breaking news
impact India
-
మేకిన్ ఇండియాపై జాగ్రత్త
న్యూఢిల్లీ: ‘మేకిన్ ఇండియా’ నినాదమనేది ‘మేక్ ఆల్ దట్ ఇండియా నీడ్స్’ (భారత్‌కి కావల్సినవన్నీ ఇక్కడే తయారు చేసుకోవడం)గా మారకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. దీనివల్ల చైనాకు వెళ్లే పెట్టుబడులను మనవైపు ఆకర్షించే అవకాశం కోల్పోతామని, ఉత్పాదకతపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మేకిన్ ఇండియా విజయవంతం కావడమనేది, రక్షణాత్మక ధోరణి కన్నా ఎంత మెరుగ్గా పోటీపడగలమనే దానిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మిగతావారితో పని లేకుండా విడిగా ఉండిపోవడం కాకుండా స్వేచ్ఛా విధానాలను అమలు చేయడం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమని దువ్వూరి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పునరుద్ఘాటించినట్లుగా ఆత్మనిర్భర భారత్ నినాద లక్ష్యం రక్షణ, ఇంధనంలాంటి సున్నిత రంగాల్లో వ్యూహాత్మకంగా స్వయం సమృద్ధి సాధించడమే కావాలే తప్ప దాన్ని ప్రతి ఒక్క దానికి అన్వయించుకోకూడదని తెలిపారు. భారత్‌కి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచానికి కూడా అవసరమైన వాటిని ఉత్పత్తి చేసే ఎగుమతుల ఆధారిత తయారీ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దడమే మేకిన్ ఇండియా ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ‘‘అయితే, 50 శాతం టారిఫ్‌ల వల్ల కీలకమైన అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు, ఇప్పుడు ఆసియాలోనే అత్యధిక టారిఫ్‌లు ఎదుర్కొంటున్న మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి సందేహిస్తారు’’ అని దువ్వూరి తెలిపారు. ‘‘ఆసియాలో బంగ్లాదేశ్, వియత్నాం, ఇండొనేíÙయా కన్నా భారత్‌పై అత్యధిక టారిఫ్‌లు వర్తిస్తుండటమనేది ఆందోళనకర అంశం. కీలక తరుణంలో చైనా ప్లస్ వన్‌గా ఎదగాలన్న ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి దీని వల్ల విఘాతం కలుగుతుంది’’ అని చెప్పారు. అమెరికాకు సగం ఎగుమతులపై టారిఫ్‌ల ప్రభావం .. మన ఎగుమతుల్లో దాదాపు 20 శాతం వాటా ఉండే అమెరికా మార్కెట్లో 50 శాతం టారిఫ్‌లు విధిస్తే, కనీసం సగం ఎగుమతులపై ప్రభావం పడుతుందని దువ్వూరి తెలిపారు. ముఖ్యంగా టెక్స్టైల్స్, రత్నాభరణాలు, లెదర్‌లాంటి కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాలపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఫార్మా, ఎల్రక్టానిక్స్‌కు టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉండటం శాశ్వతమేమీ కాదని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు కొనసాగుతున్న సమీక్షల వల్ల భవిష్యత్తులో వాటిని కూడా టారిఫ్‌ల పరిధిలోకి చేర్చే అవకాశం ఉందన్నారు.500 బిలియన్ డాలర్ల వాణిజ్యం డౌటే.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్న భారత్–అమెరికా లక్ష్యం సాకారం కావడం మిథ్యేనని స్పష్టంగా తెలుస్తోందని దువ్వూరి చెప్పారు. మన ఎగుమతుల మీద పడే ప్రభావాలపై లెక్కలు వేసుకోవడానికి ముందు, అమెరికా మార్కెట్ కోల్పోవడం వల్ల వచ్చే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ప్రపంచ దేశాలను చైనా తమ ఉత్పత్తులతో ముంచెత్తే ముప్పు గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, దేశీయంగా డెయిరీ, వ్యవసాయం అనేవి రాజకీయంగా చాలా సున్నితమైన రంగాలని, కోట్ల కొద్దీ ప్రజలకు జీవనోపాధి కలి్పంచడంతో పాటు దేశ ఆహార భద్రతకు కూడా ముడిపడి ఉన్నవని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా దిగుమతులకు గంపగుత్తగా అనుమతించడం వాంఛనీయమూ, లాభదాయకమూ కూడా కాదని సుబ్బారావు చెప్పారు. అయితే, కొన్ని విషయాల్లో కాస్త పట్టు విడుపులతో వ్యవహరిస్తే చర్చల్లో ప్రతిష్టంభన తొలగేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. -
చిన్న సంస్థలకు.. పెద్ద కష్టం!!
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్‌లు విధించాలన్న అమెరికా నిర్ణయం.. చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) కలవరపరుస్తోంది. దీని ప్రభావం తమపై చాలా తీవ్రంగా ఉంటుందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. టారిఫ్‌ల పెంపు .. వార్షికంగా దాదాపు 30 బిలియన్ డాలర్ల మేర వ్యాపార నష్టానికి దారి తీస్తుందని స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఫోరం (ఎస్ఎంఈ ఫోరం) ప్రెసిడెంట్ వినోద్ కుమార్ వెల్లడించారు. దీనివల్ల అత్యధికంగా నష్టపోయేది చిన్న సంస్థలేనని ఆయన చెప్పారు. వాటి ఆర్థిక స్థోమత, సామర్థ్యాలు పరిమిత స్థాయిలోనే ఉండటమే ఇందుకు కారణమని వివరించారు. టారిఫ్ షాక్ అనేది ఎంఎస్ఎంఈ ట్రేడర్లను చాలా కఠినతరమైన పరిస్థితుల్లోకి నెట్టివేసిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్రటరీ జనరల్ అనిల్ భరద్వాజ్ చెప్పారు. ‘గతంలో విధించిన 25 శాతానికి మరో 25 శాతం టారిఫ్‌లు తోడు కావడం వల్ల భారతీయ ఎగుమతిదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇతర దేశాల పోటీ సంస్థలతో పోలిస్తే మన ఎగుమతిదారుల వ్యయాలు 30–35 శాతం పెరిగిపోతాయి‘ అని తెలిపారు. దీని వల్ల, ఆగస్టు 27లోగా (అదనపు టారిఫ్‌లు అమల్లోకి వచ్చే తేదీ) తగిన పరిష్కారం కనుగొనకపోతే, అమెరికాకు ఎగుమతులు 40–50 శాతం పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా దాదాపు 45 శాతంగా ఉంటుంది. పరిశ్రమకు మేల్కొలుపు.. టారిఫ్‌ల పెంపు అనేది ఇటు విధాన నిర్ణేతలు, అటు ఎగుమతిదారులకు ఓ మేల్కొలుపులాంటిదని కుమార్ చెప్పారు. దీన్ని ఒక అవాంతరంగా చూడకుండా అవకాశంగా మల్చుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. అంతగా ఎగుమతులు లేని, అధిక వృద్ధికి అవకాశాలున్న ప్రాంతాలకు కొత్తగా లింకేజీలను ఏర్పర్చుకోవడం, అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడం ద్వారా భారతీయ ఎంఎస్ఎంఈలు వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఫోకస్ చేయొచ్చని సూచించారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సెంట్రల్ ఏషియా, తూర్పు యూరప్, పసిఫిక్ ద్వీప దేశాలు, కరీబియన్ దీవులు మొదలైన మార్కెట్ల వైపు చూడొచ్చని చెప్పారు. ఈ మార్కెట్లకు 60 బిలియన్ డాలర్ల పైగా ఎగుమతులు చేసేందుకు అవకాశాలు ఉంటాయని కుమార్ చెప్పారు. భారతీయ ఎంఎస్ఎంఈలు ఇప్పటికే పటిష్టంగా ఉన్న రంగాల్లో నమ్మకమైన సరఫరాదారుల కోసం ఈ ప్రాంతాల్లోని సంస్థలు అన్వేíÙస్తున్నాయని తెలిపారు. ఫార్మా, వ్యవసాయ–వ్యవసాయేతర మెషినరీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, దుస్తులు మొదలైన రంగాలు వీటిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభావిత ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ద్రవ్యపరమైన, ద్రవ్యయేతరమైన చర్యలు ప్రకటించాలని కుమార్ విజ్ఞప్తి చేశారు. అలాగే పరిశ్రమ ఇతరత్రా మార్కెట్ల వైపు కూడా మళ్లేందుకు ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ దిశలో బ్రిటన్, ఆ్రస్టేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లతో వాణిజ్య ఒప్పందాల పరిధిని మరింతగా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. మనకు అనువైన మార్కెట్లను గుర్తించి, ఎగుమతి చేసే క్రమంలో కఠినతరమైన నాణ్యత, ప్యాకేజింగ్, నిబంధనల ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు గైడెన్స్ అవసరమవుతుందని కుమార్ పేర్కొన్నారు. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలను పటిష్టం చేసేందుకు ఇండియా ఎస్ఎంఈ ఫోరం, ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. డిజిటల్ ట్రేడ్ ప్లాట్‌ఫాంలను అందుబాటులోకి తేవడం, సకాలంలో..తక్కువ వడ్డీపై ఎగుమతులకు ఫైనాన్సింగ్ అందించడం, రియల్ టైమ్‌లో మార్కెట్ వివరాలను అందించడం వంటి అంశాలపై కసరత్తు చేస్తోంది. -
భారత వృద్ధి అంచనాలకు ఫిచ్ కోత
న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 6.4% వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను సవరిస్తూ.. 6.3 శాతానికి పరిమితం అవు తుందని తాజాగా వెల్లడించింది. అమెరికా టారిఫ్‌ల ప్రభావం భారత కంపెనీలపై చూపించే ప్రత్య క్ష ప్రభావం తక్కువేనని అభిప్రాయపడింది. ‘‘మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద ఎత్తు్తన ఖర్చు చేస్తుండడం సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ (తయారీలో వినియోగించేవి), విద్యుత్, పెట్రో లి యం ఉత్పత్తులు, స్టీల్, ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సానుకూలిస్తుంది’’అంటూ ‘ఇండియా కార్పొరేట్స్ క్రెడిట్ ట్రెండ్స్’ నివేదికలో ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తాను రేటింగ్ ఇచ్చే భా రత కంపెనీల రుణ కొలమానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడతాయని, బలమైన ఎ బిటా మార్జిన్లు, అధిక మూలధన వ్యయాలను అధి గమించేందుకు అనుకూలిస్తాయని వివరించింది. టారిఫ్‌ల ప్రభావం అధిగమించొచ్చు.. భారత కంపెనీలపై అమెరికా టారిఫ్‌ల కారణంగా పడే ప్రభావం తక్కువేనన్నది ఫిచ్ రేటింగ్ విశ్లేషణగా ఉంది. అమెరికా మార్కెట్లో వీటి ఎక్స్పోజర్ (వ్యాపారం) తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. కాకపోతే అధిక సరఫరా పరమైన రిస్క్‌లు ఎదురుకావొచ్చని పేర్కొంది. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై తుది ఫలితం ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. భారత కంపెనీలు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం ద్వారా (ఇతర మార్కెట్లకు పెంచుకోవడం) టారిఫ్‌ల ప్రభావాన్ని అధిగమించగలవని అంచనా వేసింది. భారత్‌పై 25 శాతం టారిఫ్‌లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఏకాభిప్రాయ సాధనకు సమయం తీసుకుంటోండడం గమనార్హం. దేశీ మార్కెట్‌పైనే ప్రధానంగా ఆధారపడే ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, టెలికం, యుటిలిటీలపై టారిఫ్‌ల కారణంగా ప్రత్యక్ష ప్రభావం పెద్దగా ఉండబోదని పేర్కొంది. టారిఫ్‌ల అనిశ్చితులు కారణంగా యూఎస్, యూరప్‌కు ఐటీ, ఆటో ఎగుమతులు 2025–26లో పరిమితంగా ఉండొచ్చంటూ.. అమెరికా విధానంలో మార్పు చోటుచేసుకుంటే ఫార్మా కంపెనీలపైనా ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. స్టీల్, కెమికల్స్ అధిక సరఫరాలు భారత మార్కెట్‌ను ముంచెత్తితే ఆయా రంగాల్లోని కంపెనీలు ధరలపరమైన ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, మెటల్స్, మైనింగ్ రంగాల్లో ధరల పరంగా అధిక అస్థిరతలు ఉండొచ్చని తెలిపింది. -
టారిఫ్‌ల పెంపు అమెరికా సెల్ఫ్‌గోల్
న్యూఢిల్లీ: అమెరికా 60 దేశాలపై ప్రతీకార సుంకాలు మోపడం అన్నది తనకు తాను నష్టం చేసుకోవడమేనని (సెల్ఫ్ గోల్) ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. వీటి కారణంగా భారత్‌పై స్వల్ప ప్రభావమే ఉంటుందన్నారు. ‘‘స్వల్పకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ఫుట్‌బాల్ ఆటగాళ్లు చెప్పినట్టు ఇదొక సెల్ఫ్ గోల్ (తన చర్యతో ప్రత్యర్థి టీమ్‌కు పాయింట్ వచ్చేలా చేసేవాడు). భారత ఎగుమతులపై అమెరికా ప్రత్యక్ష టారిఫ్‌లు ప్రభావం చూపిస్తే అది యూఎస్‌లో ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దాంతో డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు భారత వృద్ధిపైనా ప్రభావం పడుతుంది. అయితే ఇతర దేశాలపైనా అమెరికా టారిఫ్‌లు మోపింది. కనుక ఆయా దేశాల ఉత్పత్తిదారులతో భారత్ పోటీపడుతుంది. కేవలం భారత్‌కు మాత్రమే విధించే టారిఫ్‌లతో పోల్చి చూస్తే ప్రస్తుత నిర్ణయం కారణంగా పడే ప్రభావం తక్కువే’’అని రఘురామ్ రాజన్ వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రాజన్ ప్రస్తుతం ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికా ఉత్పత్తిని పెంచాలన్నది ట్రంప్ దీర్ఘకాల ఉద్దేశ్యమని, దీని ఫలితం ఏదైనా దీర్ఘకాలంలోనే కనిపిస్తుందన్నారు. దేశీ వినియోగంతో పోల్చితే ఎగుమతులు తక్కువగానే ఉన్నందున.. అమెరికా ప్రతి సుంకాలు భారత్‌లో ప్రతిద్రవ్యోల్బణాన్ని కలిగించొచ్చన్నారు. అమెరికా మార్కెట్‌కు దారులు మూసుకుపోవడంతో భారత మార్కెట్‌కు ఎగుమతులకు చైనా ప్రయతి్నంచొచ్చని రాజన్ అంచనా వేశారు. ప్రపంచం మరింత రక్షణాత్మకంగా మారుతుండడంతో వాణిజ్యం విషయంలో తెలివిగా వ్యవహరించాలని సూచించారు. చైనాతో మరింత తటస్థ సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. సార్క్, పొరుగు దేశాలతోనూ బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
భారత్‌కు అందే జలాలపై ప్రతికూల ప్రభావం ఉండదు
బీజింగ్: భారత్‌తో సరిహద్దుల్లోని టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలా శయాన్ని నిర్మించే ప్రతిపాదనపై వ్యక్తమవుతున్న భయాందోళనలపై చైనా స్పందించింది. ఈ డ్యామ్ కారణంగా భారత్, బంగ్లాదేశ్‌లకు అందే జలాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. దిగువ దేశాలపై పర్యావరణం, భౌగోళిక స్వరూపాన్ని హాని ఉండదని పేర్కొంది. కచ్చితత్వంతో కూడిన శాస్త్రీయ పరిశీలన తర్వాతే ఈ ప్రాజెక్టును తలపెట్టామని వివరించింది. పైపెచ్చు, ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో దిగువ ప్రాంతాల్లో విపత్తుల తీవ్రతను తగ్గించడంతోపాటు నివారించేందుకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పాటు నిస్తుందని చెప్పుకొచ్చింది. పర్యావరణం దృష్ట్యా అత్యంత సున్నితమైన, భూకంపాలకు ఎక్కువ అవకాశాలున్న హిమాలయ ప్రాంతంలో 137 బిలియన్ డాలర్లతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాలని చైనా నిర్ణయించడంపై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. చైనా తీరుపై అమెరికా ప్రభుత్వంతోనూ చర్చిస్తోంది. -
ట్రంప్ రీఎంట్రీ..మార్కెట్ గతేంటి?
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ట్రంప్ విజయ విహారం చేశారు. అయితే, ఇప్పుడు ‘మేక్ వరల్డ్ అన్–ప్రెడిక్టబుల్ అగైన్’గా మారుతుందనే అందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో జోష్ నెలకొన్నప్పటికీ, మన మార్కెట్లో మళ్లీ అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరెక్షన్ బాటలో ఉన్న దేశీ సూచీల పయనమెటన్నది అర్థం కావడం లేదు. అయితే, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ పాలసీలతో పాటు సుంకాల పెంపు వంటి చర్యలతో అగ్రరాజ్యంలో వడ్డీరేట్ల తగ్గింపునకు బ్రేకులు పడొచ్చని... డాలరు బలోపేతం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఎఫెక్ట్‌తో రూపాయి మరింత బలహీన పడొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో... స్వల్పకాలానికి మన మార్కెట్లో ట్రంప్ సెగలు తప్పవంటున్నారు!అల్‌టైమ్ గరిష్టాల నుంచి కొండ దిగుతున్న దేశీ సూచీలు.. గత నెలన్నర రోజుల్లో 8 శాతానికి పైగానే పడ్డాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం దీనికి ప్రధాన కారణం. ఎన్నికల తర్వాత సెపె్టంబర్ వరకు పెట్టుబడుల మోత మోగించిన విదేశీ ఇన్వెస్టర్లు... అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక నవంబర్లోనూ రివర్స్ గేర్ కొనసాగుతోంది. 6 ట్రేడింగ్ సెషన్లలో రూ.23,000 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.2.9 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు తరలిపోయాయి. ఇలాంటి తరుణంలో అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్.. మళ్లీ సుంకాల జూలు విదిల్చే అవకాశం ఉండటంతో పాటు ‘అమెరికా ఫస్ట్’ పాలసీలను ఆచరణలో పెడితే మన ఎకానమీపై ప్రతికూల ప్రభావానికి దారితీసే అవకాశం ఉందనేది ఆర్థిక వేత్తల అభిప్రాయం. మళ్లీ ద్రవ్యోల్బణం గుబులు... ట్రంప్ చెబుతున్నట్లుగా కార్పొరేట్ ట్యాక్స్ కోతకు తోడు సుంకాల పెంపునకు తెరతీస్తే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశాలున్నాయి. సుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. వస్తు, సేవలపై కనీసం 10 శాతం సుంకాలు పెంచినా, అక్కడ 0.8 శాతం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాం ఉందని ఎకనమిస్టులు లెక్కలేస్తున్నారు. దీనివల్ల యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోత అవకాశాలు సన్నగిల్లి.. డాలరు పుంజుకోవడానికి దారితీస్తుంది. వెరసి, ఇప్పుడిప్పుడే వడ్డీరేట్ల తగ్గింపు బాటలో వెళ్తున్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు దీనికి బ్రేక్ వేసే చాన్స్ ఉంటుంది. మరోపక్క, టారిఫ్ వార్‌కు తెగబడితే ఎగుమతులు దెబ్బతినడం... దిగుమతులు గుదిబండగా మారడం వల్ల మన దేశంలోనూ మళ్లీ ద్రవ్యోల్బణం పురి విప్పుతుంది. ఇప్పటికే జారుడుబల్లపై ఉన్న రూపాయిని (తాజాగా డాలరుతో 84.38 ఆల్‌టైమ్ కనిష్టానికి పడింది) ఇది మరింత దిగజార్చుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతపై ఆశలు ఆవిరైనట్లేననేది ఆర్థిక వేత్తల మాట. ‘ట్రంప్ ట్యాక్స్ కట్ అంటే అమెరికాలో రుణ భారం మరింత పెరుగుతుంది. అధిక వడ్డీరేట్లు, డాలరు బలంతో భారత్ లాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు కచి్చతంగా ప్రతికూలమే’ అని ఏఎస్కే వెల్త్ అడ్వయిజర్స్‌కు చెందిన సోమ్‌నాథ్ ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, చైనాపై భారీగా సుంకాలు విధించి, భారత్‌పై కాస్త కనికరం చూపితే, మన ఎగుమతులు.. కొన్ని రంగాలకు సానుకూలంగా మారుతుందని కూడా కొంత మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా.. ట్రంప్ పగ్గాలు చేపట్టి (జనవరి 20న), విధానపరమైన స్పష్టత వచ్చే వరకు మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవనేది పరిశీలకుల అభిప్రాయం.ట్రంప్ తొలి జమానాలో..2017లో ట్రంప్ తొలిసారి గద్దెనెక్కినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉంది. ముఖ్యంగా చైనా స్టాక్ మార్కెట్లో అలజడి, క్రూడ్ ధరల క్రాష్, గ్రీస్ దివాలా.. బ్రెగ్జిట్ ప్రభావాలతో స్టాక్ మార్కెట్లు తిరోగమనంలో ఉన్నాయి. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా మన మార్కెట్లు మళ్లీ పుంజుకోగలిగాయి. 2017 నుంచి 2020 వరకు ట్రంప్ తొలి విడతలో నిఫ్టీ 50 శాతం మేర పుంజుకోగా... జో బైడన్ జమానాలో ఈ ఏడాది సెపె్టంబర్ వరకు ఏకంగా 120 శాతం పైగా నిఫ్టీ ఎగబాకడం విశేషం. ఇక ట్రంప్ 1.0 హయాంలో డాలర్‌తో రూపాయి విలువ 11% క్షీణిస్తే, 2.0 కాలంలో 8–10% క్షీణించే అవకాశం ఉందని ఎస్బీఐ తాజా నివేదిక తెలిపింది!ట్రంప్ విక్టరీ నేపథ్యంలో చైనా, భారత్ సహా పలు దేశాలపై దిగుమతి సుంకాల మోతకు అవకాశం ఉంది. ఇది అక్కడ ద్య్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయొచ్చు. దీంతో అమెరికాలో వడ్డీ రేట్ల కోత జాప్యం కావచ్చు. దీనికితోడు ట్రంప్ హామీ మేరకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే, యూఎస్ బాండ్ మార్కెట్లో ఈల్డ్‌లు ఎగబాకుతాయి. ఈ పరిణామాలు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనానికి మరింత పురిగొల్పుతాయి. – నితిన్ అగర్వాల్, క్లయింట్ అసోసియేట్స్ డైరెక్టర్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
UK Election Results 2024: భారత్‌పై ప్రభావం ఎంత?
న్యూఢిల్లీ/లండన్: బ్రిటన్‌లో రిషి సునాక్ సారథ్యంలోని కన్జర్వేటివ్‌లు ఓటమి చవిచూసి లేబర్ పార్టీ గద్దెనెక్కడంతో ఈ అధికార మారి్పడి ప్రభావం భారత్‌పై ఎలా ఉండనుందన్న చర్చ జోరందుకుంది. దానికి భారత వ్యతిరేక, పాక్ అనుకూల పారీ్టగా పేరుండటమే ఇందుకు కారణం. 1997లో బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 భారత పర్యటనకు వచ్చారు. పాలక లేబర్ పార్టీ సలహా మేరకు ముందుగా పాకిస్తాన్లో ఆగడమే గాక, ‘ఇరు దేశాలూ కశీ్మర్‌పై విభేదాలను పరిష్కరించుకో’వాలని పాక్ గడ్డ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ బ్రిటన్ విదేశాంగ మంత్రి రాబిన్ కుక్ నోటి దురుసు ప్రదర్శించడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. దీనిపై భారత్ భగ్గుమనడమే గాక, బ్రిటన్ను థర్డ్ రేట్ దేశంగా నాటి ప్రధాని ఐకే గుజ్రాల్ ఛీత్కరించుకునేదాకా వెళ్లింది. ఉద్రిక్తతల నడుమ రాణి భారత పర్యటన మొక్కుబడిగా ముగిసింది. 2019లో లేబర్ పార్టీ నేత జెరెమీ కోర్బిన్ కశీ్మర్ సమస్యకు ఐరాస ఆధ్వర్యంలో రిఫరెండం నిర్వహించాలంటూ బ్రిటన్ పార్లమెంట్లో తీర్మానమే ప్రవేశపెట్టారు! దాంతో బ్రిటన్‌లో ప్రబల శక్తిగా ఉన్న భారతీయులు ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో లేబర్ పారీ్టకి వ్యతిరేకంగా ఓటేశారు. పార్టీ ఘోర ఓటమికి ఇది కూడా ముఖ్య కారణంగా నిలిచింది. పైగా ఆ పార్టీ నేతల్లో ఖలిస్తానీ సానుభూతిపరుల సంఖ్య ఎక్కువ. సారథిగా స్టార్మర్ రాకతో చాలా సానుకూల మార్పు వచి్చందంటున్నారు. ఎన్నికల్లో బ్రిటిష్ ఇండియన్ల మద్దతు కోసం ఆయన పలు చర్యలు చేపట్టారు. స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. పారీ్టలోని ఖలిస్తానీ అనుకూల నేతల ప్రాధాన్యాన్ని బాగా తగ్గించారు. ‘‘భారత్‌తో సన్నిహిత సంబంధాలే మా ప్రాథమ్యం. హిందూఫోబియాకు బ్రిటన్‌లో ఏ మాత్రమూ స్థానం లేదు. వాణిజ్యంలోనే గాక పర్యావరణ, భద్రత వంటి పలు రంగాల్లో భారత్‌తో మరింత సన్నిహితంగా కలిసి పని చేస్తాం’’ అని ప్రధానిగా తొలి ప్రసంగంలో స్టార్మర్ ప్రకటించారు. -
ట్రంప్ విజయం భారత్‌పై భారీగానే ఎఫెక్ట్!
అమెరికా అధ్యక్ష పీఠం కోసం దాదాపు ఏడాదిన్నర సాగిన ప్రచారానికి తెరపడింది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్యానికి 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. అంచనాలన్నీ తలకిందులు చేస్తూ డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీక్లింటన్ను వెనక్కి నెట్టేసి ఆయన ముందంజలో నిలిచారు. ఈ నేపథ్యంలో ట్రంప్ గెలుపు, భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే అంచనాలు ప్రారంభమయ్యయి. భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లన్నీ ట్రంప్ గెలుస్తాడన్నీ అసలు ఊహించకపోవడంతో, హిల్లరీ గెలుపు ఆశావహంతోనే నడుస్తూ వచ్చాయి. కానీ అందరి అంచనాలకు భిన్నంగా అమెరికా ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. దీంతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలవుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 1700 పాయింట్లు పడిపోయింది. గత ప్రభుత్వాలు తీసుకున్న అన్ని విదేశీ వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షిస్తానని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తుడటంతో, భారత్‌తో ఉన్న ట్రేడ్ డీల్స్‌పై కూడా ఈ ప్రభావం పడనుందని తెలుస్తోంది. హెచ్1బీ వీసా ప్రొగ్రామ్‌ను ట్రంప్ ఎక్కువగా టార్గెట్ చేశారు. ఈ ప్రొగ్రామ్‌ను నిలిపివేస్తానని అమెరికన్లకు హామీ ఇచ్చారు. దీంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న భారత ఐటీ ఇండస్ట్రి భారీగా నష్టపోనుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ట్రంప్ పాలసీలకు మొదటి బాధితులుగా మిగలనున్నాయి. ట్రంప్ ప్రచారం చాలామటుకు అమెరికన్ ప్రజలు కోల్పోతున్న ఉద్యోగాల దిశగా సాగింది. అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు, చైనీస్, సింగపూర్ వాసులు తన్నుకు పోతున్నారని, వాటిని అరికడతామని హెచ్చరికలు చేశారు. మళ్లీ అమెరికా ఉద్యోగాలు అమెరికాకు తేస్తామని, భారత్ నుంచి వెళ్లే వలసవాదులపై ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ట్రంప్ గెలుపుతో భారత్‌కు నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కఠినతరమైన ఇమిగ్రేషన్ రూల్స్‌ను తీసుకొస్తానని ట్రంప్ అంటున్నప్పటికీ, మరోవైపు భారత విద్యార్థుల, వ్యాపారస్తుల మనసులు గెలుచుకోవడంలో కృషిచేస్తూనే ఉన్నారు. చైనాకు ఆయన పూర్తిగా విరుద్ధం కాబట్టి అది భారత్‌కు అనుకూలంగా మారనుంది. ఒకవేళ చైనా ట్రేడ్ అగ్రిమెంట్లకు సహకరించపోతే, చైనా కరెన్సీ మానిప్యూలేటర్కు పాల్పడుతుందని నిందవేస్తూ, అత్యధిక మొత్తంలో పన్ను విధించనున్నట్టు ఆయన చెప్పారు. అదేవిధంగా పాకిస్తాన్‌ను కూడా ఉగ్రవాద సహకార దేశంగా ముద్రవేయడానికి ట్రంప్ వెనుకాడరని అర్థమవుతోంది. ఉగ్రవాదంపై ట్రంప్ తీసుకునే చర్యలు, ఇండో-పాక్ రక్షణ సంబంధాలను మెరుగుపరుస్తాయని కొందరు పేర్కొంటున్నారు.