టారిఫ్‌ల పెంపు అమెరికా సెల్ఫ్‌గోల్‌  | Former RBI governor Raghuram Rajan calls Trump tariffs a self goal | Sakshi
Sakshi News home page

టారిఫ్‌ల పెంపు అమెరికా సెల్ఫ్‌గోల్‌ 

Apr 4 2025 6:11 AM | Updated on Apr 4 2025 7:43 AM

Former RBI governor Raghuram Rajan calls Trump tariffs a self goal

భారత్‌పై స్వల్ప ప్రభావమే 

రఘురామ్‌ రాజన్‌ 

న్యూఢిల్లీ: అమెరికా 60 దేశాలపై ప్రతీకార సుంకాలు మోపడం అన్నది తనకు తాను నష్టం చేసుకోవడమేనని (సెల్ఫ్‌ గోల్‌) ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. వీటి కారణంగా భారత్‌పై స్వల్ప ప్రభావమే ఉంటుందన్నారు. ‘‘స్వల్పకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు చెప్పినట్టు ఇదొక సెల్ఫ్‌ గోల్‌ (తన చర్యతో ప్రత్యర్థి టీమ్‌కు పాయింట్‌ వచ్చేలా చేసేవాడు).

 భారత ఎగుమతులపై అమెరికా ప్రత్యక్ష టారిఫ్‌లు ప్రభావం చూపిస్తే అది యూఎస్‌లో ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దాంతో డిమాండ్‌ తగ్గుతుంది. అప్పుడు భారత వృద్ధిపైనా ప్రభావం పడుతుంది. అయితే ఇతర దేశాలపైనా అమెరికా టారిఫ్‌లు మోపింది. కనుక ఆయా దేశాల ఉత్పత్తిదారులతో భారత్‌ పోటీపడుతుంది. కేవలం భారత్‌కు మాత్రమే విధించే టారిఫ్‌లతో పోల్చి చూస్తే ప్రస్తుత నిర్ణయం కారణంగా పడే ప్రభావం తక్కువే’’అని రఘురామ్‌ రాజన్‌ వివరించారు. 

యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో రాజన్‌ ప్రస్తుతం ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికా ఉత్పత్తిని పెంచాలన్నది ట్రంప్‌ దీర్ఘకాల ఉద్దేశ్యమని, దీని ఫలితం ఏదైనా దీర్ఘకాలంలోనే కనిపిస్తుందన్నారు. దేశీ వినియోగంతో పోల్చితే ఎగుమతులు తక్కువగానే ఉన్నందున.. అమెరికా ప్రతి సుంకాలు భారత్‌లో ప్రతిద్రవ్యోల్బణాన్ని కలిగించొచ్చన్నారు. 

అమెరికా మార్కెట్‌కు దారులు మూసుకుపోవడంతో భారత మార్కెట్‌కు ఎగుమతులకు చైనా ప్రయతి్నంచొచ్చని రాజన్‌ అంచనా వేశారు. ప్రపంచం మరింత రక్షణాత్మకంగా మారుతుండడంతో వాణిజ్యం విషయంలో తెలివిగా వ్యవహరించాలని సూచించారు. చైనాతో మరింత తటస్థ సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. సార్క్, పొరుగు దేశాలతోనూ బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement