E100 ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన! | E100 Fuel Is It the Future Alternative to Petrol | Sakshi
Sakshi News home page

E100 ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన!

Jun 28 2026 3:19 PM | Updated on Jun 28 2026 3:34 PM

E100 Fuel Is It the Future Alternative to Petrol

ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు భారత్ మరో కీలకమైన అడుగు వేసింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ100 (E100) ఇంధనానికి సంబంధించిన నిబంధనలకు ఆమోదం తెలిపారు. దీంతో మన దేశంలో ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే మారుతి సుజుకి, టయోటా, ఎంజీ, హ్యుందాయ్ వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థలు E100 ఇంధనంతో నడిచే వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి.

E100 ఇంధనం
ఈ100 అనేది దాదాపు 100 శాతం ఎథనాల్‌తో తయారైన ఇంధనం. ఇందులో సాధారణ పెట్రోల్ ఉండదు. ఇథనాల్ అనేది పునరుత్పాదక ఇంధనం. దీనిని చెరకు, మొక్కజొన్న, ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాలు వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. ఈ ఇంధనంతో వాహనం పనిచేయాలంటే.. ప్రత్యేకంగా రూపొందించిన ఇంజిన్ ఉండాలి.

ఈ100 ఇంధనం వల్ల లాభాలు
➤విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.
➤దేశంలోనే ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగం పెరుగుతుంది.
➤రైతులకు చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది.
➤గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
➤దేశానికి ఇంధన భద్రత మెరుగుపడుతుంది.

ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానం వల్ల ఇప్పటికే రూ.1 లక్ష కోట్లకు పైగా విదేశీ చమురు దిగుమతి వ్యయం ఆదా కాగా, రైతులకు సుమారు రూ.80 వేల కోట్ల ఆదాయం లభించింది.

E100 ఇంధనం పెట్రోల్‌ను పూర్తిగా భర్తీ చేయగలదా?
భవిష్యత్తులో E100 పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, అది వెంటనే సాధ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కోట్లాది కార్లు, బైకులు, స్కూటర్లు ఈ100 ఇంధనాన్ని ఉపయోగించుకునే విధంగా తయారవ్వలేదు. కొన్ని ఈ20 ఇంధనం మాత్రమే ఉపయోగించుకోగలవు. కాబట్టి కొంతకాలం పాటు పెట్రోల్, E100 రెండూ కలిసి ఉపయోగంలో ఉంటాయి. భవిష్యత్తులో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ E100 వినియోగం కూడా పెరుగుతుంది.

E100 ఇంధనాన్ని సాధారణ వాహనాల్లో ఉపయోగించలేము. ఎందుకంటే ఇథనాల్ రసాయనిక లక్షణాలు పెట్రోల్ కంటే భిన్నంగా ఉంటాయి. అందువల్ల వాహనాల్లో ప్రత్యేక ఇంజిన్ ట్యూనింగ్ అవసరం. కొత్త ఇంజెక్టర్లు, బలమైన ఫ్యూయల్ పంపులు, ప్రత్యేక ఫ్యూయల్ పైపులు, ఇథనాల్‌ను తట్టుకునే భాగాలు అవసరం.

ఇప్పటికే మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ నమూనాను అభివృద్ధి చేసింది. అలాగే టయోటా, ఎంజీ, హ్యుందాయ్, సుజుకి సంస్థలు కూడా ఇలాంటి వాహనాలను తయారు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాల్లో హీరో మోటోకార్ప్ స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను పరిచయం చేసింది.

E100 ఇంధనం వల్ల వచ్చే సమస్యలు
➤ఇథనాల్‌ శక్తి.. పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ. కాబట్టి అదే దూరం ప్రయాణించడానికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది.
➤ప్రస్తుతం ఉన్న సాధారణ వాహనాల్లో ఈ100 ఉపయోగించలేము. ప్రత్యేక ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలే అవసరం.
➤దేశవ్యాప్తంగా ఈ100 అందించాలంటే పెట్రోల్ బంకుల్లో కొత్త నిల్వ ట్యాంకులు, పంపులు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.

భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు
➤దేశమంతటా ఈ100 అందించే ఇంధన కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
➤ఎక్కువ సంఖ్యలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలి.
➤ఇథనాల్ ఉత్పత్తిని స్థిరంగా పెంచుతూ వ్యవసాయ అవసరాలకు కూడా నష్టం కలగకుండా చూడాలి.
➤ప్రజల్లో ఈ100 ఇంధనం గురించి అవగాహన పెంచాలి.

భారతదేశం తన అవసరాలకు కావలసిన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇథనాల్ వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement