‘ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ సురక్షితమే’ | E20 Petrol Insurance Claims Safe Ethanol Blend Government Clarification | Sakshi
Sakshi News home page

‘ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ సురక్షితమే’

Jun 25 2026 10:36 AM | Updated on Jun 25 2026 10:47 AM

E20 Petrol Insurance Claims Safe Ethanol Blend Government Clarification

న్యూఢిల్లీ: ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ సురక్షితమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై వినియోగదారుల్లో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది. 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (ఈ20) ప్రస్తుతం దేశవ్యాప్తంగా విక్రయాలకు అందుబాటులో ఉండడం గమనార్హం. దీన్ని వినియోగించడం వల్ల వాహన బీమా క్లెయిమ్‌పై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు కూడా వచ్చాయి.

దీంతో కేంద్ర పెట్రోలియం శాఖ స్పందిస్తూ.. ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌ వినియోగదారులకు అనుకూలమని, ఆర్థికంగా ప్రయోజనకరమని స్పష్టం చేసింది. ఈ20 పెట్రోల్‌ వినియోగించడం వల్ల వాహన బీమా క్లెయిమ్‌ లభించందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. ‘‘ఇథనాల్‌ మిశ్రమం అన్నది అంతర్జాతీయంగా ఆమోదంలో ఉన్న విధానమే. యూఎస్, బ్రెజిల్, జపాన్‌ తదితర దేశాల్లో విజయవంతంగా అమలవుతోంది’’అని పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది.

బ్రెజిల్‌ అయితే పెట్రోల్‌లో ఇథనాల్‌ను మరింత ఎక్కువగా కలుపుతోందని, ఈ27 అక్కడ అమల్లో ఉందని పేర్కొంది. ఇథనాల్‌ను కలపడం వల్ల పెట్రోల్‌ దిగుమతులను తగ్గించుకోవచ్చంటూ, ఈ రూపంలో ఇప్పటి వరకు రూ.1.4 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసినట్టు తెలిపింది. మరోవైపు ఇథనాల్‌ తయారీలోకి వినియోగించే వ్యవసాయ ముడి సరుకులకు స్థిరమైన డిమాండ్‌ ఏర్పడినట్టు, అది రైతులకు ఆదాయాన్ని పెంచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సాయపడుతున్నట్టు వెల్లడించింది.

‘‘దేశ ఇందన భద్రతలో ఇథనాల్‌ కీలక పాత్ర పోషిస్తోంది. కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి, పర్యావరణ అనుకూలమైన రవాణాకు తోడ్పడుతోంది’’అని పెట్రోలియం శాఖ ప్రకటించింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement