
‘మనకు కావాల్సినవన్నీ మనమే తయారు చేసుకుందాం’ అనే నినాదంగా మారకూడదు
దీనితో పెట్టుబడులు, ఉత్పాదకతకు విఘాతం
ఫార్మా, ఎల్రక్టానిక్స్‌కి మినహాయింపులు శాశ్వతం కాదు
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
న్యూఢిల్లీ: ‘మేకిన్ ఇండియా’ నినాదమనేది ‘మేక్ ఆల్ దట్ ఇండియా నీడ్స్’ (భారత్‌కి కావల్సినవన్నీ ఇక్కడే తయారు చేసుకోవడం)గా మారకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు.
దీనివల్ల చైనాకు వెళ్లే పెట్టుబడులను మనవైపు ఆకర్షించే అవకాశం కోల్పోతామని, ఉత్పాదకతపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మేకిన్ ఇండియా విజయవంతం కావడమనేది, రక్షణాత్మక ధోరణి కన్నా ఎంత మెరుగ్గా పోటీపడగలమనే దానిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మిగతావారితో పని లేకుండా విడిగా ఉండిపోవడం కాకుండా స్వేచ్ఛా విధానాలను అమలు చేయడం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమని దువ్వూరి తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పునరుద్ఘాటించినట్లుగా ఆత్మనిర్భర భారత్ నినాద లక్ష్యం రక్షణ, ఇంధనంలాంటి సున్నిత రంగాల్లో వ్యూహాత్మకంగా స్వయం సమృద్ధి సాధించడమే కావాలే తప్ప దాన్ని ప్రతి ఒక్క దానికి అన్వయించుకోకూడదని తెలిపారు. భారత్‌కి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచానికి కూడా అవసరమైన వాటిని ఉత్పత్తి చేసే ఎగుమతుల ఆధారిత తయారీ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దడమే మేకిన్ ఇండియా ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
‘‘అయితే, 50 శాతం టారిఫ్‌ల వల్ల కీలకమైన అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు, ఇప్పుడు ఆసియాలోనే అత్యధిక టారిఫ్‌లు ఎదుర్కొంటున్న మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి సందేహిస్తారు’’ అని దువ్వూరి తెలిపారు. ‘‘ఆసియాలో బంగ్లాదేశ్, వియత్నాం, ఇండొనేíÙయా కన్నా భారత్‌పై అత్యధిక టారిఫ్‌లు వర్తిస్తుండటమనేది ఆందోళనకర అంశం. కీలక తరుణంలో చైనా ప్లస్ వన్‌గా ఎదగాలన్న ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి దీని వల్ల విఘాతం కలుగుతుంది’’ అని చెప్పారు.
అమెరికాకు సగం ఎగుమతులపై టారిఫ్‌ల ప్రభావం ..
మన ఎగుమతుల్లో దాదాపు 20 శాతం వాటా ఉండే అమెరికా మార్కెట్లో 50 శాతం టారిఫ్‌లు విధిస్తే, కనీసం సగం ఎగుమతులపై ప్రభావం పడుతుందని దువ్వూరి తెలిపారు. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, రత్నాభరణాలు, లెదర్‌లాంటి కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాలపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఫార్మా, ఎల్రక్టానిక్స్‌కు టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉండటం శాశ్వతమేమీ కాదని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు కొనసాగుతున్న సమీక్షల వల్ల భవిష్యత్తులో వాటిని కూడా టారిఫ్‌ల పరిధిలోకి చేర్చే అవకాశం ఉందన్నారు.
500 బిలియన్ డాలర్ల వాణిజ్యం డౌటే..
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్న భారత్–అమెరికా లక్ష్యం సాకారం కావడం మిథ్యేనని స్పష్టంగా తెలుస్తోందని దువ్వూరి చెప్పారు. మన ఎగుమతుల మీద పడే ప్రభావాలపై లెక్కలు వేసుకోవడానికి ముందు, అమెరికా మార్కెట్ కోల్పోవడం వల్ల వచ్చే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ప్రపంచ దేశాలను చైనా తమ ఉత్పత్తులతో ముంచెత్తే ముప్పు గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుందన్నారు.
మరోవైపు, దేశీయంగా డెయిరీ, వ్యవసాయం అనేవి రాజకీయంగా చాలా సున్నితమైన రంగాలని, కోట్ల కొద్దీ ప్రజలకు జీవనోపాధి కలి్పంచడంతో పాటు దేశ ఆహార భద్రతకు కూడా ముడిపడి ఉన్నవని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా దిగుమతులకు గంపగుత్తగా అనుమతించడం వాంఛనీయమూ, లాభదాయకమూ కూడా కాదని సుబ్బారావు చెప్పారు. అయితే, కొన్ని విషయాల్లో కాస్త పట్టు విడుపులతో వ్యవహరిస్తే చర్చల్లో ప్రతిష్టంభన తొలగేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.