
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల మొదట్లో ప్రవేశపెట్టిన 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉపాధి కల్పనకు ‘తగినంత ప్రాధాన్యత’ ఇవ్వలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. వృద్ధిరేటు ఉద్యోగాలను సృష్టిస్తుందనే విశ్వాసం అయితే ఉందికానీ, నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి ఈ విశ్వాసం ఒక్కటే దోహదపడబోదని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్‌కు ముందు కూడా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆయన పేర్కొంటూ, మహమ్మారి ఫలితంగా ఇది మరింత ఆందోళనకరంగా మారిందని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దువ్వూరి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
- ఉద్యోగాలపై (2023–24 బడ్జెట్‌లో) తగినంత ప్రాధాన్యత లేకపోవడంతో నేను నిరాశ చెందాను. కేవలం వృద్ధితోనే ఉపాధి కల్పనను సాధించలేము. మనకు ఉపాధి కల్పనే ధ్యేయంగా జరిగే వృద్ధి అవసరం.
- ప్రతి నెలా దాదాపు లక్ష మంది శ్రామిక శక్తిలో చేరుతున్నారు. అయితే వారిలో సగానికి కూడా భారత్ ఉద్యోగాలను కూడా సృష్టించలేకపోతోంది. ఫలితంగా నిరుద్యోగ సమస్య పెరగడమే కాకుండా సంక్షోభంగా మారుతోంది.
- భారీ సంఖ్యలో యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించగలిగినప్పుడే, దేశంలోని అధిక యువత ద్వారా ప్రయోజనం ఉంటుంది.
- ఎన్నికల కారణంగా 2023–24 బడ్జెట్ ప్రజాకర్షక చర్యలతో ఉంటుందని భావించారు. అయితే ఇందుకు భిన్నంగా వృద్ధి, ద్రవ్యలోటు కట్టడిపైనా బడ్జెట్ దృష్టి సారించడం కొంత హర్షణీయ అంశం.
ఉపాధికి బడ్జెట్ ప్రోత్సాహం: ఆర్థికశాఖ
కాగా, ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం నెలవారీ సమీక్షను విడుదల చేస్తూ, బడ్జెట్‌లో చేసిన ప్రకటనలు వృద్ధిని, ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొనడం గమనార్హం. మూలధన పెట్టుబడుల పెంపు, గ్రీన్ ఎకానమీకి ప్రోత్సాహం, ఫైనాన్షియల్ మార్కెట్ల పటిష్టానికి చొరవలు వంటి అంశాలు వృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడతాయని ఆర్థికశాఖ సమీక్ష పేర్కొంది.
(ఇదీ చదవండి: G20 ministerial meeting: క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ విధానం అవసరం)