
అమెరికా టారిఫ్‌లతో ఎంఎస్‌ఎంఈలకు రిస్క లు
ఎగుమతిదారులకు 35 శాతం పెరగనున్న వ్యయాలు
ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్‌లు విధించాలన్న అమెరికా నిర్ణయం.. చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈ) కలవరపరుస్తోంది. దీని ప్రభావం తమపై చాలా తీవ్రంగా ఉంటుందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
టారిఫ్‌ల పెంపు .. వార్షికంగా దాదాపు 30 బిలియన్ డాలర్ల మేర వ్యాపార నష్టానికి దారి తీస్తుందని స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఫోరం (ఎస్‌ఎంఈ ఫోరం) ప్రెసిడెంట్ వినోద్ కుమార్ వెల్లడించారు. దీనివల్ల అత్యధికంగా నష్టపోయేది చిన్న సంస్థలేనని ఆయన చెప్పారు. వాటి ఆర్థిక స్థోమత, సామర్థ్యాలు పరిమిత స్థాయిలోనే ఉండటమే ఇందుకు కారణమని వివరించారు. టారిఫ్ షాక్ అనేది ఎంఎస్‌ఎంఈ ట్రేడర్లను చాలా కఠినతరమైన పరిస్థితుల్లోకి నెట్టివేసిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ సెక్రటరీ జనరల్ అనిల్ భరద్వాజ్ చెప్పారు.
‘గతంలో విధించిన 25 శాతానికి మరో 25 శాతం టారిఫ్‌లు తోడు కావడం వల్ల భారతీయ ఎగుమతిదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇతర దేశాల పోటీ సంస్థలతో పోలిస్తే మన ఎగుమతిదారుల వ్యయాలు 30–35 శాతం పెరిగిపోతాయి‘ అని తెలిపారు. దీని వల్ల, ఆగస్టు 27లోగా (అదనపు టారిఫ్‌లు అమల్లోకి వచ్చే తేదీ) తగిన పరిష్కారం కనుగొనకపోతే, అమెరికాకు ఎగుమతులు 40–50 శాతం పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈల వాటా దాదాపు 45 శాతంగా ఉంటుంది.
పరిశ్రమకు మేల్కొలుపు..
టారిఫ్‌ల పెంపు అనేది ఇటు విధాన నిర్ణేతలు, అటు ఎగుమతిదారులకు ఓ మేల్కొలుపులాంటిదని కుమార్ చెప్పారు. దీన్ని ఒక అవాంతరంగా చూడకుండా అవకాశంగా మల్చుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. అంతగా ఎగుమతులు లేని, అధిక వృద్ధికి అవకాశాలున్న ప్రాంతాలకు కొత్తగా లింకేజీలను ఏర్పర్చుకోవడం, అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడం ద్వారా భారతీయ ఎంఎస్‌ఎంఈలు వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఫోకస్ చేయొచ్చని సూచించారు.
ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సెంట్రల్ ఏషియా, తూర్పు యూరప్, పసిఫిక్ ద్వీప దేశాలు, కరీబియన్ దీవులు మొదలైన మార్కెట్ల వైపు చూడొచ్చని చెప్పారు. ఈ మార్కెట్లకు 60 బిలియన్ డాలర్ల పైగా ఎగుమతులు చేసేందుకు అవకాశాలు ఉంటాయని కుమార్ చెప్పారు. భారతీయ ఎంఎస్‌ఎంఈలు ఇప్పటికే పటిష్టంగా ఉన్న రంగాల్లో నమ్మకమైన సరఫరాదారుల కోసం ఈ ప్రాంతాల్లోని సంస్థలు అన్వేíÙస్తున్నాయని తెలిపారు. ఫార్మా, వ్యవసాయ–వ్యవసాయేతర మెషినరీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, దుస్తులు మొదలైన రంగాలు వీటిలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభావిత ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ద్రవ్యపరమైన, ద్రవ్యయేతరమైన చర్యలు ప్రకటించాలని కుమార్ విజ్ఞప్తి చేశారు. అలాగే పరిశ్రమ ఇతరత్రా మార్కెట్ల వైపు కూడా మళ్లేందుకు ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ దిశలో బ్రిటన్, ఆ్రస్టేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌లతో వాణిజ్య ఒప్పందాల పరిధిని మరింతగా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు.
మనకు అనువైన మార్కెట్లను గుర్తించి, ఎగుమతి చేసే క్రమంలో కఠినతరమైన నాణ్యత, ప్యాకేజింగ్, నిబంధనల ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు గైడెన్స్ అవసరమవుతుందని కుమార్ పేర్కొన్నారు. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలను పటిష్టం చేసేందుకు ఇండియా ఎస్‌ఎంఈ ఫోరం, ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. డిజిటల్ ట్రేడ్ ప్లాట్‌ఫాంలను అందుబాటులోకి తేవడం, సకాలంలో..తక్కువ వడ్డీపై ఎగుమతులకు ఫైనాన్సింగ్ అందించడం, రియల్ టైమ్‌లో మార్కెట్ వివరాలను అందించడం వంటి అంశాలపై కసరత్తు చేస్తోంది.