breaking news
Former RBI Governor D Subbarao
-
మేకిన్ ఇండియాపై జాగ్రత్త
న్యూఢిల్లీ: ‘మేకిన్ ఇండియా’ నినాదమనేది ‘మేక్ ఆల్ దట్ ఇండియా నీడ్స్’ (భారత్‌కి కావల్సినవన్నీ ఇక్కడే తయారు చేసుకోవడం)గా మారకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. దీనివల్ల చైనాకు వెళ్లే పెట్టుబడులను మనవైపు ఆకర్షించే అవకాశం కోల్పోతామని, ఉత్పాదకతపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మేకిన్ ఇండియా విజయవంతం కావడమనేది, రక్షణాత్మక ధోరణి కన్నా ఎంత మెరుగ్గా పోటీపడగలమనే దానిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మిగతావారితో పని లేకుండా విడిగా ఉండిపోవడం కాకుండా స్వేచ్ఛా విధానాలను అమలు చేయడం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమని దువ్వూరి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పునరుద్ఘాటించినట్లుగా ఆత్మనిర్భర భారత్ నినాద లక్ష్యం రక్షణ, ఇంధనంలాంటి సున్నిత రంగాల్లో వ్యూహాత్మకంగా స్వయం సమృద్ధి సాధించడమే కావాలే తప్ప దాన్ని ప్రతి ఒక్క దానికి అన్వయించుకోకూడదని తెలిపారు. భారత్‌కి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచానికి కూడా అవసరమైన వాటిని ఉత్పత్తి చేసే ఎగుమతుల ఆధారిత తయారీ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దడమే మేకిన్ ఇండియా ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ‘‘అయితే, 50 శాతం టారిఫ్‌ల వల్ల కీలకమైన అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు, ఇప్పుడు ఆసియాలోనే అత్యధిక టారిఫ్‌లు ఎదుర్కొంటున్న మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి సందేహిస్తారు’’ అని దువ్వూరి తెలిపారు. ‘‘ఆసియాలో బంగ్లాదేశ్, వియత్నాం, ఇండొనేíÙయా కన్నా భారత్‌పై అత్యధిక టారిఫ్‌లు వర్తిస్తుండటమనేది ఆందోళనకర అంశం. కీలక తరుణంలో చైనా ప్లస్ వన్‌గా ఎదగాలన్న ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి దీని వల్ల విఘాతం కలుగుతుంది’’ అని చెప్పారు. అమెరికాకు సగం ఎగుమతులపై టారిఫ్‌ల ప్రభావం .. మన ఎగుమతుల్లో దాదాపు 20 శాతం వాటా ఉండే అమెరికా మార్కెట్లో 50 శాతం టారిఫ్‌లు విధిస్తే, కనీసం సగం ఎగుమతులపై ప్రభావం పడుతుందని దువ్వూరి తెలిపారు. ముఖ్యంగా టెక్స్టైల్స్, రత్నాభరణాలు, లెదర్‌లాంటి కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాలపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఫార్మా, ఎల్రక్టానిక్స్‌కు టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉండటం శాశ్వతమేమీ కాదని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు కొనసాగుతున్న సమీక్షల వల్ల భవిష్యత్తులో వాటిని కూడా టారిఫ్‌ల పరిధిలోకి చేర్చే అవకాశం ఉందన్నారు.500 బిలియన్ డాలర్ల వాణిజ్యం డౌటే.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్న భారత్–అమెరికా లక్ష్యం సాకారం కావడం మిథ్యేనని స్పష్టంగా తెలుస్తోందని దువ్వూరి చెప్పారు. మన ఎగుమతుల మీద పడే ప్రభావాలపై లెక్కలు వేసుకోవడానికి ముందు, అమెరికా మార్కెట్ కోల్పోవడం వల్ల వచ్చే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ప్రపంచ దేశాలను చైనా తమ ఉత్పత్తులతో ముంచెత్తే ముప్పు గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, దేశీయంగా డెయిరీ, వ్యవసాయం అనేవి రాజకీయంగా చాలా సున్నితమైన రంగాలని, కోట్ల కొద్దీ ప్రజలకు జీవనోపాధి కలి్పంచడంతో పాటు దేశ ఆహార భద్రతకు కూడా ముడిపడి ఉన్నవని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా దిగుమతులకు గంపగుత్తగా అనుమతించడం వాంఛనీయమూ, లాభదాయకమూ కూడా కాదని సుబ్బారావు చెప్పారు. అయితే, కొన్ని విషయాల్లో కాస్త పట్టు విడుపులతో వ్యవహరిస్తే చర్చల్లో ప్రతిష్టంభన తొలగేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. -
కేంద్రం నుంచి రాష్ట్రాలకు 32 శాతమే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పన్నుల వాటా నానాటికి క్షీణిస్తూ సెస్సులు, సర్‌చార్జీల వాటా గణనీయంగా పెరిగిపోతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్రం పునఃపరిశీలన చేసి మరింత పారదర్శకత తీసుకురావాల్సిన అవసరముందన్నారు. గురువారం ఆయన సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో దివంగత ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ స్మారక ఉపన్యాసం ఇచ్చారు. కేంద్ర పన్నుల్లోనే రాష్ట్రాలకు వాటా ఉంటుందని, సెస్‌లు, సర్‌చార్జీల్లో ఉండదన్నారు. ‘కేంద్రానికి 100 శాతం ఆదాయం పన్నుల ద్వారా వస్తే ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 60 శాతం ఉంచుకుని మిగిలిన 40శాతాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయాలి.కేంద్రం ఆదాయాన్ని 80 శాతం పన్నులు, 20 శాతం సర్‌చార్జీలుగా విభజించి వసూలు చేస్తుండటంతో, ఆ 80శాతం పన్నుల్లో 60 శాతం వాటా కింద దానికి 48 శాతం వస్తుంది. దీనికి 20 శాతం సర్‌చార్జీలు, సెస్సుల ఆదాయం తోడైతే మొత్తం 68 శాతం ఆదాయం కేంద్రానికే వెళ్తుంది. తుదకు రాష్ట్రాలకు 32 శాతం వాటానే లభిస్తుంది’ అని అన్నారు. దేశం సహకార సమాఖ్య నుంచి ఘర్షణాత్మక సమాఖ్యకు పరిణామం చెందిందని సుబ్బారావు అభిప్రాయపడ్డారు. రాజకీయంగా రాష్ట్రాలు బలపడటంతో ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం పెరగగా, కేంద్రానిది తగ్గిందన్నారు. కేంద్ర పన్నుల్లో అధిక వాటా కోసం అధిక సంతానాన్ని కనాలని ఏపీ, తమిళనాడు సీఎంలు చంద్రబాబు, స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో విభేదించారు. ఉచిత హామీలపై కోడ్ తేవాలి ఉచితాలపై అత్యవసరంగా ప్రవర్తన నియమావళి రూపొందించాల్సిన అవసరముందని సుబ్బారావు చెప్పారు. ప్రజాకర్షక పథకాల కోసం పారీ్టలు పోటీపడి ఉచిత హామీలిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని, దీంతో రుణాల భారం పెరిగిపోతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014–15లో రాష్ట్ర ఆదాయ వనరుల్లో 25శాతం ఉన్న కేంద్ర పన్నుల వాటా 2023–24 నాటికి 15శాతానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న ఆదాయంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఏటేటా క్షీణిస్తోందన్నారు. -
కొత్త బడ్జెట్‌పై ఆర్బీఐ మాజీ గవర్నర్ విమర్శలు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల మొదట్లో ప్రవేశపెట్టిన 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉపాధి కల్పనకు ‘తగినంత ప్రాధాన్యత’ ఇవ్వలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. వృద్ధిరేటు ఉద్యోగాలను సృష్టిస్తుందనే విశ్వాసం అయితే ఉందికానీ, నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి ఈ విశ్వాసం ఒక్కటే దోహదపడబోదని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్‌కు ముందు కూడా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆయన పేర్కొంటూ, మహమ్మారి ఫలితంగా ఇది మరింత ఆందోళనకరంగా మారిందని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దువ్వూరి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. ఉద్యోగాలపై (2023–24 బడ్జెట్లో) తగినంత ప్రాధాన్యత లేకపోవడంతో నేను నిరాశ చెందాను. కేవలం వృద్ధితోనే ఉపాధి కల్పనను సాధించలేము. మనకు ఉపాధి కల్పనే ధ్యేయంగా జరిగే వృద్ధి అవసరం. ప్రతి నెలా దాదాపు లక్ష మంది శ్రామిక శక్తిలో చేరుతున్నారు. అయితే వారిలో సగానికి కూడా భారత్ ఉద్యోగాలను కూడా సృష్టించలేకపోతోంది. ఫలితంగా నిరుద్యోగ సమస్య పెరగడమే కాకుండా సంక్షోభంగా మారుతోంది. భారీ సంఖ్యలో యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించగలిగినప్పుడే, దేశంలోని అధిక యువత ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఎన్నికల కారణంగా 2023–24 బడ్జెట్ ప్రజాకర్షక చర్యలతో ఉంటుందని భావించారు. అయితే ఇందుకు భిన్నంగా వృద్ధి, ద్రవ్యలోటు కట్టడిపైనా బడ్జెట్ దృష్టి సారించడం కొంత హర్షణీయ అంశం. ఉపాధికి బడ్జెట్ ప్రోత్సాహం: ఆర్థికశాఖ కాగా, ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం నెలవారీ సమీక్షను విడుదల చేస్తూ, బడ్జెట్లో చేసిన ప్రకటనలు వృద్ధిని, ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొనడం గమనార్హం. మూలధన పెట్టుబడుల పెంపు, గ్రీన్ ఎకానమీకి ప్రోత్సాహం, ఫైనాన్షియల్ మార్కెట్ల పటిష్టానికి చొరవలు వంటి అంశాలు వృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడతాయని ఆర్థికశాఖ సమీక్ష పేర్కొంది. (ఇదీ చదవండి: G20 ministerial meeting: క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ విధానం అవసరం) -
దీర్ఘకాలంలో నోట్ల రద్దు ప్రయోజనాలు
ఆర్బీఐ మాజీ గవర్నర్ డీ సుబ్బారావు ఆశాభావం కోల్‌కతా: పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ఫలితాలు గడచిన ఎనిమిది నెలలుగా స్పష్టంగా కనిపించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు బుధవారం పేర్కొన్నారు. అయితే డీమోనిటైజేషన్ ప్రయోజనాలు దీర్ఘకాలంలో కనిపిస్తాయన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. బంధన్ బ్యాంక్ రెండవ వ్యవస్థాపక వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. క్లుప్తంగా ఆయన వ్యాఖ్యల్ని చూస్తే.... డీమోనిటైజేషన్ వల్ల వేలాది ఉద్యోగాలు పోయాయ్. రోగులకు తగిన వైద్యం అందలేదు. ప్రజలు గంటలకొద్దీ వరుసలో నిలుచున్నారు. ఎంతో వేదన కలిగింది. వీటన్నింటి ప్రతికూలత మనకు గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ వృద్ధి రేటు (6.1 శాతం) రూపంలో కనబడింది. ఇంకా నిర్వహించాల్సిన లక్ష్యాల ఆధారంగా ప్రయోజనాలు ఉంటాయి. నల్లధనం తదుపరి సృష్టి జరక్కుండా చర్యలు, ఆర్థికలావాదేవీల డిజిటలైజేషన్, నకిలీనోట్లను రూపుమాపడం... ఇవన్నీ నిర్దేశిత లక్ష్యాల్లో కీలకమైనవి. డిజిటలైజేషన్ వైపు నడకకూ–డీమోనిటైజేషన్‌కు సంబంధం లేదు. డీమోనిటైజేషన్ అవసరం లేకుండానే డిజిటలైజేషన్ చర్యలు పటిష్టంగా చేపట్టవచ్చు. స్థూల దేశీయోత్పత్తిలో ఆదాపు పన్ను వాటా మరింత పెరగాలి. ఆర్థిక రికవరీ ఆందోళనే: డీఅండ్‌బీ భారత్ ఆర్థిక రికవరీ ఇంకా ఆందోళనకరంగానే ఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) తన తాజా నివేదికలో పేర్కొంది. వినియోగం, పెట్టుబడుల డిమాండ్ ఇంకా మందకొడిగానే ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. బ్యాంకుల మొండిబకాయిల సమస్య, కంపెనీల బ్యాలెన్స్ షీట్స్ బలహీనత, వ్యవసాయ రుణ మాఫీ తద్వారా ద్రవ్య క్రమశిక్షణకు విఘాతం వంటి ప్రతికూల అంశాలను అమెరికాకు చెందిన ఈ వ్యాపార సేవల కంపెనీ ఉదహరించింది. -
నోట్ల రద్దు... దీర్ఘకాలానికి మంచిదే
స్వల్పకాలికంగా వృద్ధికి విఘాతం పెరగనున్న పన్నుల ఆదాయం ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సింగపూర్: పెద్ద నోట్లకు చట్టబద్ధత లేకుండా చేయడం వల్ల(డీలీగలైజేషన్) స్వల్పకాలికంగా వృద్ధికి విఘాతం కలిగించే అవకాశాలున్నప్పటికీ, మధ్య-దీర్ఘకాలికంగా స్థూల ఆర్థిక స్థితిగతులపై దీని ప్రభావాలు సానుకూలంగానే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలను ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఎంత వేగంగా, ఎంత సమర్ధవంతంగా హ్యాండిల్ చేయగలిగితే, ప్రతికూల ప్రభావాలు అంత తక్కువగా ఉంటాయని డీమోనటైజేషన్ అంశంపై రాసిన వ్యాసంలో సుబ్బారావు విశ్లేషించారు. ’అత్యంత స్వల్పకాలికంగా చూస్తే డీలీగలైజేషన్.. వృద్ధికి విఘాతం కలిగిస్తుంది. వినియోగంపై నగదు కొరత ప్రతికూల ప్రభావం చూపుతుంది. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా మధ్య, దీర్ఘకాలిక స్థూల ఆర్థిక ప్రభావాలను చూస్తే, సానూకూలమే’ అని ఆయన పేర్కొన్నారు. డీలీగలైజేషన్ వల్ల విచక్షణేతర వినియోగాలు తగ్గడం వల్ల ఆ మేరకు వినియోగదారుల ధరల ఆధారిత సూచీపైనా ప్రభావం పడి, ద్రవ్యోల్బణం తగ్గవచ్చని తెలిపారు. చట్టబద్ధత లేని కరెన్సీని బ్యాంకుల్లో డిపాజిట్ చేశాక, కొత్త కరెన్సీ చెలామణీలోకి రాగానే కొన్ని సానుకూల పరిణామాలు కనిపించడం మొదలుపెట్టగలవని ఆయన చెప్పారు. నల్లధనపు ఎకానమీ అధికారిక ఆర్థిక వ్యవస్థలో కలిసిపోతుందని, న్యాయబద్ధమైన ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించగలదని తెలిపారు. ప్రభుత్వానికి మరింత ఆదాయం.. ఇంతవరకూ లెక్కల్లో లేని సంపద ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వాటిపై వచ్చే పన్నుల రూపంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడగలదని సుబ్బారావు తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు అదనపు పన్నుల కింద స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) కనీసం అరశాతం మేర (దాదాపు రూ. 65,000 కోట్లు) దఖలుపడే అవకాశం ఉందన్నారు. ఇది ఆర్థిక స్థిరత్వానికి, ఇన్ఫ్రాలో పెట్టుబడులు మొదలైన వాటికి ఉపయోగపడగలదన్నారు. వ్యవస్థ ప్రక్షాళన చేయడమనేది ఇటు పొదుపునకు, అటు పెట్టుబడులకు కూడా సానుకూలాంశమేనని సుబ్బారావు వివరించారు. ఇక, ఆర్బీఐ పాలసీ రేట్లలో కోత పెట్టకపోరుునా కూడా ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్ల రాకతో బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయని సుబ్బారావు పేర్కొన్నారు. బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేందుకు, మరింతగా రుణ వితరణకు వెసులుబాటు లభించగలదని చెప్పారు.