అవునండి. నిజమే. మనం చెప్పినా చెప్పకపోయినా, ఇప్పుడు మన విదేశీ ఆస్తులు డిపార్టుమెంటువారికి కనిపిస్తున్నాయి. మీరు రెసిడెంటు అసెస్సీ అయితే, మీ విదేశీ ఆస్తులు, ఆ ఆస్తుల మీద ఆదాయం డిక్లేర్ చేయాలి.
ఈ మధ్య ఒక స్కీముని ప్రవేశపెట్టారు. అదేమిటంటే ‘చిన్న చిన్న పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సమాచారం తెలియజేయడం‘. దీని పేరు Foreign Assets of Small Tax Payers Disclosure Scheme 2026. టూకీగా చెప్పాలంటే FAST ఈ 2026. షార్ట్‌కట్‌లో చెప్పినట్లుగా ఫాస్ట్‌గా దీన్ని అమలు పరుస్తున్నారు. పారదర్శకత పేరుతో వచ్చిన ఈ స్కీము ప్రకారం మీరు పోర్టల్‌లోకి లాగిన్ అయితే, మీ విదేశీ ఆస్తులు మీకే కనిపిస్తాయి.
విదేశాల్లో సంబంధిత అధికారుల నుంచి అధికారికంగా సేకరించిన సమాచారాన్ని య«థాతథంగా ఈ పోర్టల్‌లో పొందుపరుస్తున్నారు. పదిలపరుస్తున్నారు. ఈ సమాచారం పోర్టల్‌లో లభ్యమవుతోంది. లాగిన్ తర్వాత ఏఐఎస్ సెక్షన్‌లోకి వెళ్లి, కాంప్లయెన్స్ పోర్టల్ విండోకి వెళితే సమాచారం ఉంటుంది.
2022 సంవత్సరం నుండి..
చాలా మటుకు దేశాల్లో క్యాలెండర్ సంవత్సరాన్నే వారి వారి ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. మనలాగా ఏప్రిల్ నుంచి మార్చి వ్యవధిని కాదు. 2022, 2023, 2024, 2025 క్యాలెండర్ సంవత్సరాలకు సంబంధించిన సమాచారం మొత్తం సదరు పోర్టల్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంది. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాస్‌వర్డ్‌లో మీ పాన్ నంబరు, మీ పుట్టిన తేదీ ఉంటాయి.
ఏయే సమాచారం ఉంటుంది..
మీ పేరు, చిరునామా, ఈమెయిల్, ఫోన్ నంబరు, పాన్ నంబర్లతో పాటు సీరియల్ నంబరు, దేశం పేరు, వ్యవహారం, విదేశాల్లో బ్యాంకు అకౌంటు నంబరు, ఆ దేశ కరెన్సీ, డివిడెండ్లు, వడ్డీ, బ్యాంకులో డిపాజిట్లు/వసూళ్లు, చెల్లింపులు, ఆ దేశ కరెన్సీ నుంచి మన దేశానికి మార్చిన వివరాలు, విదేశీ బ్యాంకు అకౌంట్లలోని బ్యాలెన్సులు, ఇదంతా వారు సేకరించి, పోర్టల్‌లో భద్రపర్చారు. డౌన్‌లోడ్ చేయండి.
డౌన్‌లోడ్ తర్వాత ఏం చేయాలి..
డౌన్‌లోడ్ చేయడం పెద్ద విశేషం కాదు. పనంతా ఆ తరువాతే ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గరున్న సమాచారంతో మీరు చెక్ చేసుకోండి. ఈ సమాచారం, ఆ సమాచారంతో సరిపోతే ఓకే. అలా కాకుండా ఏదైనా కారణాన సమాచారం ఒకటి కాకపోతే? కరెక్టు కాకపోతే? తేడాలుంటే.. విశ్లేషించుకోండి. సమాచారం సరైనదా? కాదా? మీకు సంబంధించినదేనా కాదా? సమాచారం పాక్షికంగానే కరెక్టా? ఇలాంటివన్నీ చూసుకోవాలి. సీరియల్ నంబరువారీగా మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. 400 అక్షరాలు దాటి ఇవ్వకూడదు. కాబట్టి శోధించి, మదించి, కుదించి ఇవ్వండి. ముందు మీ అభిప్రాయాన్ని అక్నాలెడ్జ్ చేస్తారు. ఆ తర్వాత ఆరా తీస్తారు. మీరు చెప్పినది నిజమయితే వారు తమ తప్పుని దిద్దుకుంటారు. లేదా మీరే సరిదిద్దుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ సమాచారం చాలా కీలకమైనది. విదేశాల్లో ఉన్న ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తుల జాబితా ఇది. ఆయా ఆస్తుల మీద ఆదాయం ఎంత ఉందో లెక్కిస్తారు. దాన్ని భారత్‌లో కూడా వచ్చే ఆదాయంతో కలిపి పన్నుభారం లెక్కిస్తారు. దానికి తగ్గట్లు పన్ను విధిస్తారు. అయితే, చాలా దేశాలతో మనకు అగ్రిమెంట్లు ఉన్నాయి. వాటి ప్రకారం డబుల్ ట్యాక్సేషన్ జరగదు. అయితే, ఆ దేశంలో పన్ను చెల్లించినట్లు ధ్రువీకరించాలి. ఏవైనా తేడాలుండి, మనదేశంలో రేటు ఎక్కువ అయితే, ఆ తేడా చెల్లించాలి. నిర్దేశిత ఫారాలు జతపరచాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ’ఖాన్‌తో గేమ్స్ ఆడకు’లాగా డిపార్టుమెంటుతో గేమ్‌లాడవద్దు.
- డా. కందాళ సత్యనారాయణ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు
గమనిక: పన్నుకు సంబంధించిన సందేహాలు ఉంటే business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.


