక్కువ. వెండికి పెట్టుబడితోపాటు పరిశ్రమల నుంచి ముడి పదార్థంగానూ బలమైన డిమాండ్ నెలకొంది.
⇒ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్‌వాహనాలు, సోలార్ ప్యానెళ్లు ఇలా ఎన్నో అత్యాధునిక పరిశ్రమల్లో వెండి అవసరం.
⇒ బంగారంతోపాటు వెండికి సైతం పెట్టుబడుల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కానీ పసిడితో పోలి్చతే వెండిలో అస్థిరతలు ఎక్కువన్నది గుర్తు పెట్టుకోవాలి.
కథ ముగిసినట్టేనా?
బంగారం కథ ఇంతటితో సమాప్తం అని అనుకోవడానికి లేదు.
⇒ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు తమ రిజర్వ్ అసెట్స్‌లో బంగారానికీ పెద్ద పీట వేస్తున్నాయి. గతంలో యూఎస్ డాలర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు డాలర్ వెయిటేజీ తగ్గించి, గోల్డ్‌కు వెయిటేజీని పెంచడం ద్వారా వైవిధ్యంపై దృష్టి పెట్టాయి.
⇒ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల అప్పుల భారం గరిష్ట స్థాయిల్లోనే ఉంది.
⇒ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఇక ముందు పెరగవని, మళ్లీ ఏర్పడవని కూడా చెప్పలేం.
⇒ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
⇒ కనుక స్వల్పకాలంలో పసిడి, వెండి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా.. దీర్ఘకాలానికి పెట్టుబడుల పరంగా వాటి ప్రాధాన్యంలో ఎలాంటి మార్పు రాలేదు.
ఎంత కేటాయించొచ్చు?
⇒ రిటైల్ ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పెట్టుబడుల కేటాయింపుల్లో పసిడికి 10–15 శాతం కేటాయించుకోవచ్చు. పెట్టుబడి పరంగా వెండి కంటే పసిడిలో స్థిరత్వం ఎక్కువ. చారిత్రకంగా చూస్తే బంగారం కంటే ఈక్విటీలే అధిక రాబడినిచ్చాయి.
రూ.10 లక్షల మోడల్ పోర్ట్‌ఫోలియో వేటికి ఎంత చోటు
అసెట్ క్లాస్ కేటాయింపులు (రూ.లలో)
ఈక్విటీలు - 6,00,000
డెట్‌ఫండ్స్/ఎఫ్‌డీలు/ బాండ్లు తదితర స్థిరదాయ సాధనాలు - 2,00,000
బంగారం - 1,00,000
వెండి - 50,000
నగదు/లిక్విడ్ ఫండ్స్ - 50,000
ఒక్కటి గుర్తు పెట్టుకోండి
ప్రస్తుత దిద్దుబాటు విలువైన లోహాల ర్యాలీ లో కేవలం విరామమే. ర్యాలీ వెంట పరుగెత్తడం, పతనంలో ఆందోళన చెందడానికి దూరంగా ఉండాలి. బంగారం ఇన్వెస్టర్లను రాత్రికి రాత్రి ఐశ్వర్యవంతులను చేసేయదు. ఇతర పెట్టుబడి సాధనాల్లో అల్లకల్లలాలు నెలకొన్నప్పుడు పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్నిచ్చి, కొనుగోలు శక్తిని కాపాడే సాధనం. తాత్కాలిక దిద్దుబాట్లను సహనంతో ఎదుర్కొన్న వారికే విలువైన లోహాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయని చరిత్ర చెబుతోంది.
పడుట పెరుగుట కొరకే
⇒ బంగారం, వెండిలో దిద్దుబాట్లు ఎన్నో సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. ప్రతీ దిద్దుబాటు అనంతరం తిరిగి పుంజుకున్నాయి.
⇒ అందుకే ఈక్విటీలు, పసిడిని దీర్ఘకాల పెట్టుబడి ఆస్తులుగానే చూడాలి.
⇒ స్వల్పకాల అవసరాల కోసం ఉద్దేశించిన వాటిని స్థిరాదాయ పథకాలకే కేటాయించుకోవాలి.
⇒ పోర్ట్‌ఫోలియోకి బీమాగా బంగారం, వెండినిచూడొచ్చు.

ఇవీ... వాస్తవాలు
బంగారం వెండి
10–20శాతం 20–30శాతం
కరెక్షన్లు సాధారణం కరెక్షన్లు సాధారణం
25–35శాతం 40–60శాతం
కరెక్షన్లు అరుదు కరెక్షన్లు అరుదు


